Take a fresh look at your lifestyle.

బెట్టు వీడని కేంద్రం.. పట్టు వీడని రైతులు

  • రైతులతో చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
  • 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయం

‌వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గకపోవడం, రైతులు అదే డిమాండ్‌ను ప్రధాన ఎజెండాగా పట్టుబట్టడంతో సోమవారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ ‌తోమర్‌, ‌పీయూష్‌ ‌గోయల్‌, ‌సోంప్రకాశ్‌ ‌రైతు సంఘాల నేతలతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సుదీర్గంగా జరిగిన ఏడో విడత చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్ట•ద్ధత కల్పించాలని రైతులు పట్టుబట్టుతుండగా, కేంద్రం అందుకు ససేమిరా అంది. దీంతో జనవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కాగా, కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదా అని అడిగారనీ, దీనికి సమాధానంగా తాము లేదని చెప్పామని తెలిపారు. రైతు సంఘాల నేతల డిమాండ్లపై చర్చించి తదుపరి చర్చలకు వస్తామని మంత్రులు చెప్పారని వివరించారు.

మంగళవారం తాము సమావేశమై ఈనెల 8న జరుగనున్న చర్చలలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై చట్టబద్దత కల్పించడం తమ ప్రధాన డిమాండ్లని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ ఇంటికి వెళ్లబోమని కేంద్ర మంత్రులకు తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలపై క్లాజుల వారీగా చర్చిద్దామని రైతులను కోరామనీ, అయితే, రైతులతో ఎలాంటి పరిష్కారానికి రాలేక పోయినట్లు చెప్పారు. సోమవారం జరిగిన చర్చలలో కొంతమేర ఏకాభిప్రాయం కుదిరిందనే తాము భావిస్తున్నామనీ, తరువాత జరిగే సమావేశంలో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని తోమర్‌ ‌వ్యక్తం చేశారు. కాగా, డిసెంబర్‌ 30‌న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆరో విడత చర్చలలో దాదాపుగా సగం అంశాలపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది.

Leave a Reply