Take a fresh look at your lifestyle.

రమణీయం..కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం

  • నిత్య కల్యాణమండపంలో నిర్వహించిన వేదపండితులు, అర్చకులు
  • శ్రీరామనవమి నాడే రామయ్య పుట్టినరోజు
  • నేడు స్వామివారి పట్టాభిషేకం

పవిత్ర ముణ్యక్షేమ్రైన భద్రాచలంలో సీతారాముల కల్యాణం ఈ ఏడాది కూడా కొరోనా ప్రభావంతో ఆలయంలోని నిత్యకల్యాణ మండపంలోనే అంతరంగికంగానే జరిగింది. కేవలం అర్చకులు, వేదపండితులు, ఇద్దరు మంత్రులు, కొంతమంది అధికారులతో జరిగింది. శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బుధవారం నాడు జరిగిన కల్యాణం ఆనాడు మిధిలానగరంలో జరిగిన కల్యాణానికి భిన్నంగా జరిగింది. ఆనాడు శివధనస్సు విరిచి దశరథసుతుడు శ్రీరామునికి, మిధిలానగర రాజు జనకుని పుత్రిక సీతకు పెళ్ళి జరుగగా బుధవారం భదాద్రి క్షేత్రంలో ప్రతీఏటా జగత్‌ ‌కల్యాణం కోసం చతుర్భుజుడు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశగల వైకుంఠ రాముడు ఇక్కడ వరుడు కాగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు సీతమ్మ వధువుగా కల్యాణం నిర్వహించారు. భదాద్రిలో శ్రీప్లవ నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఉదయం 10 గంటల నుండి అభిజిత్‌లగ్న శుభ ముహూర్తమున శ్రీపాంచరాత్రగమ విధానంలో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవంను ఆలయ ప్రాంగణంలో నిత్యకల్యాణం మండపంలో నిర్వహించారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో, వేదమంత్రాలతో ప్రత్యేక పల్లకిపై ఉదయం 10.15 నిమిషాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిత్యకల్యాణ మండపంకు తీసుకువొచ్చారు. ధగధగాయమానంగా వెలుగొందే వెండి సింహాసనంపై సీతారాములు, లక్ష్మణ, హనుమంతులను ఆసీనులు గావించారు. తొలుత తిరునాథాన తరువాత విశ్వక్సేన మంత్రాలతో ఏర్పాటుచేసిన మండపాన్ని శుద్ధి చేసి మంజునకి ప్రథమం అను మంత్రం జపిస్తూ యధాసుదర్శరాజా సంవత్సర్గం శ్రీయుద్యా ఆయుష్మే అనే సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మవారిని కూర్చుండబెట్టి కన్యావరణాలు జరిపించి మోక్షబంధనం ప్రతిసారబంధం, ద్వితీయ, సువర్ణయజ్ఞోర్తితా ధారణలు జరిపించారు. అనంతరం ఆశీర్వచనం పాదప్రక్షాళనం, పుస్పోదకస్నావనం పూర్తి అయిన తర్వాత 11.20 నిమిషాలకు స్వామివారికి వరపూజ నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు చేయించిన ఆభరణాలు అయిన పచ్చలపతకం, శ్రీరామమాడ, చింతాకుపతకం, అమ్మవారికి అలంకరించి, శ్రీరంగనాధుడు పంపిన పట్టువస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. తేనే, పెరుగు కలిపిన పంచామృతాలను బంగారు పాత్రలో స్వామివారికి నివేదించిన పిమ్మట నూతన వస్త్రాలంకరణ చేశారు. ఊతబలి పేరుతో పొన్నంను దిష్టితీశారు. లోకపర్యంతమున ఉన్న విశ్వసృష్టిని దానితో నున్న కాలమును, సంకల్పం చెప్పి,11 గంటల 30 నిమిషాలకు కన్యాదానం కరిష్యే అంటూ 12. గంటలకు అభిజిత్‌ ‌లగ్నంలో స్వామివారు, అమ్మవారి శిరస్సుపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. 12 గంటల 25 నిమిషాలకు మాంగల్యధారణతో కల్యాణం తంతునా భదాద్రి అంటూ చేశారు. అనంతరం భక్తరామదాసు 17వ శతాబ్దంలో చేయించిన మంగసూత్రధారణ 12.30కి జరిగింది. మూడు సూత్రాలు గల ఈ మంగళసూత్రమునకు మొదటి సూత్రము కారణశక్తి గౌరి గాను, రెండవ సూత్రం జ్ఞానశక్తి శారద గానూ, మూడవసూత్రం మనోశక్తి మహాలక్ష్మీగానూ ఆగమశాసనం చెబుతుందని వేదపండితులు మంత్రోచ్ఛారణతో అశేష భక్తజనావళికి వినిపించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేసారు. రవాణాశాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌ముత్యాల తలంబ్రాలు అందచేసారు. సుగంధద్రవ్యాలతో కలిపి సీతారామచంద్రమూర్తులకు తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మండపం చుట్టూ గులాల్‌ ‌చల్లి కల్యాణం తంతునామే అంటూ ముగించారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణం సుమారుగా యాబైమందితోనే నిర్వహించారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అర్చకులు, దేవాలయ సిబ్బందితోనే స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, నాగర్‌కర్నూల్‌ ‌శాసనసభ్యులు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఐటిడిఏ పిఓ గౌతమ్‌పొట్రో, ఎస్‌పి సునీల్‌ధత్‌, అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, ఎఎస్‌పి డాక్టర్‌ ‌వినీత్‌, ‌దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ‌దేవస్ధానం ఇఓ జి.శివాజీ మరియు జిల్లా అధికార యంత్రాగం పాల్గొన్నారు.

శ్రీరామనవమి నాడే రామయ్య పుట్టినరోజు
రామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు …అది ఆయన పుట్టినరోజు కూడా. చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం. మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం. శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ? నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కల్యాణం జరగటానికి మూలకారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త భక్తరామదాసు. ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం. రాముడి కల్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు. అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి. (శ్రీరంగం మాదిరిగా)పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన….‘‘ఎస్య  అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్‌’’.(‌పరమ పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కల్యాణం చేయడం. రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అందుకే రాముడి కల్యాణం ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు. ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు. వాల్మీకి రామాయణంలో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కల్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడలేదు. నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి…ఆ ముహూర్తనిర్ణయ స్థల  కేంద్ర బిందువు భద్రాచలం  కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు. భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్‌ ‌లగ్నంలో  నిర్వహిస్తారు. అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వొచ్చే సమయం ….ఇది దోషరహిత ముహూర్త సమయం …..దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు. అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక.

నేడు స్వామివారి పట్టాభిషేకం
స్వామివారి కల్యాణం నిర్వహించిన మరుసటిరోజు పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు స్వామివారు పట్టాభిషిక్తుడైతారు. ఇందుకోసం ప్రతీఏటా రాష్ట్ర గవర్నర్‌ ‌వొచ్చే ఆనవాయితీ ఉండేది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభిస్తుంన్నందున గవర్నర్‌ ‌వొచ్చే అవకాశం లేనట్లే. ఇప్పటికే బుధవారం జరిగిన స్వామివారి కల్యాణం ఆలయంలోని నిత్యకల్యాణం మండపంలోనే కేవలం 50 మంది చూసేవిధంగా ఏర్పాటు చేసి కల్యాణం ముగించారు. ఇదే పద్ధతిలో గురువారం పట్టాభిషేకం కూడా నిరాడంబరంగా, అంతరంగికంగానే జరగనుంది.

Leave a Reply