- రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
- డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
- బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంఘాల స్వచ్ఛంద మద్ధ్దతు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలకు నిరసనగా తెలంగాణలో మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలతో పాటు వ్యవసాయ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రంలో పల్లెలు మొదలు నగరాల వరకు రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. మంగళవారం ఉదయం అన్ని పార్టీల ప్రతినిధులు రైతులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాలలో బంద్‌కు మద్దతుగా దుకాణాలు మూయిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మరికొన్ని చోట్ల తెరిచి ఉన్న దుకాణాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఆయా ప్రాంతాలలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
భారత్ బంద్‌లో భాగంగా షాద్‌నగర్ జాతీయ రహదారిపై బూర్గుల టోల్గేట్ వద్ద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ మంత్రి శ్రీనివాసగౌడ్‌తో కలసి రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా వందల సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ధర్నాలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేకి బీజేపీ, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కు తీసుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం •అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. •ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల తరఫున దీర్ఘకాలిక పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఎవరు ద్రోహం చేసినా టీఆర్ఎస్ ఎండగడుతుందని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతన్నలు గత 13 రోజులుగా ఢిల్లీ పుర వీధుల్లో ఎముకలు కొరికే చలిలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు కేంద్ర ప్రభుత్వం సున్నం పెడతున్నదని వ్యాఖ్యానించారు. కార్మికులు, కర్షకుల వైపు మొగ్గు చూపాల్సిన కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం సమంజసం కాదన్నారు. పార్లమెంటులో రైతు వ్యతిరేక కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మందబలంతో మూడు చట్టాలను ఆమోదించుకుందని మండిపడ్డారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో మంత్రులు భారత్ బంద్‌లో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. భారత్ బంద్‌కు మద్దతుగా కరీంనగర్ పట్టణంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు టీఆర్ఎస్ కార్యకర్తలు రాగా రెండు పార్టీ ల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు వెళుతున్న మంత్రి ఈశ్వర్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసి వేశారు. ఆ తరువాత వ్యాపార కార్యకలాపాలన్నీ యధావిధిగా నడిచాయి.