Take a fresh look at your lifestyle.

‘‘భవాని’’గా భద్రకాళి అమ్మవారు

వరంగల్‌: ‌ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవములు ఆరవ రోజుకు చేరుకున్నాయి.  ఉదయం గం।। 4-00లకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజకాగానే అమ్మవారికి నవరాత్ర విశేష సేవలు ఆరంభింపబడ్డాయి. ఆరవ  రోజు శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ‘‘భవాని’’గా అలంకరించి చతుస్థానార్చన జరిపారు. నవరాత్ర వ్రతంలో వరాహ పురాణాంతర్గత నవదుర్గా విధానాన్ని అనుసరించి అమ్మవారికి కాత్యాయని దుర్గా క్రమంలో మరియు బోధాయన ప్రణీత ఆగమోక్త దేవపూజా విధిననుసరించి చండముండహా దుర్గాక్రమంలో పూజాదికములు నిర్వర్తించి ఉదయం పల్లకీ సేవ సాయంకాల శేషవాహన సేవ నిర్వహించారు.

యత్రాస్తి మోక్షో నచతత్ర భోగో యత్రాస్తి భోగో నచతత్ర మోక్షః।
శ్రీ సుందరీ సేవన తత్పరానాం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ।।

ఎక్కడయితే మోక్షముంటుందో అక్కడ భోగముండదు.  ఎక్కడయితే భోగముంటుందో అక్కడ మోక్షముండదు.  అమ్మవారి భక్తులకు భోగమోక్షాలు రెండూ ఉంటాయని శాస్త్రం చెబుతోంది.  శంకరుడికి అమ్మవారు భవాని రూపంలో సమస్త భోగాలను ఇస్తుంది.  కావున భవానీ రూపంలో ఆరాధింపబడిన  అమ్మవారి అనుగ్రహం వలన ప్రజలకు సమస్తమైన భోగములు సమకూరుతాయి.  అందుకే అమ్మవారిని భవానిగా అలంకరించడంలో విశేషం. గురువారం  కార్యక్రమాలకు ఉభయదాతలుగా సూర్యకుటీర్‌, ‌హన్మకొండ అధినేతలు తంగెళ్ళపల్లి సంపత్‌కుమార్‌-‌తిరుమలాదేవి దంపతులు,  హర్షవర్ధన్‌-‌సుష్మ దంపతులు వ్యవహరించారు. గురువారం  అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో కుడా చైర్మన్‌ ‌మర్రియాదవ రెడ్డి దంపతులు సెంట్రల్‌ ‌జోన్‌ ‌డి.సి.పి శ్రీమతి పుష్ప తదితరులున్నారు. ఆలయానికి విచ్చేసిన కుడా చైర్మన్‌ ‌మర్రియాదవ రెడ్డి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.  పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములను బహూకరించి ప్రసాదములు అందజేశారు. దేవస్థానం అర్చకులు మరియు నాల్గవ తరగతి సిబ్బందికి ప్రవాస భారతీయులు కరీంనగర్‌ ‌జిల్లా వల్లంపాడు వాస్తవ్యులు  పెంచాల భాస్కర్‌రావు-శిరీష దంపతులు ప్రతి ఒక్కరికి 25 కిలోల బియ్యం నెలకు సరిపడ సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ శ్రీమతి సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, పర్యవేక్షకులు  అద్దంకి విజయ్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply