Take a fresh look at your lifestyle.

రేపటి భారత్‌ ‌బంద్‌ను విజయవంతం చేయండి

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి
‌కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య పాలనకు గొడ్డలి పెట్టులా ఉన్నాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆరోపించింది. ఇందుకు నిరసనగా ఈనెల 26న దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్‌ ‌బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈమేరకు బుధవారం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటి అధ్యక్షులు టి.లక్ష్మిదేవి, కార్యదర్శి బి.నరసింహ బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేందుకు న్యాయపోరాటం చేయడానికి కూడా వీలు లేకుండా చట్టాలను తేవడం, పరిష్కారానికి వెసులుబాటు నిరోధించడం, వ్యవసాయ, కార్మిక, కర్షక జనబాహుళ్యపు ప్రజాస్వామ్య హక్కుల తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాలని పేర్కొన్నారు.

రాజ్యాంగం పొందుపరచిన హక్కులను కాలరాయడం తప్ప ఇది మరొకటి కాదన్నారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే పద్దతిలో తీసుకువచ్చిన చట్టం అనడంలో సందేహం లేదన్నారు. ఈ చట్టం అమలు కోట్లాది భారతీయ శ్రామిక జనావళికి, ఆహార భద్రతకు ముప్పు వంటిదనీ, అందుకే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ కేంద్ర, రాష్ట్ర కమిటీలు ఈ చట్టాలను ఖండిస్తూ డిసెంబర్‌ 2020 ‌నుంచి ప్రచారం చేస్తున్నాయనీ, ఈ క్రమంలో ఈనెల 26న దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్‌ ‌బంద్‌ ‌కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply