Take a fresh look at your lifestyle.

వృత్తి ధర్మానికే కాదు దేశానికే ద్రోహం..!

రెండు రోజుల క్రితం ఒక విశేషం చోటు చేసుకుంది. నిజానికి అది ఓ విప్లవాత్మకమైన పరిణామం కిందే లెక్క. మనం చేసేది జర్నలిజం కాదు అని ఓ మీడియా సంస్థలో పని చేసే జర్నలిస్టులు, ఉద్యోగులు తమ ఎడిటర్లకు లేఖ రాశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉద్యోగం ఉంటే చాలులే ఏదెట్లా పోతే మనకేం అని మెజారిటీ జనం అనుకునే సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ పరిణామం చూసి మనం కాస్త ఆశ్చర్యపోవడం సహజమే. టైమ్స్ ‌నౌ అనే ఇంగ్లీష్‌ ‌న్యూస్‌ ‌ఛానల్‌ ‌లో సంభవించిందీ పరిణామం. ఈ నేషనల్‌ ‌ఛానల్‌ ‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌ ‌లో భాగం. రాహుల్‌ ‌శివశంకర్‌, ‌నావికా కుమార్‌, ‌పద్మజా జోషి అనే ముగ్గురు జర్నలిస్టులు టైమ్స్ ‌నౌ లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ముగ్గురినీ ఉద్దేశించి టైమ్స్ ‌నౌ జర్నలిస్టులు లేఖ రాశారు. లేఖలో వారు కుండ బద్దలు కొట్టారు. నందిని నంది పందిని పంది అనడానికి ఏ మాత్రం సందేహించలేదు. వారు ఆ లేఖలో ఏం రాసిందీ వారి మాటల్లోనే క్లుప్తంగా చెబుతాను వినండి. ఎడిటర్లకు జర్నలిజం ప్రాధమిక సూత్రాలు చెప్పాల్సిన రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు.

ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండండి. అధికారంలో ఉన్న వారిని నిలదీయండి అని మా జర్నలిజం గురువులు చెప్పారు. టైమ్స్ ‌నౌలో ప్రస్తుతం జరిగేది దానికి పూర్తి వ్యతిరేకం. జర్నలిస్టులుగా మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలుసు. కొరోనా సోకిన జనం హాస్పిటల్‌ ‌లో బెడ్‌ ‌కోసం వీధుల్లో..అంబులెన్స్ ‌ల్లో పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నావారు ఆక్సిజన్‌ ‌దొరకక అల్లాడుతున్నారు. కొందరు నిర్భాగ్యులు కన్నుమూస్తున్నారు. ప్రాణాధార ఔషధాలు దొరకడంలేదు. ప్రభుత్వం కన్నా మంచి మనసున్న మారాజులే కోవిడ్‌ ‌రోగులను ఎక్కువ ఆదుకుంటున్నట్లు కనబడుతోంది. మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. మన కళ్ల ముందు ఓ పెను విపత్తు విచ్చుకుంటున్నది. పెద్ద  పేరున్న మన టైమ్స్ ‌నౌ ఛానల్‌ ‌లో జర్నలిస్టులుగా మనం ఏం చేస్తున్నాం.  మనం ఇంకా ప్రతిపక్షాలనే నిందిస్తున్నాం. అసలైన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాం. హిందూ ముస్లిం విభేదాలు పెంచే చర్చలు నడుపుతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ప్రతి అంశాన్నీ మసి పూసి మారేడుకాయ చేస్తున్నాం. అసమర్ధ కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతి సందర్భంలోనూ మనం మౌనం వహిస్తున్నాం.

ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి సంబంధించి నరేంద్ర మోదీ పేరు ఎత్తడానికి కూడ మనం సిద్ధంగా లేము. కోవిడ్‌ ‌నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించే ప్రతిపక్ష నేతలను చూపిస్తాం. అదే పని చేస్తున్న అమిత్‌ ‌షా ఫొటో కూడా చూపించం. అంత వెన్నెముక లేకుండా తయారయ్యాం. యుపిఎ హయాంలో పాలన పడకేసిందని మీరు పదేపదే అరచిన సంగతి గుర్తుందా. వ్యవస్థ మొత్తం కుప్పకూలిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వాన్ని మనం కనీసం ఒక్కసారి నిలదీశామా. కోవిడ్‌ ‌మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం టైమ్స్ ‌నౌ ఎడిటర్లకు ఇష్టం లేదన్న సంగతి సుస్పష్టం. దేశంలో వేలాది మంది మరణిస్తున్నపుడు వాస్తవ పరిస్థితిని ఎత్తిచూపడం మన కనీస బాధ్యత. దానికి బదులు మనం నాన్‌ ‌బిజెపి రాష్ట్రప్రభుత్వాలని నిందిస్తున్నాం. బిజెపి ఐటీ సెల్‌ ఎజెండాను అమలు చేస్తున్నాం. ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది పోయి మనం రైతులపై విరుచుకు పడుతున్నాం. ప్రధానమంత్రి నిర్లక్ష్యాన్నీ, అసమర్ధతనూ ప్రశ్నించాల్సింది పోయి ఆయన గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బిజెపి ఐటి సెల్‌ ‌నుంచి వచ్చే మెసేజ్‌ ‌లపై ప్రైమ్‌ ‌టైం చర్చాగోష్టులు నడిపిస్తున్నాం. ఎట్లా తయారయ్యాం మన  చివరికి. ఒకప్పుడు ప్రజల పక్షాన గొంతెత్తిన ఛానల్‌ ఇప్పుడు ప్రభుత్వం బాకాగా తయారయింది. ప్రజల పక్షాన ఎప్పుడు నిలుస్తారు మీరు. ఛానల్‌ ‌లో జర్నలిస్టులందరితో బీజెపి ఎజెండా కోసం పని చేయించడం ఎప్పుడు మానుకుంటారు.  మీరు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలంటే ఇంకెన్ని శవాలు లేవాలి.

ఇంకెంత రక్తం మీ చేతులకు అంటుకోవాలి. మీ ముందున్న ప్రశ్న చాలా చిన్నది. ప్రజల పక్షాన నుంచోవాలా లేక బిజెపి పక్షాన నుంచోవాలా. బిజెపి పక్షాన నుంచోవడం అంటే మీరు మీ వృత్తి ధర్మానికే కాదు ఈ దేశానికే ద్రోహం చేస్తున్నట్లు. అదీ. టైమ్స్ ‌నౌ ఛానల్‌ ‌జర్నలిస్టుల ఆక్రోశం, ఆగ్రహం. వారు మిగతా జాతీయ ఛానళ్లలో పని చేసే జర్నలిస్టులకు కూడా ఆ లేఖ చివరన ఒక పిలుపు ఇచ్చారు. మీరు కూడా గొంతు ఎత్తండి. ఇప్పుడు గొంతు ఎత్తకపోతే చరిత్ర మనను క్షమించదు అని రాశారు. దాదాపుగా అన్ని నేషనల్‌ ‌చానల్స్ ‌నిస్సిగ్గుగా మోదీ ప్రభుత్వం భజన చేస్తున్నాయి. ప్రజల పక్షాన గొంతెత్తడం మానేశాయి. టైమ్స్ ‌నౌ జర్నలిస్టులు ఆ లేఖలో చెప్పినట్లు యుపిఎ హయాంలో ఈ ఛానల్స్ అన్నీ ప్రభుత్వం తాట తీశాయి. ఇప్పుడు మోదీ సర్కారు పక్షాన నిలిచి ప్రజల తాట తీస్తున్నాయి. విషాదం ఏమంటే చాలా మంది ప్రజలకు ఈ విషయం అర్ధం కావడం లేదు.

Leave a Reply