“తెలంగాణలో ఐదు లక్షలమందికిపైగా కార్మికులు జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బీడీలు చుట్టేవారికి చేతినిండా పని దొరుకడం లేదు. పైగా ఉన్న పని కూడా తగ్గి పోయింది. నెలకు పదిరోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని కార్మికులు చెప్తున్నారు. బీడీలను చుట్టేందుకు ఉపయోగించే తెండు ఆకులపై 18 శాతం, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జిఎస్‌టి కేంద్రం కేంద్రం విధించడం వల్ల పరిశ్రమ వేగంగా దెబ్బతింటున్నది. సరుకుకు గిరాకీ పెంచాలని బీడీ కార్ఖానాల వారు కూలీ రేట్లు తగ్గించారు. ఈ పరిస్థితుల్లో ఇటు పని తగ్గిపోయి, అటు ఆదాయం సరిపోక తమ జీవనం దుర్భరంగా మారిందని బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరో వైపు పొగాకు పని వల్ల కార్మికుల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. బీడీ కార్మికుల్లో అత్యధికులు భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే ఉన్నారు.”
- అటు జీఎస్‌టీ దెబ్బ..
- ఇటు పని దినాలు, కూలీ రేట్ల తగ్గింపు
- చాలీచాలని ఆదాయంతో కార్మికుల వెతలు
- సంక్షోభంలో పరిశ్రమ ఐదు లక్షలమందికి పైగా కార్మికుల బతుకుదెరువుకు ముప్పు
తెలంగాణలో బీడీ కార్మికుల వెతలు ఎన్నెన్నో… తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బీడీ కార్మికుల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో టిఎన్‌ఎం ప్రతినిధులు చాలా దగ్గరగా పరిశీలన జరిపారు. వారి స్పందనల కదంబం ఇది…. ఫిబ్రవరి మధ్యల తెలంగాణలోని రామారెడ్డి హౌసింగ్ కాలనీ మూడోవీధిలో కొద్ది బీడీ వర్క్ షాపులు చాలా బిజీగా ఉన్నాయి. అనేక మంది మహిళలు బకెట్ల నిండా బీడీలతో వచ్చారు. కొంత మంది తెండు ఆకులతోనూ, పొగాకుతోనూ ఆరోజు పనికి బయలుదేరుతున్నారు.30 ఏళ్ళ సవిత తాను తీసుకు వెళ్ళాల్సిన తెండు ఆకులను, పొగాకును ఏరుకుంటోంది. ఆకులతో బీడీలు చుట్టి జీవనం సాగిస్తోంది ఆమె టిఎన్‌ఎం ప్రతినిధితో మాట్లాడుతూ, బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టోందని ఆమె అన్నారు. బీడీలు చుట్టే వారి పని తగ్గి పోయిందనీ, దాంతో నెలకూ
పదిరోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని ఆమె చెప్పారు. మిగిలిన రోజులలో తాము ఏదో ఒక పని చూసుకోవల్సి వస్తోందని ఆమె అన్నారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యవసాయ కార్మికురాలిగా జీవనం సాగిస్తున్నానని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న దాదాపు ఏడు లక్షల మంది బీడీ కార్మికులలో ఆమె ఒకరు. వీరంతా ఉత్తర తెలంగాణా జిల్లాలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో కేంద్రీకృతమై ఉన్నారు.బీడీ కార్మికుల్లో అత్యధికులు భూమిలేని నిరుపేదలూ, వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు, వారికి బీడీ పరిశ్రమే జీవనోపాధిని కల్పిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ గ్రామానికి చెందిన ఎన్ అశ్విని బీడీలు చుట్టడంలో కొత్త. తన తల్లితండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలేనని ఆమె చెప్పారు. కుటుంబానికి సాయపడేందుకే బీడీ పరిశ్రమలో ప్రవేశించినట్టు ఆమె తెలిపారు. అయితే, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అన్నారు. పరిస్థితి మెరుగు పడకపోతే తాను కూడా పొ)ం పనికి వెళ్ళాల్సి వస్తుందని అన్నారు.తెలంగాణలో బీడీ కార్మికులందరి వెతలూ ఇలాగే ఉన్నాయి. వారి కుటుంబ పోషణభారం వొక వంక పెరుగుతుండగా,ఆదాయం అంతంత మాత్రంగా ఉంటోంది..పని దినాలు బాగా తగ్గిపోవడంతో. ఈ వృత్తిలో కొనసాగడం కష్టమని చాలా మంది భావిస్తున్నారు.బీడీ కార్మికులతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో టిఎన్‌ఎం జరిపిన సంభాషణల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంది
తగ్గి పోయిన కూలీ రేట్లు…
ఇస్సానాపల్లికి చెందిన ఎ బాలామణి టిఎన్‌ఎం ప్రతినిధితో మాట్లాడుతూ, వెయ్యి బీడీలు కట్టడానికి రోజంతా పడుతుందనీ, అలా కడితే తమకు రోజుకు 170 రూపాయిలు కూలీ ఇస్తారని చెప్పింది. అసలే తక్కువ వేతనాలు, దానికి తోడు పని రోజులు బాగా తగ్గిపోతున్నాయని ఆమె చెప్పారు. దాంతో జీవనం దుర్భరంగా మారిందని ఆమె అన్నారు. తక్కువ రోజులు పని చెబుతున్నారేమని అడిగితే మునీమ్‌లు ఉత్పత్తి మధ్యలో ఆపేయమంటున్నారనీ,బీడీలకు డిమాండ్ లేదని అంటున్నారని బాలామణి చెప్పారు. మునీమ్‌లు అంటే పని పర్యవేక్షించేవారు.వారినే సూపర్వైజర్స్ అని అంటారు. కామారెడ్డిలో పది బీడీ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు గ్రామాల్లో యూనిట్లు ఉన్నాయి. అవిభక్త కరీంనగర్ జిల్లాలో ఇదివరకు అత్యధిక సంఖ్యలో బీడీ కంపెనీలు ఉండేవి .వీటిలో మహిళలు ఎక్కువగా జీవనోపాధి పొందేవారు. ఈ కుటుంబాల్లో పురుషులు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు వెళ్తే మహిళలు బీడీ కార్మికులుగా పని చేసుకుంటూ పిల్లలను సాకేవారు. కార్మికశాఖ వార్షిక నివేదికను బట్టి 2018-19లో తెలంగాణలోని 8,029 బీడీ, సిగార్ పరిశ్రమల్లో 4,69. 323 మంది కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులే కాదు. దిగువ స్థాయి కార్మికులు కూడా ఇదే మాదిరి వెతలను ఎదుర్కొంటున్నారు.
జిఎస్‌టి వల్ల విఘాతం
రామారెడ్డిలో పదిహేను సంవత్సరాల నుంచి వాణి బీడీ కంపెనీ కార్ఖానాలో బాలచంద్రమ్ మునీమ్‌గా పని చేస్తున్నాడు గతంలో తనకు 35,000 నుంచి 40,000 బీడీలు వంద నూటఇరవై మంది మహిళా కార్మికుల నుంచి వచ్చేవనీ, పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం వస్తు సేవా పన్ను (జిఎస్ టి) నిధించిన తర్వాత బీడీల సంఖ్య 20వేలకు తగ్గిపోయిందని ఆయన చెప్పారు. కొన్నిసార్లు ఈ మాత్రం కూడా రావడం లేదని ఆయన చెప్పారు. జిఎస్ టిని 2017 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం అమలు జేస్తోంది. జిఎస్‌టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పన్ను వల్ల చిన్న పరిశ్రమలు, వృత్తిపని వారూ బాగా దెబ్బతిన్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. బీడీ వర్తకుల సంఘం సభ్యుడు, వ్యాపారి చాట్ల శ్రీశైలం మాట్లాడుతూ బీడీ పరిశ్రమ కుప్పకూలిపోతోందని అన్నారు. ధూమపానం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్న ప్రచారం వల్ల బీడీ వాడకం తగ్గిపోయిందని అన్నారు. బీడీ పరిశ్రమ పరిస్థితి రెండు దశాబ్దాల నుంచి ఏమాత్రం బాగా లేదనీ, గడిచిన రెండు,మూడేళ్ళలో మరింత దిగజారిందని ఆయన అన్నారు. తెండు ఆకులను బీడీలను చుట్టేందుకు ఉపయోగిస్తారు. తెండు ఆకులపై 18 శాతం జిఎస్‌టి. పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జిఎస్‌టి విధించడం వల్ల పరిశ్రమ దెబ్బతిన్నదని ఆయన చెప్పారు.సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రిసెర్చ్ (సిపిపిఆర్) అధ్యయనం ప్రకారం 28 శాతం జిఎస్ టి రేటు ప్లస్ పరిహార సెస్ వల్ల సిగెరెట్లు, బీడీల ధరలు 0.18 శాతం 8.8 శాతం వరుసగా పెరిగాయి. దాంతో సగటు వినియోగం 0.3 శాతం, 10 శాతం తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు, బీడీ కార్ఖానాల సూపర్వైజరీ సిబ్బంది బీడీ ఉత్పత్తిని తప్పని సరిగా తగ్గించాల్సి వస్తోందని అన్నారు.
ఒక్కొక్క బీడీ కట్టను 650 నుంచి 800 గ్రాములు తెండూ ఆకుతో తయారు చేస్తారు. వీటితో 1000 బీడీలు తయారవుతాయి. ఎం స్వప్న అనే 40 ఏళ్ళ బీడీ కార్మికురాలు తన స్టాక్ ను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సి వస్తోంది. బీడీల వ్యయాన్ని తగ్గించాలని వ్యాపారులు కోరుతున్నారని ఆమె చెప్పారు. దాంతో తాము తక్కువ నాణ్యత గల ఆకులను కొంటున్నామని చెప్పారు. దీనికి కూడా తాము ఎక్కువ గానే ఖర్చు చేయాల్సి వచ్చినా యజమానులు వెయ్యి బీడీలకు 174 రూపాయిలు మాత్రమే ఇస్తారని ఆమె తెలిపారు. నిజామాబాద్ నవీపేటకు చెందిన బీ పద్మ కిలో తెండూ ఆకుల ధర 130 నుంచి 150 రూపాయిలనీ, ధర పెరగడం వల్ల కార్మికులకు మిగిలేది ఏమీ ఉండటం లేదని అన్నారు. తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కె సదానందం మాట్లాడుతూ, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమ దెబ్బతిన్నదని చెప్పారు. పొగాకు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమైతే దాని ప్రభావం అన్ని ఉత్పత్తులపైనా పడాలనీ అటువంటిది ప్రభుత్వాల దృష్టి ఒక్క బీడీ పరిశ్రమపైనే ఎందుకు పడుతున్నదని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలు ఉపయోగించేదీ,నిరుపేదలకు ఉపాధి కల్పించేదీ ఈ పరిశ్రమ అని ఆయన చెప్పారు. బీడీ కార్మికుల పని దినాలు తగ్గుతున్నందువల్ల వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఆయన అన్నారు.
ఆరోగ్య సమస్యలు
కార్మికుల సంక్షేమానికి అధికారంలో ఉన్నవారు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పటికీ కార్మికుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బీడీ కార్మికులు వెన్నునొప్పి, అమ్నీషియా తదితర రోగాలతో బాధ పడుతున్నారు. ఏ ఒక్కరూ ఇలా రోగాలతో బాధపడాలని కోరుకోరనీ, బతుకుతెరువుకు వేరే మార్గం లేక ఈ వృత్తిలో కొనసాగుతున్నామని బాలామణి చెప్పారు. అధిక లాభాలు ఆర్జించిన కంపెనీలు కూడా కార్మికుల ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలేదని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 4.6 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారనీ, వీరందరికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని కోరుతున్నారు. 4,07,757 మందికి నెలకు 2,016 రూపాయిల వంతున ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ కు చెందిన డాక్టర్ వై రమణా రెడ్డి సూచించారు.