- అన్ని రాష్ట్రాల్లో కొత్త వైరస్ జాడలు మంత్రి ఈటల సూచన
ప్రపంచ దేశాల్లో కొత్త రకం కొరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నవారు సహకరించాలని వైద్యాధికారులు కోరారు. వివరాలను కాల్ సెంటర్ నంబర్ 040-24651119కి ఫోన్‌చేసి చెప్పాలని లేదా 9154170960 నంబర్‌కు వాట్సాప్ చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. సిబ్బంది స్వయంగా ఇంటికి వొచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. యూకే నుంచి వొచ్చిన కొందరికి కొరోనా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.
వారందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది. ఐతే అది కొత్త వైరసా? కదా? అనేది తేలాల్సి ఉంది. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వొస్తేనే మరింత స్పష్టత వస్తుంది. కొరోనా సెకండ్ వేవ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మంత్రి మొదట వొచ్చిన కొరోనాతో ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. కానీ కొత్తరకం స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి కొరోనా పరీక్షలు చేయగా.. కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. కొత్త స్ట్రెయినా లేక పాతదా అన్నది ఇంకా నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుందని మంత్రి ఈటల రాజేంద్ర వెల్లడించారు.