Take a fresh look at your lifestyle.

బంద్ వేళలు నాలుగు గంటలు సముచితం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు తలపెట్టిన  భారత్ బంద్ నాలుగు గంటలేనని, ప్రజలకు అసౌకర్యం కల్పించరాదన్న ఉద్దేశ్యంతో   బంద్ వేళలను కుదించామని  రైతు సంఘాల నాయకులు పేర్కొనడం సముచితమే. ప్రభుత్వంలో కదలిక రాకపోవడంతో    నిరసన తెలిపేందుకు భారత్ బంద్ కి  ఈ సంఘాలు పిలుపు ఇచ్చాయి. అయితే,  ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు ప్రారంభించింది.ఈ చర్చల్లో అంగీకారం కుదరనందున బంద్ ను యథాప్రకారం  నిర్వహించాలని  రైతు సంఘాలు నిర్ణయించారు.అయితే, ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని  నాలుగు గంటల పాటే అంటే  మంగళవారం ఉదయ పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ  బంద్ ను నిర్వహించాలని  రైతు సంఘాలు నిర్ణయించాయి.

ఇటు ప్రభుత్వంలోనూ, అటు రైతుల్లోనూ     సరళ వైఖరి కనిపిస్తున్నందున  ఆందోళన విరమణకు అవకాశాలు  కనిపిస్తున్నాయి.   రైతులు చేస్తున్న డిమాండ్లు కొత్తవి కావు. ఇవి యూపీఏ హాయంలోనూ     ఉన్నాయి. అప్పట్లో  ప్రభుత్వం కూడా ఇప్పటి మాదిరిగా కొత్త చట్టాలను తెచ్చేందుకు  ఆలోచన చేసింది.అప్పట్లో ప్రతిపక్షమైన  బీజేపీ ఈ కొత్త చట్టాలను వ్యతిరేకించింది.ఇప్పుడు  స్థానాలు మారడంతో పార్టీల   వైఖరుల్లో  మార్పులు వొచ్చాయి.  ప్రజల కోసం, లేదా రైతుల కోసం కాకుండా , ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వ్యతిరేకించాలి కనుక, వ్యతిరేకించడం ప్రతిపక్షాల  నైజంగా కనిపిస్తోంది.  రైతులు  సాగిస్తున్న ఆందోళనలో  రాజకీయ పార్టీలు  అమీతుమీ తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు    తన వైఖరేంటో స్పష్టం చేయకుండా తమను  విమర్శిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు విమర్శించారు.  మద్దతు ధర కొనసాగుతుందని  కేంద్రం స్పష్టం చేసిన తర్వాతే ఇందుకు సంబంధించిన  బిల్లును తాము సమర్ధించామని ఆయన అన్నారు.అలాగే, తెలంగాణలో ఇటీవల జరిగిన  హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమను  వ్యతిరేకించడంతో ఈ చట్టాలను  తెరాస వ్యతిరేకిస్తోంది.  వ్యవసాయ చట్టాలను కేంద్రం    చర్చకు పెట్టి ఉంటే   పార్టీల అవకాశ వాద వైఖరి వహించేందుకు అవకాశం ఉండేది కాదు.  ఈ చట్టాలను కాంగ్రెస్ యూపీఏ హయాంలో తీసుకుని రావాలని ప్రయత్నించిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటున్నారు.   రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోసం ఆలోచించి పార్టీలు నిర్ణయం తీసుకోవాలి.    భారత్ బంద్ కు తమ పార్టీ మద్దతు లేదనీ, రైతుల ఆందోళనకే తమ మద్దతు అని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు,  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు.

వ్యవసాయ చట్టాల వల్ల  రైతులకు ప్రయోజనం ఉంటే సమర్ధించడంలో తప్పులేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి మటుకు వారు తలోమాట మాట్లాడటం వల్ల  గందరగోళ స్థితి ఏర్పడుతోంది.  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బంద్ కి మద్దతు ప్రకటించారు.  రైతుల బకాయిలు తీర్చడానికి డబ్బు లేదంటున్న ప్రభుత్వం ఇరవైవేల కోట్ల రూపాయిలతో కొత్తగా పార్లమెంటు భవనాల నిర్మాణాన్ని ప్రారంభించిందనీ, ప్రధాని కొత్త విమానానికి  16వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు.  ఆదానీ,అంబానీల కోసమే కొత్త చట్టాలను తెచ్చారని రాహుల్ గాంధీ విమర్శించారు.  సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి  అఖిలేష్ యాదవ్  రైతుల ఆందోళనకు మద్దతు పలికి చురుకుగా పాల్గొంటున్న దృష్ట్యా,ఆయనను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోలో ఆయన చేపట్టిన ధర్నాను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే  ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం,  ఆందోళనకారులపై బలప్రయోగం చేయడంతో మొత్తం మీద భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు స్పష్టం అవుతోంది. మరో వంక బంద్ కి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ ఈ బంద్ కి మద్దతు ప్రకటించారు.

రైతుల సమస్యలపై చర్చించాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.  మద్దతు ధర విషయంలో రైతుల అనుమానాలను తీర్చాలనీ, ధాన్య సేకరణ కార్యక్రమం గతంలో మాదిరిగా జరుగుతుందన్న హామీ ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.అయితే ,   ధాన్య సేకరణ విషయంలో ప్రభుత్వం ఇదమిత్థమైన హామీ ఇవ్వడం లేదు.   అక్కడే రైతుల అనుమానాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్లకు ఈ బాధ్యత అప్పగించేందుకే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.  రిటైల్ మార్కెట్ రంగంలోకి  బడా కార్పొరేట్ సంస్థలను ఎప్పుడైతే అనుమతించారో అప్పుడే ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ బాధ్యత కూడా వాటికే అప్పగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.అందుకే, ఆదానీ, అంబానీ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు.   ఆహార సేకరణ, పంపిణీ బాధ్యత ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని వామపక్షాలు కూడా కోరుతున్నాయి. అలా ఉంటేనే ఉత్పత్తి దారునికీ, వినియోగదారునికీ మేలు జరుగుతుందని వామపక్షాలు వాదిస్తున్నాయి.   మంగళవారం భారత్  బంద్ శాంతియుతంగానే జరగగలదని  భావిస్తున్నారు. అశాంతి చెలరేగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకునే బంద్ వేళలను కుదించామని వారు స్పష్టం చేశారు.

Leave a Reply