Take a fresh look at your lifestyle.

బెల్లమే బంగారు నైవేద్యం..!

Bellam is the golden incarnation Sammaka Sarakka Jatara

  • వనదేవతలసేవలో తరిస్తున్న జనం
  • మేడారం భక్తజనార్ణవం
  • నేడు దేవతల పునఃవనప్రవేశం

“ప్రధాన దేవత సమ్మక్కతోపాటు, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్న గద్దెలపై కొలువుదీరడం.. ఏకకాలంలో వనదేవతలందరినీ దర్శించుకోవడానికి వీలుండడంతో జాతరలో మూడవరోజైన శుక్రవారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు. సమీపగ్రామాల నుంచి కాలినడకన వచ్చేవారు, ఎడ్లబండ్ల నుంచి మొదలుకొని మోటర్‌సైకిళ్లు, బస్సులు, కార్ల వరకు ఎవరికి అందుబాటులో ఉన్న వాహనాల్లో వారు జాతరకు తరలివచ్చారు. కిక్కిరిసిన రోడ్లు, కిటకిటలాడే క్యూలైన్లు..జంపన్నవాగులో స్నానాలు..ఒడిబియ్యంతో వరాలు పట్టే మహిళలు..డప్పుల దరువులు, డాన్సులు, శివసత్తుల కేరింతలు..కల్లు, ఇప్పసారా సాకలు.. ఎదురుకోళ్లు, బెల్లం తులాభారాలు.. మొక్కులు చెల్లించుకోవడానికి•, అమ్మవార్ల దర్శనానికి భక్తుల ఆరాటం.. గవర్నర్లు, సీఎం వంటి ప్రముఖుల రాకతో పోలీసుల హడావుడి అంగళ్లలో జోరుగా కొనుగోళ్లు.. ఇటువంటి కోలాహల దృశ్యాలతో మేడారం నిండిపోయింది. తెలంగాణ మహాకుంభమేళాలో మరో అపురూప అద్భుతఘట్టం సాక్షాత్కరించింది.”

మేడారంలో సమ్మక్క-సారక్క జాతర వైభవోపేతంగా సాగుతోంది. కోట్లాది గిరిజనుల ఆరాధ్యదైవమైన వన దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. గురువారం రాత్రి గద్దెకు సారక్క చేరడంతో వనదేవతల ప్రవేశం సంపూర్ణమైంది. భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగువద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ముందుగా జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ఆ తరువాత అమ్మవార్లను దర్శించు•కునే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది. దీనికి అనుగుణంగానే లక్షలాది మంది భక్తులు వాగులో స్నానం చేసి తరిస్తున్నారు. అనంతరం బెల్లం ముద్దలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. గురువారం రాత్రి చిలుకలగుట్ట నుంచి దిగివచ్చిన వనదేవతను గద్దెపైకి ఆహ్వానించారు. ఎర్రని వస్త్రంలో కుంకుమభరిణె రూపంలో తరలివచ్చిన సమ్మక్కకు.. ఘనంగా నీరాజనం లభించింది. రాత్రి గద్దెదకు సమ్మక్క రాకతో వనదేవతల రాక పరిపూర్ణమైంది. బుధవారం మేడారం జాతర ప్రారంభం కాగా, జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనాల కోసం వస్తున్న జనాలతో మేడారం జాతర మురిసిపోతోంది. బెల్లం బంగారు నైవేద్యమైంది. కోళ్లు, మేకలు, గొర్రెలు బలిస్తున్నారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గ్దదెలపైకి చేరుకోగా, గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరడంతో ప్రజలు పులకించి పోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన మేడారం పులకించిపోయింది. భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. ఈ దృశ్యం చూసేందుకు కనీవినీ ఎరుగని రీతిలో చిలుకలగుట్టకు జనగంగ ఉప్పొంగింది. ఇప్పటిదాకా సారలమ్మ దీవెనలు పొందిన జనం ఇక సమ్మక్క ఆశీర్వాదాలు అందుకోనున్నారు. శనివారం సాయంత్రం దేవతలు తిరిగి వనంలోకి వెళ్లిపోయేవరకు జాతర సాగనుంది. అందుకే శుక్రవారం భారీగా జనం తరలి వచ్చారు. అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడ్డారు.

జాతర రోజుల్లో మూడు రోజులు ఇక్కడే మకాం
సమ్మక్క-సారలమ్మ జాతరకు అనేక రాష్టాల్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నా గిరిజన కోయ జాతుల వారికే ఇక్కడి దేవతలు ఆరాధ్య దైవాలుగా నిలిచారు. రానురాను జాతరకు అన్నివర్గాల ప్రజలు రావడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. వారి ఆరాధ్య దైవంగా వివిధ ప్రాంతాల గిరిజనులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి వేల సంఖ్యలో వాహనాలు, బస్సుల్లో భక్తులు తరలివస్తున్నారు. బీజాపూర్‌, ‌భూపాలపట్నం, దంతెవాడ, బాసగూడ, బస్తర్‌, ‌జగదల్‌పూర్‌, ‌రాయపూర్‌, ‌భద్రకాళీ, మద్దేడు, ఆవుపల్లి, కాకేడు, కొత్తపల్లి, కుంట, పామేడు తదితర ప్రాంతాల నుంచి వాజేడు మండలం దుగా ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం చేరుకుంటున్నారు. వీరంతా మూడు రోజులపాటు జాతరలో బస చేస్తారు. గతంలో గోదావరి దాటి ఎడ్లబండ్లల్లో వచ్చేవారు. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో సమ్మక్క-సారక్కల గ్దదెలు ఉన్నాయి. అక్కడ కూడా దేవతలను మొక్కుకొని మేడారం బయల్దేరుతారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గొత్తికోయలు సైతం వనదేవతలకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్కకు ఆడబిడ్డ కట్నం కింద చీరె, సారెను సమర్పిస్తారు.

- Advertisement -

జాతరకు ముందుగానే గొత్తికోయలు మేడారం చేరుకునేందుకు సన్నద్ధమవుతారు. జాతరకు వెళ్లే ముందు ఇంటిని అలుకుతారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. జాతరకు ముందుగానే ఇతర గ్రామాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులంతా ఒకచోటుకు చేరి అనేక రకాల పిండివంటలు తయారు చేసుకుంటారు. కోళ్లు,మేకలతో గూడేల్లోని వారంతా గుంపులు గుంపులుగా బయల్దేరుతారు. గొత్తికోయలు అనేక రకాలుగా తల్లులకు మొక్కులు సమర్పిస్తుంటారు. ప్రధానంగా పంటలు బాగా పండాలని మొక్కుతుంటారు. అంతేకాకుండా కుటుంబాన్నంతా సల్లంగా చూడాలని, ఆరోగ్యంగా ఉండాలని, కాన్పు రావాలనే కోరికలతో మొక్కులు చెల్లిస్తుంటారు. సమ్మక్క తల్లిని ఆడబిడ్డగా కొలిచి కట్నం కింద సారె, చీరెలు, బెల్లం, ఇప్ప సార, కోడి, మేకలను మొక్కుల కింద చెల్లిస్తుంటారు. అలాగే పిల్లలు పుట్టాలని అమ్మవార్లను కోరుతూ ముడుపులు కడతారు. మేకలను బలిస్తామని మొక్కడంతోపాటు కొబ్బరికాయ, డబ్బులు ముడుపులు కడతారు. జాతర జరిగితే మేడారం వెళ్లి జంపన్నవాగులో స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఒడ్డున ఉన్న జంపన్న గ్దదె వద్ద మొక్కిన ముడుపు కట్టి సమ్మక్క తల్లికి కోడి, మేకను బలి ఇస్తారు. రెండేళ్లకోమారు వచ్చే జాతరలో కనీసం మూడు రోజులు వన జాతరలోనే ఉంటారు. అక్కడ నిద్ర చేయాలనే ఆచారం వారిలో ఉంది. ఇక అందరూ ఒకచోట చేరిన తర్వాత మొక్కులు ఎలా ఇవ్వాలనేది నిర్ణయించుకుంటారు.శుక్రవారం ఉదయం వనదేవతలను రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్‌ ‌దర్శించుకున్నారు.

 దర్శించుకున్న కేసీఆర్‌

ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం జాతరలో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌ ‌స్వాగతం పలికారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌ అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన దేవతలకు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఆతరువాత వన దేవతలకు తనవంతుగా నిలువెత్తు బంగారం కేసీఆర్‌ ‌సమర్పించుకున్నారు.

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు 
అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. గవర్నర్‌ ‌తమిళిసైతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇం‌ద్రకరణ్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల పూజారులు అమ్మవార్ల ప్రసాదాలను గవర్నర్‌ ‌తమిళిసైకు అందజేశారు. గవర్నర్ల పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రెండు రోజుల పాటు గద్దెలపైనే వనదేవతలు ఉంటారు. శనివారం సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్‌ ‌తమిళిసై డియాతో మాట్లాడారు.

సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయని గవర్నర్‌ ‌పేర్కొన్నారు.మేడారం జాతర ప్రకృతితో మమేకమైందని ఆమె తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను మొక్కుకున్నానని గవర్నర్‌ ‌చెప్పారు. గిరిజన జాతర గురించి తనకు ముందునుంచీ తెలుసని, అయితే అమ్మవార్లను దర్శించుకోవడంమాత్రం ఇదే తొలిసారని అన్నారు. దర్శనం అనంతరం గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని కొనియాడారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని తెలిపారు.

గవర్నర్‌ ‌హోదాలో అమ్మవార్ల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. ఇదిలావుంటే భక్తులు భారీగా తరలి వస్తున్నా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉంటూ వారికి దర్శనం కలిగేలా చూస్తున్నారు.

 

 

Leave a Reply