Take a fresh look at your lifestyle.

బయ్యారం ‘ఉక్కు’ సంకల్పం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంకూడా ఒకటి. గడచిన ఎనిమిదేళ్ళుగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ కి వెళ్ళినప్పుడు, దిల్లీనుండి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వొచ్చినప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తూనే ఉంది. అయినా దానిమీద కేంద్ర ప్రభుత్వం ఏనాడు స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. ఒక్క బయ్యారం విషయంలోనే కాదు.. విభజన హామీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనేకహామీలను కేంద్రం ఈనాటికీ పరిష్కరించలేకపోతున్నది. వీటి పరిష్కారం విషయంలో ఇరురాష్ట్రాలతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నప్పటికీ తీసుకున్నచర్యలేమీ కనిపించడంలేదు. దీంతో ఇరురాష్ట్రాల మధ్య మాటయుద్దం చోటుచేసుకుంటున్నది. ఇప్పుడు తాజాగా మంగళవారం మరో విడుత సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పద్నాలుగు అంశాలపై కేంద్రం చర్చించింది. దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపినప్పటికీ తేల్చిందేమీలేదు. పద్నాలుగు అంశాలలో ఏపికి చెందినవే ఏడు అంశాలుండగా, మిగిలిన ఏడు అంశాలు ఇరు రాష్ట్రాలకు సంబంధించినవి. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మిగతా ఏడు అంశాలను మరోసారి సమావేశంలో చర్చిస్తామని మళ్ళీ పెండింగ్‌లోనే పెట్టింది కేంద్రం.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యపడదని ఆయన రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్లు నింపాదిగా చెప్పడం తెలంగాణకు ఇలాంటి ఫ్యాక్టరీని తెచ్చే విషయంలో ఆయనకున్న శ్రద్ధ ఏమిటన్నది చెబుతున్నట్లుగానే ఉంది. కేంద్రం ఎందుకు తన హామీని నిలబెట్టుకోలేదన్న ప్రశ్నకన్న, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపడం లోనే ఆయన శ్రద్ధ కనబరుస్తున్నట్లుగా ఉంది. ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం ఎందుకు అనుమతివ్వడంలేదన్న ప్రశ్నకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిజామ్‌ ‌షుగర్‌ ‌ఫాక్టరీని ఎందుకు పున: ప్రారంభించలేదంటూ ఎదురు ప్రశ్నవేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడి పరిస్థితులు తగినట్లుగా లేవన్నది ఆయన చెబుతున్న మరోమాట. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజంచాలా నాణ్యమైనదని గతంలో నిపుణులు చాలాసార్లు తెలిపారు. నాణ్యత ఉండడం వల్లే ఇక్కడి ఖనిజాన్ని ఇతర ఫ్యాక్టరీలకోసం కేటాయిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా ఇక్కడ పరిశ్రమ పెట్టడం ఇష్టంలేని కేంద్రం ఏదో సాకును చెబుతూనే ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమలనన్నిటినీ ఒక్కొక్కటిగా వదిలించుకుంటోంది. వాటిల్లో ఉన్న తన వాటాలను క్రమేణ తగ్గించుకుంటూపోతున్న విషయం తెలియంది కాదు. ఏపిలోని విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రజలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని మూసివేసి, ప్రేవేటు యాజమాన్యాలకు దారాదత్తం చేసేదిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అక్కడి కార్మికులు ఎంత గగ్గోలు పెట్టిన కేంద్రం పట్టించుకునే పరిస్థితిలో లేదు. తాజాగా ఇంకా బయ్యారంలో ప్రారంభంగాని ఉక్కు పరిశ్రమ ఆశయాన్ని మొగ్గలోనే తుంచేస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేసిన విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో బయ్యారం గురించి పేర్కొనడమయింది. ఇక్కడ పరిశ్రమ నెలకొల్పడానికి అన్నీ వనరులున్నాయని, సుమారు 36 వేల కోట్ల వ్యయంతో ఇక్కడ భారీ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పుతామని ఆనాడు కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఎనిమిదేళ్లు పూర్తి కావొచ్చినా కేంద్రం ఆ విషయాన్నే పట్టించు కోవడం మానివేసింది. బయ్యారంతోపాటు చుట్టుపక్కల ఉన్న గార్ల, గూడూరు, నేలకొండపల్లిలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇనుప ఖనిజం నాణ్యతమైనదని నిపుణులు నిర్ధారించారు. ఇక్కడి ఖనిజ నిక్షేపాలను పరిశీలించిన ఎస్‌ఎం‌డిసీ బృందాలు దేశంలోని ఇతర ప్రాంతాల నిల్వలతో పోల్చిచూస్తే 11శాతం ఖనిజసంపద ఇక్కడే ఉందని నివేదిక ఇచ్చిన విషయంకూడా తెలియందికాదు. ముడి ఖనిజంతో లభ్యమయ్యే ఉక్కు నాణ్యతలోనూ అరవై శాతంగా ఉందని, కనీసంగా వంద కోట్ల టన్నుల మేర ఉన్న ఈ ఇనుప ఖనిజం, 25 ఏళ్ళపాటు ఏ లోటూ రానంతగా ఉన్నాయని నిపుణులు ఆ నివేదికలో తేల్చి చెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నట్లు ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవన్నది అబద్దమనేందుకు, ఫ్యాక్టరీకి కావాల్సిన డోలమైట్‌, ‌బైరేటీస్‌, ‌నాణ్యమైన బొగ్గు లభ్యత కూడా దగ్గరలోనే ఉన్నాయి. కావాల్సిన విద్యుత్‌కోసం పాల్వంచ కెటిపిఎస్‌ అం‌దుబాటులో ఉంది. జీవనది గోదావరి సమీపంలోనే ఉంది. రైలు మార్గమూ ఉంది. ఇన్ని వనరులున్నప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోకూడా కుట్ర జరిగింది. ఇక్కడి ఖనిజాన్ని తవ్వి తీసుకు పోవడానికి ప్రైవేటుకు అప్పగించేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేసిన ప్రయత్నాన్ని నాడు తెలంగాణవాదులు అడ్డుకోవడంవల్ల నిలిచిపోయింది. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పకుండా కుంటి సాకులు చెబుతున్నదనడానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనం. ఇది తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది కాబోతున్నదనడంలో ఏమాత్రం సందేహంలేదు.

Leave a Reply