పేరుకుపోయిన
జ్ఞానాలు, జ్ఞాపకాలు!
పెరిగిపోయిన
బంధాలు, రాగాలు!
గణాంకాలు తెలిసేలోగా
గుణింతాలు అయ్యేలోపు
కాలం కదిలిపోతోంది!
బంధం జరిగిపోతోంది!
వింతమలుపులు తిరుగుతూ
విచిత్రంగా గమనం సాగుతుంది!
మలుపు దాటవేళ మరులు
పడుతూ మధనం పుడుతుంది!
పాఠం అయ్యేవేళకు పరీక్షవుండదు!
పరీక్ష రాసేవేళకు పఠనం అవ్వదు!
వసంతాన్ని అర్ధవంతంగా
ఆస్వాదించేలోపు!
శిశిరం స్వాగతసత్కారాలు
పలుకుతుంది!
ఒక జీవితం అర్ధం కావాలంటే
ఒక జీవిత కాలం సరిపోదేమో!
అర్ధం అయిందన్న జీవితంలో
ఇక మిగులు కాలం ఉండదేమో!
చదివేసిన తత్వాలు
చవిచూసిన అనుభవాలు!
అక్కరకు రాని బలాలు
అభ్యసించిన విద్యలు!
వచ్చే జీవితానికి
పోగేసిన ధరావత్తుగా
ఉంటే బాగుంటుందేమో!
గణించిన సముపార్జనతో
మొదలైతే బాగుంటుందేమో!
– ఉషారం, 9553875577