Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా భారత్‌ ‌బంద్‌

  • ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం
  • బంద్‌తో స్తంభించిన రవాణా వ్యవస్థ
  • ఢిల్లీ సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్‌ ‌జామ్‌
  • ‌రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన రైతు సంఘాల నేతలు

వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంస్థలు ఇచ్చిన ‘భారత్‌ ‌బంద్‌’ ‌సోమవారం దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్‌తో రైతులు ఎక్కడిక్కడే రహదారుల దిగ్భందనం చేపట్టారు. పంజాబ్‌, ‌హర్యానాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, లింక్‌ ‌రోడ్లు, రైల్వే ట్రాక్‌లను రైతులు దిగ్బంధం చేశారు. రోడ్లు, రైల్‌ ‌ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రాష్టాల్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించడంతో రవాణా బస్సులను నిలిపివేశారు. షాపులు మూసి వ్యాపారులు మద్దతు ప్రకటించారు. పంజాబ్‌లో రైతులు 350కి పైగా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ ‌బంద్‌ ‌నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్‌-‌ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది.

ఎల్‌డీఎఫ్‌, ‌యూడీఎఫ్‌కు అనుబం ధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్‌ ‌బంద్‌లో పాల్గొన్నాయి. ఢిల్లీ- అమృత్‌సర్‌ ‌జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. కేరళలో భారత్‌ ‌బంద్‌ ‌ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. భారత్‌ ‌బంద్‌లో భాగంగా పంజాబ్‌-‌హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు రైతులు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని  ఘజిపూర్‌ ‌సరిహద్దులో రైతుల నిరసన కొనసాగింది. రైతుల నిరసనలతో ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌నుంచి ఘజిపూర్‌ ‌వైపు వెళ్లే వాహనాలు నిలిచి పోయాయి. ప్రదర్శనా స్థలాల్లో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడాలని పోలీసు బలగాలకు పంజాబ్‌ అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ఆదేశాలిచ్చారు. ధర్నా ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఉంచారు.

హర్యానాలోనూ హైవేలు దిగ్బంధం చేశారు. ఒక్క జింద్‌ ‌జిల్లాలోనే 25 ప్రాంతాలను దిగ్బంధం చేశారు. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాలు బంద్‌కు దిగడంతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. బంద్‌ ‌సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూసి ఉంచాలని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మెడికల్‌ ‌షాపులు, సహాయ, పునారావాస కార్యక్రమాలు, వ్యక్తిగత ఎమర్జెన్సీ పనులకు హాజరయ్యే వారికి బంద్‌ ‌నుంచి మినహాయింపు ఇచ్చింది. స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంద్‌ ‌పాటించాలని కోరింది. కాగా, బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు.

Leave a Reply