న్యూదిల్లీ,జనవరి25: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీమంత్రి ఎ.కె. ఆంటోనీ కుమారుడు అనిల్ అంటోనీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోడీపై బిబిసి డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్ట్ చేశారు. అయితే ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అసహనానికి గురైన అనిల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తాను నిర్వహిస్తోన్న అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను. వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుండే తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడి వచ్చిందని, అందుకు తాను నిరాకరించానని పేర్కొంటూ తన రాజీనామా లేఖను పోస్టు చేశారు.
బిబిసి అభిప్రాయాలు వెల్లడించడమంటే మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమేనని అనిల్ ఆంటోనీ పేర్కొన్నారు. బిబిసి డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటిని బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే సెన్సార్షిప్ అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఎప్పటికైనా బయటికి వస్తాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రధానిమోడీకి మద్దతుగా అనిల్ ఆంటోనీ ట్వీట్ చేయడాన్ని పార్టీ వ్యతిరేకిస్తూ.. వెంటనే ట్వీట్‌ను తొలగించాలని ఆదేశించింది.