Take a fresh look at your lifestyle.

ఆవేశం కాదు ఆలోచన కావాలి

“బేటీ బచావో, బేటీ పడావో అని గంభీరంగా ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వాలు, ఆడపిల్లల రక్షణ కోసం, వారి చదువు ఏ అడ్డంకులూ లేకుండా కొనసాగటానికి వ్యవస్థా పూర్వకంగా ఏఏ మద్ధతు వ్యవస్థలను ఏర్పరచాయి? గ్రామాల నుంచీ ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించని ప్రభుత్వాలు పేద ఆడపిల్లల చదువు ఆగిపోవటానికి కారణం కాదా? కేవలం రవాణా సౌకర్యం లేకపోబట్టే కదా బొమ్మల రామారం గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే ఉన్మాదుడి చేతిలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయింది. రవాణా సౌకర్యం కల్పించని ప్రభుత్వం ఆ నేరంలో భాగం కాదా? వరంగల్‌ ‌లో తొమ్మిది నెలల పాప మీద అత్యాచారం చేయొచ్చనే భావజాలాన్ని ఆ యువకుడి మెదడులో కూరిన వ్యవస్థ ఏమిటి? ఆడపిల్ల వంటరిగా కనిపిస్తే ఏమైనా చేయొచ్చనే ఉన్మాద ఆధిపత్య భావజాలాన్ని నిరంతరం పెంచి పోషించటం అన్ని స్థాయిల్లో నిర్లజ్జగా అనుమతించడం వల్లే కదా ‘దిశ’ బలయిపోయింది. సరైన సమయంలో స్పందించని అధికార యంత్రాంగ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా, తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ప్రస్తావించకుండా ‘ఆ నలుగురిని’ ఏ రాజ్యాంగబద్ధమైన విచారణ జరపకుండా ఎన్కౌంటర్‌ ‌లో చంపేయటం అంగీకారయోగ్యం ఎలా అవుతుంది?.”

sanketham sajayaఒకపక్క అమీన్పూర్‌ అనాధాశ్రమంలో పద్నాలుగేళ్ళ అమ్మా యి మీద జరిగిన అత్యాచారం విషయం వార్తల్లో వున్నప్పుడే అందరూ ఉలిక్కిప డేలాంటి సంఘటన హైదరా బాద్‌ ‌పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో పెద్ద సంఖ్యతో నమోదైన అత్యాచార ఘటన. తదుపరి పరిణామాలలో ముందు చెప్పినంతమంది అను మానితులు లేరని, ఎవడైతే ‘ఆ అమ్మా యిని రక్షించాను’ అని హల్చల్‌ ‌చేశాడో అతనే ఆమెతో అత్యంత హింసాత్మకంగా వ్యవహరించిన వ్యక్తిగా కూడా బయటకు రావటం. పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో ఎఫ్‌ఐఆర్‌ అయిన వెంటనే వార్తల్లోకి వచ్చిన ఈ విషయం అందులో పేర్కొన్న సంఖ్యను బట్టి, పైగా కొంతమంది సినిమా, టీవీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా వున్నారనగానే ప్రకంపనాలు సృష్టించింది. షరా మామూలే అన్నట్లుగా సోషల్‌ ‌మీడియాలో ఎవరికి తోచిన వాదనలు వారు చేస్తూ, తీర్పులు ఇస్తూనే వున్నారు. అందులో ప్రధానమైనది ‘దిశ’ కేసులో చేసినట్లు ఇందులో పేర్కొన్నవారిని ఎన్కౌంటర్‌ ఎం‌దుకు చేయట్లేదని! ఆవేశంలో వచ్చిన ఈ అభిప్రాయాలను పక్కన పెట్టి కొంచం సహనంతో విషయాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. సామాజికంగా అణగారిన తెగ ‘ఎరుకల’ సమూహానికి చెందిన బాధితురాలు ‘భూమి’(అసలు పేరు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పేదేమిటంటే అత్యాచార బాధితురాలి అసలు పేరును, ఫోటోలను, వీడియోలను గానీ ఎవరు ఉపయోగించినా చట్టప్రకారం శిక్షార్హులు) ఈ దుర్మార్గమైన పితృస్వామ్య కులాహంకార సమాజానికి చిన్న వయసులోనే ఎలా బలై పోయిందో, దానికి దోహదం చేసిన అంశాలేమిటో విశ్లేషించుకోవాలి.

‘భూమి’ కి పదవ తరగతి అయిన వెంటనే బంధువుల్లోనే ఒకతనికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళికి ముందు చదువు చెప్పిస్తామనే చెప్పారు కానీ, అక్కడ వయసుకు మించిన పనిభారమే మిగిలింది. పైగా లైంగిక పరంగా శారీరిక హింస, తత్ఫలితంగా జరిగిన గర్భస్రావం. అన్నీ ఆ చిన్నవయసులో అయోమయాన్ని, భయాన్ని కలిగించాయి. చదువుకోవాలనే కొండంత ఆశ వున్న భూమికి ఈ పెళ్లి, తదనంతర పరిణామాలన్నీ ఊహించనివే. పెళ్లి పేరుతో జరిగే ఆ హింసను తట్టుకోలేక కులపెద్దల సమక్షంలో పంచాయితీకి వెళ్లి ఆ బంధం నుంచీ బయట పడింది, మళ్లీ కాలేజీలో జేరి చదువుకోవటం మొదలు పెట్టింది. భూమి స్పష్టంగా చెబుతున్నదేమిటంటే, పెళ్ళిలో చాలా హింసను అనుభవించినప్పటికీ, ఒకసారి విడిపోయిన తర్వాత అటువైపు నుంచీ ఏ సమస్యా మళ్లీ రాలేదు. ఈ నేపథ్యంలో కాలేజీలో పరిచయమైన ఒక స్నేహితురాలు తన అన్నకి పరిచయం చేసింది. అతను అప్పట్లో ఒక వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు. ‘అన్న’ అని పిలవమంటూనే అత్యాచారం చేసి లొంగదీసుకున్నాడు. అందమైన అమ్మాయి, పైగా పెళ్లి విచ్చిన్నమైన అణగారిన తెగకు చెందిన అమ్మాయి, అంది వచ్చిన అవకాశంగా తీసుకున్నాడు. సన్నిహితంగా వున్నప్పుడు ఫోటోలు తీసుకున్నానని చెబుతూ బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసి ఆమె నోరు మూయించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయం, తల్లిదండ్రులకు చెప్పుకుంటే చదువు వద్దని మానిపిస్తారేమోననే భయం(అప్పటికి ఆమె ఇంకా మైనరే!)అన్నీ కలిసి ఆమె తనలో తానే ఆ కష్టాన్ని ఇముడ్చుకుని ఇంటర్‌ ‌పూర్తి చేసింది. జరిగిన చేదు అనుభవాన్ని మర్చిపోయి కొత్త జీవితం కోసం హైదరాబాద్‌ ‌లో డిగ్రీ లో జేరింది. ఆమె నిశ్శబ్దాన్ని అలుసుగా తీసుకున్న అతను, ఆమె వెన్నంటే వచ్చి ఆమెకు ఇష్టం లేకపోయినా గానీ, స్వప్రయోజనాలకోసం తన స్నేహితులకు ఎర వేసేశాడు. ఆడవాళ్లను లైంగికంగా హింసించటానికి, వాడుకోవటానికి కుల బేధాలుండని ‘పితృస్వామ్య’ పురుషాహంకార సమాజం ఇది. ప్రతి చోటా ఇదేరకమైన బెదిరింపు, హేళన! స్వకులంలో పెళ్లి పేరుతో మొదలైన హింస, తదనంతర కాలంలో దళిత యువకుల దగ్గరనుంచీ వంచనతో ప్రారంభమయ్యి ఆ తర్వాత అన్ని కులాలవారితో పరాకాష్టకు చేరింది! ముందు ప్రతి ఒక్కడూ ఆమెకు సహాయం చేస్తామని నమ్మించడం, ఆమెతో ఫోటోలు వున్నాయని బెదిరించడం, ఇంకొకడికి పరిచయం చేయటం. ఈ గొలుసు అలా పెరుగుతూనే వెళ్లింది. లైంగికంగా ‘అందుబాటు’ లో వున్న అమ్మాయిగా తన ప్రమేయం లేకుండానే ఆమె మీద ‘ముద్ర’ పడిపోయింది. అందులో ఆమె ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు ఎవడికీ! సామాజికబలం లేని ఒక పేదింటి అమ్మాయి మీద, ప్రతి ఒక్కరూ తమకు ‘హక్కు’ వుందనుకున్నారు. వద్దని ఎదురు తిరిగితే కులపరమైన అవమానాలూ, హింస నిత్యకృత్యం అయిపోయాయి.

సహాయం చేస్తామని నమ్మించిన ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ఆమె వంటరి అసహాయ స్థితిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. ఆమెని ఆ ఊబిలోనుంచీ బయట పడెయ్యటానికి ఎవరూ సహాయం చేయలేదు. దానితో ఏ మనుషుల మీదా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. తను ఆ పూర్తిగా ఆ బురదలోకి వెళ్లిపోతున్నానని తెలిసినా గానీ తనంతట తాను బయటకు రాలేని అసహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ క్రమమంతా అంతులేని గాయాలతోనే వున్నప్పటికీ పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌వరకూ చదువు పూర్తి చేసుకోగలిగింది. ఎక్కడా చదువుని వదిలిపెట్టలేదు. అయితే, తనకంటూ ఒక స్థిరమైన జీవితాన్ని నిర్మించుకునే క్రమం ఎక్కడా సులభంగా అందలేదు. ఈ క్రమంలో తాను బాగా ఇష్టపడిన వ్యక్తి, నిన్ను నేను కాపాడతాను అని నమ్మించిన వ్యక్తే అత్యంత దారుణంగా ఆమె సన్నిహితంగా వున్న ఫోటోలను సోషల్‌ ‌మీడియాలో పెట్టి వంచించడం ఆమెని మరింత వేదనలోకి నెట్టేసింది. దారితప్పితే ఆదుకునే స్నేహ హస్తాలేవీ ఆమె వరకూ రాలేదు. మొదటి నుంచీ సహాయం చేస్తామని మోసం చేసిన వాళ్లే ఉండటంతో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. ఉద్యోగం పేరుతో సహాయం చేస్తానని నమ్మించిన చివరి వ్యక్తి ఎవడైతే వున్నాడో అతను పెట్టినంత శారీరిక, లైంగిక, మానసిక హింస అయితే అన్నిటికీ పరాకాష్ట అనే చెప్పాలి. అప్పటికే రెండు పెళ్లిల్లు చేసుకుని వారిని మోసం చేసిన ఆ వ్యక్తి భూమిని తీవ్రమైన శారీరిక హింసకు గురిచేసి ఆమె గత జీవితంలో జరిగిన అన్ని విషయాలనూ రాబట్టాడు. వాటిని అడ్డం పెట్టుకుని అవతలి వ్యక్తులను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసి డబ్బులు గుంజే ప్రయత్నానికి తెర తీశాడు. సంబంధం లేనివాళ్ళను కూడా దానిలో ఇరికించాడు. హింసించి ఆమెని దానికి వొప్పించాడు. ఒక వంద పేజీలతో ఫిర్యాదు రాయించి పోలీసు స్టేషన్కి తీసుకెళ్లాడు. ఒక అభాగ్యురాలైన మహిళను కాపాడిన ఉత్తమోత్తముడిగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంకోపక్క పోలీసులు ఆమెని అవమానించారని, తమకు ప్రాణహాని వుందంటూ ప్రచారం చేశాడు. వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన వెంటనే స్పందించిన ఎరుకల కుల సంఘం, మహిళా సంఘాల వారూ, అతని ప్రవర్తనపై మొదటి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తూనే వున్నారు. ఆమె తల్లిదండ్రులను కూడా అతను భయపెట్టే క్రమంలో అతని వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా పట్టుకుని ఆమె రక్షణ బాధ్యతని కుల సంఘం వారు తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో వుంది. ఇలాంటి విషయాలలో ఎన్కౌంటర్లు చేయాలనే అసంబద్ధ చట్ట వ్యతిరేక డిమాండ్లు కాకుండా, పోలీసులు వేగవంతంగా, నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని మనందరం డిమాండ్‌ ‌చేయాలి.

వీటితో పాటు పౌర సమాజంగా మనం ఇక్కడ వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు చాలా వున్నాయి. వాటిని పక్కనబెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు తీర్పులూ, బాధితురాలిని హేళన చేయటం, మద్దతుగా నిలబడిన వారి మీద ట్రోలింగ్‌ ‌చేయటం వలన ప్రయోజనం కన్నా సామాజికంగా జరిగే నష్టమే ఎక్కువుంటుంది. ఇక్కడ రావాల్సిన మొదటి ప్రశ్న చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెళ్లిల్లు చేయవలసిన సామాజిక, ఆర్ధిక వత్తిడులు కేవలం కొన్ని అణగారిన సామాజిక సమూహాలకే ఎందుకు ఎదురవుతున్నాయి? దీనికి పూర్తిగా బాధ్యత కేవలం ఆ తల్లిదండ్రులది మాత్రమేనా? వారిని నేరస్తులుగా పెదరాయుడి తీర్పులు ఇవ్వటం సరైనదేనా? బేటీ బచావో, బేటీ పడావో అని గంభీరంగా ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వాలు, ఆడపిల్లల రక్షణ కోసం, వారి చదువు ఏ అడ్డంకులూ లేకుండా కొనసాగటానికి వ్యవస్థా పూర్వకంగా ఏఏ మద్ధతు వ్యవస్థలను ఏర్పరచాయి? గ్రామాల నుంచీ ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించని ప్రభుత్వాలు పేద ఆడపిల్లల చదువు ఆగిపోవటానికి కారణం కాదా? కేవలం రవాణా సౌకర్యం లేకపోబట్టే కదా బొమ్మల రామారం గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే ఉన్మాదుడి చేతిలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోయింది. రవాణా సౌకర్యం కల్పించని ప్రభుత్వం ఆ నేరంలో భాగం కాదా? వరంగల్‌ ‌లో తొమ్మిది నెలల పాప మీద అత్యాచారం చేయొచ్చనే భావజాలాన్ని ఆ యువకుడి మెదడులో కూరిన వ్యవస్థ ఏమిటి? ఆడపిల్ల వంటరిగా కనిపిస్తే ఏమైనా చేయొచ్చనే ఉన్మాద ఆధిపత్య భావజాలాన్ని నిరంతరం పెంచి పోషించటం అన్ని స్థాయిల్లో నిర్లజ్జగా అనుమతించడం వల్లే కదా ‘దిశ’ బలయిపోయింది. సరైన సమయంలో స్పందించని అధికార యంత్రాంగ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా, తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ప్రస్తావించకుండా ‘ఆ నలుగురిని’ ఏ రాజ్యాంగబద్ధమైన విచారణ జరపకుండా ఎన్కౌంటర్‌ ‌లో చంపేయటం అంగీకారయోగ్యం ఎలా అవుతుంది?

అత్యాచారాలు వెలుగు లోకి వచ్చే కొద్దీ సామాన్య ప్రజానీకంలో ఆడపిల్లల పట్ల నిర్బంధం, సామాజిక ఆంక్షలు మరింత పెరుగుతూ వస్తున్నాయి. నిజానికి అత్యాచారాల మూలాలను పెకిలించి వేయటంలో తీసుకోవాల్సిన విధానాల మార్పుల కన్నా వోటు బ్యాంకు నిర్మించుకోవటం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ‌ల మీదే ప్రభుత్వం దృష్టి పెట్టింది కానీ, అణగారిన వర్గాల, సమూహాల ఆడపిల్లల ఉన్నతవిద్య, రక్షణ తన బాధ్యతగా ఏ మాత్రం తీసుకోలేదు. ఈ రెండు పథకాలూ కూడా ఆడపిల్లలను మరింత గృహ హింసకు గురిచేస్తున్నాయనటానికి ఎంతమాత్రం సందేహ పడనవసరం లేదు. అత్యాచార సంస్కృతి పెరగటానికి ప్రధానమైనది దుర్మార్గమైన పురుషాధిపత్య భావజాలం. దానికి తోడయ్యేది ఆధిపత్య మత, కులోన్మాదం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక మహిళా కమిషన్‌ ‌ను ఏర్పాటు చేయలేదు. ఎవరు ఎన్ని రకాలుగా మొత్తుకుంటున్నా గానీ, ప్రభుత్వానికి అసలు చెవి మీద పేను వారినట్లు కూడా లేదు ఈ విషయంలో! ఉమెన్స్ ‌కమిషన్‌ ‌వుంటే అత్యాచారాలు ఆగుతాయా అని అడిగేవాళ్లు ఎంతోమంది వుంటారు. నిజమే, అత్యాచారాలు ఆగకపోవచ్చు, దానికి మూలాలు వేరే వున్నాయి. కానీ, అలాంటి వ్యవస్థ ఒకటి భరోసాగా వుంటుందనే నమ్మకం భూమి లాంటి ఆడపిల్లల దృష్టికి వచ్చేలా చేసి వుంటే మొదట్లోనే తెగించి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలిగి ఉండేదేమో కనీసం!.

Leave a Reply