Take a fresh look at your lifestyle.

పెట్రో ఉత్పత్తుల ధరల భగభగ… 26న భారత్‌ ‌బంద్‌

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దాదాపు రోజూ పెరుగుతుండటంతో జనంలో సహనం నశించిపోతుంది. ముఖ్యంగా, ద్విచక్రవాహనాలు ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కాలేజీల్లో చదివే విద్యార్ధులు, నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే యువతీ యువకుల నెలవారీ బడ్జెట్‌ ‌బాగా పెరిగి పోవడంతో ఎవరిని కదిపినా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధర ఒక్క ఫిబ్రవరి మాసంలోనే ఇంతవరకూ లీటరకు ఐదు రూపాయిల వంతున పెరిగాయి. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల తమ చేతుల్లో లేదని ఆనాడు యూపీఏ ప్రభుత్వం చెప్పినట్టే, ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వమూ చెబుతుంది. ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఇచ్చేదేమి ఉండదని ప్రజలకు తెలుసు. అదనపు భారం పడకుండా ఉండటమే ప్రజలకు కావల్సింది. పెట్రోల్‌ ‌ధర తొమ్మిది మాసాల్లో 20 రూపాయిల.57 పైసలు పెరిగింది. అలాగే, డీజిల్‌ ‌ధర పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వందకు ఏభై పైసలు తక్కువగా పెట్రోల్‌ ‌ధర పలుకుతుంది. జంటనగరాల్లో కూడా పెట్రోల్‌ ‌ధర వందకు చేరువగా ఉంది. ఒక్కొక్క బంకుకు ఒక్కొక్క ధరగా ఉంటుంది.

ఇప్పటికే కొన్ని బంకుల్లో వందరూపాయిలు వసూలు చేస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ లేదు. ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రోజుకు పది ఇరవై, ముప్పయి పైసల వంతున ధర పెంచేస్తున్నారు. ఇంత జోరుగా ధరలు ఎన్నడూ పెరగలేదని పెట్రోల్‌ ‌వ్యాపారంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు పూర్వపు యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల పేర్కొనడం జనానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. యూపీఏ హయాంలో ధరలు పెరగలేదని కాదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారంలోకి వొస్తే పెట్రోల్‌ ‌ధర తరచూ పెరగకుండా మెకానిజాన్ని ప్రవేశపెడతామని వాగ్దానం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ఆరేళ్ళు దాటినా ఎటువంటి మెకానిజం కనిపించడం లేదు. ప్రధాని ఇటీవల మాట్లాడుతూ ఇథనాల్‌ ‌కలిపితే పెట్రోల్‌ ‌ధర తగ్గించవొచ్చని సూచించారు. చాలా చోట్ల ఇదే పద్దతిని పాటిస్తున్నారని ఆయన అన్నారు. అయితే, ఇథనాల్‌ ‌కలపడం వల్ల పెట్రోల్‌ ‌నాణ్యత తగ్గి బండ్లు ఆగిపోవడమో, ప్రమాదాలు సంభవించడమో జరుగుతుందని జనం ఆందోళన చెందుతున్నారు.

పెట్రోల్‌, ‌డీజిల్‌పై రాష్ట్రాలు వేసే పన్నులే అధికంగా ఉంటున్నాయనీ, రాష్ట్రాలు తమ పరిధిలో ఉన్న పన్నులను తగ్గించవొచ్చని ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయం కొత్తదేమీ కాదు. యూపీఏ చైర్‌ ‌పర్సన్‌ ‌సోనియాగాంధీ ఇటీవల ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ఈ రెండు ఉత్పత్తులపైవేసే సుంకాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ మిత్ర పక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు కూడా అధికంగానే ఉన్నాయి. అందువల్ల ఈ విషయంలో చొరవ తీసుకోవల్సింది బీజేపీ నాయకత్వమేనన్న సోనియా సూచనలో అసత్యం ఏమీ లేదు. అన్నింటికన్నా చమురు ధర పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులపై లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపర్చింది.

ధరల సంగతి గురించి ఏమాత్రం స్పృహ లేని వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉన్నారని జనం అనుకుంటున్నారు. సామాన్య ప్రజలు, ముఖ్యంగా రోజువారీ వేతన జీవులు ధరల పెరుగుదలతో మలమల మాడిపోతున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి రాలేదంటే ఎవరూ నమ్మరు. కేంద్రం అంతా బాగా ఉందనే భావన కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్ర బడ్జట్‌, ఆర్థిక సర్వేలలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజల దైనందిన బాధలను పట్టించుకోకుండా హావభావాలతో దీర్ఘోపన్యాసాలు ఇస్తే ఎవరి కడుపునిండుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హిందూస్తాన్‌ ‌పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌, ‌భారత్‌ ‌పెట్రోలియం కంపెనీల పెట్రో పంపుల్లో తలో రీతిలో ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. రవాణా చార్జీల పేరిట లీటరుకు ఇరవై నుంచి ముప్పయి పైసల వంతున అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే రవాణా చార్జీలు పెరిగాయన్న సంగతి తెలియదా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రవాణా చార్జీలు పెట్రోలియం ఉత్పత్తులకే కాదు, పళ్ళు, కూరగాయలు, నిత్యావసర వస్తువులకూ వర్తిస్తాయి. ఆయిల్‌ ‌ధర ఈ మధ్య కాలంలో లీటర్‌కు ఇరవై నుంచి నలభై రూపాయిలు పెరిగిపోయింది. దానికి కూడా అదే కారణం చెబుతున్నారు.

రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ‌పన్నుల్లో తేడాలుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలుపుకోసం సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నాయే తప్ప ధరల తగ్గింపుపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సమీక్షా సమావేశాలను నిర్వహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే తీరులో ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో గెలుపొంది వీలైనన్ని సీట్లు సాధించాలనే యావతోనే పని చేస్తున్నాయి. తప్ప ప్రభుత్వం అనేది ధరల నియంత్రణ చేయడానికన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి పోతున్నాయి. ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుని అంతిమంగా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నాయి. పెట్రో మంటలకు నిరసనగా ఫిబ్రవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా బంద్‌కు కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌ట్రేడర్స్ ‌పిలుపు ఇచ్చింది. దీనికి కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. కేంద్రం ఈ విషయమై దిగి రావాలని కాన్‌ ‌పెడరేషన్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయ కోణంలో పరిశీలిస్తున్న ప్రభుత్వ వర్తకులు, వాణిజ్యవేత్తల అవసరాలను విస్మరిస్తోందని ఫెడరేషన్‌ ‌విమర్శించింది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణకు ఇప్పటికైనా కేంద్రం తన చేతిలో ఉన్న అధికారాలను ఉపయోగించాలని కార్మిక, వాణిజ్య,వ్యాపార సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Leave a Reply