Take a fresh look at your lifestyle.

తెలంగాణకు మొండిచేయి…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ ‌తీవ్ర నిరాశపరిచిందని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. రూ. 45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఏదైనా సాగు నీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను విస్మరించారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన ఐటీఆర్‌ ‌ప్రాజెక్ట్ ‌ప్రస్తావనే లేదని అన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని ఇందులో ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని రేవంత్‌ ‌మండిపడ్డారు.

ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాల లెక్కన ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండందని, అందులో తెలంగాణ రాష్ట్రానికి 75 లక్షల ఉద్యోగాలు దక్కాల్సి ఉందని, కాగా గత పార్లమెంటు సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నకు వివిధ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి 22 కోట్ల దరఖాస్తులు వొస్తే 7 లక్షలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారని తెలిపారు. దీన్ని బట్టి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, రైతుల ఆదాయం సంగతి ఏమోగానీ పెట్టుబడి మాత్రం రెండింతలైందని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్‌ ‌నగర్‌ ‌పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారని, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, ఇలా అన్ని రకాలుగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని, ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించిందని విమర్శించారు.

కానీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తెలంగాణ పట్ల మాత్రం కేంద్రం వివక్ష చూపిందని అన్నారు. కొరోనా కాలంలో అదుకున్న ఉపాధి హామీ పథకానికి నిధులను, పనిదినాలను కేంద్రం తగ్గించిందని, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదని, ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్‌ ‌ఖండిస్తుందని రేవంత్‌ ‌స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని, బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్‌ ఇద్దరు దోషులేనని అన్నారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరు తోడు దొంగలయి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలని, రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని ప్రారంభించాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన పక్రియను మొదలు పెట్టాలని రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మోదీ…మీరు గుజరాత్‌కు బుల్లెట్‌ ‌ట్రైన్‌, అవసరమైన నిధులు తీసుకుపోతారు..మీరు గుజరాత్‌కు సీఎం కాదు..ఈ దేశానికి ప్రధాని…నిధుల కేటాయింపులో గుజరాత్‌కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించండని అన్నారు.

మోదీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆరెస్‌.. ‌సభలో నిస్సహాయంగా నిలబడిందని, అవినీతిని కప్పి పుచుకోవడానికే కేసీఆర్‌ ‌కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా చేసిన పాపాన్ని కడుక్కోవాలని బీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నిస్తుందని, కానీ నిధులు రాబట్టేందుకు చొరవ చూపడం లేదన్నారు. పార్లమెంటు వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన మోదీ..పార్లమెంటు సాక్షిగా తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో చేసిన హామీలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు రేవంత్‌. ‌తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. ఫిబ్రవరి 6న ములుగు నుంచి సమ్మక్క సారక్క నుంచి హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర ప్రారంభమవుతుందని, జాతీయ స్థాయి నాయకత్వం కూడా వివిధ సందర్భాలలో ఈ యాత్రలో పాల్గొంటుందని, మొదటి విడతగా 60 రోజులు..40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేయాలనుకుంటున్నామని, ఆ తరువాత కొనసాగించే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ ‌వివరించారు.

Leave a Reply