Take a fresh look at your lifestyle.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణానికి సర్వంసిద్దం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం రేపు అనగా 21 వతేదీ బుధవారం జరుగనుంది. 22 వతేదీన మహాపట్టాభిషేకం జరగనుంది. కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీస్వామివారి కల్యాణం అంతరంగికంగానే జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేసారు. ఆలయం అంతా రంగురంగు విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించారు. కేవలం అర్చకులు, వేదపండితులు, ఆలయ ఉద్యోగులతోనే నిర్వహించనున్నారు. శ్రీ ప్లవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ ‌లగ్నమందు  కల్యాణం జరుగుతుంది. శివధనస్సును విరిచిన శ్రీ రామచంద్రమూర్తికి మిధిలానగరంలో జనకుని పుత్రిక అయిన సీతామహాలక్ష్మీకి ఆనాడు పెండ్లి జరిగితే భద్రాచలంలో ఉన్న చతుర్భుజాలు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశం గల వైకుంఠ రాముడు వరుడుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ స్వరూపురాలు అయిన సీతమ్మ వధువుగా కల్యాణం జరగడం విశేషం. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నిర్వచనం ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీ సీతారాములు తెలుగువారి ఇలవేల్పు భదాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు, త్యాగరాజులకు ఆయన ఆరాధ్యదైవం అయ్యాడు. ఆరాధనకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధన చేయడం భద్రాచలం క్షేత్రంలోని ప్రత్యేకత. భదాద్రిలో శ్రీ సీతారామనవమి నాడు జరిగే కల్యాణాన్ని అనుసరించి తమ తమ గ్రామాలు, పట్టణాల్లో, ఇండ్లల్లో కల్యాణాలు జరుపుకోవడం తెలుగువారి ఆనవాయితీ. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ధృవమూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఈఏడాది కూడా కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంవలన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయంలోనే నిత్యకల్యాణం మండపంలో శ్రీ స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

 

పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా !!.. అని భక్తరామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు.
చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా !! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ పతకాన్ని శ్రీరామనవమి నాడు, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో సీతమ్మ తల్లికి అలంకరిస్తారు.
మంగళసూత్రం : మూడు మంగల్యాలు గల మంగళ సూత్రాన్ని రామదాసుగారు చేయించారు. ఒకటి దశరధ మహారాజుగారి తరుపున, రెండు జనక మహారాజు తరపున, మూడు శ్రీ భక్తరామదాసు గారే కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మహోత్సవము జరుగును.
శ్రీరామ మాడ : రామదాసుని చెరనుండి విడిపించడానికి రామలక్ష్మణులిద్దరూ గోల్కొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాతో వెళ్ళి, ఆలయం నిర్మించడానికై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణానికే రామ మాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి మరియు ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.

Leave a Reply