Take a fresh look at your lifestyle.

మూడ్రోజుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కావాలె..

కొరోనా నిబంధనలు పాటిస్తూ…బతుకమ్మ పండుగ వేడుకలు
చెరువుల వద్ద రక్షణ జాగ్రత్తలు
టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు

మరో మూడ్రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లా కలెక్టర్‌, ఎం‌పిలు, ఎమ్మెల్యేలు, మునిసిపల్‌ ‌ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, సంబంధిత అధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…శనివారం నుండి సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం జరిగేలా చూడాలనీ, మహిళలు మెచ్చేలా 19రంగులు  17డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో సరికొత్తగా బతుకమ్మ చీరలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణీ జరగాలన్నారు.

మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణి అయ్యేలా చూడాలనీ, మూడు రోజుల్లో బతుకమ్మ చీరలు పంపిణి పక్రియ పూర్తికావాలన్నారు. అధిక వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో బారికేడింగ్‌తో సహా తగిన రక్షణ  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువుల అలుగులపై పేరుకుపోయిన  పాకురు, నాచుతో ప్రజలు జారిపడే అవకాశం ఉన్న దృష్ట్యా పాకురు, నాచులను తొలగించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్‌ ‌ఛైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు,  గ్రామీణ ప్రాంతాల్లో  ఎంపిటిసి, సర్పంచి, కార్యదర్శి పండుగ వేడుకల నిర్వహణకు పూర్తి స్థాయిలో  ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు సిసి  కెమెరాలను ఏర్పాటు చేసి వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొరోనా  జాగ్రత్తలు తీసుకుంటూ  వేడుకలు జరిగేలా చూడాలనీ, అన్ని గ్రామాలు, పట్టణాల్లో కొరోనా  వ్యాక్సినేషన్‌ 100‌శాతం  పూర్తి చేయాలనీ, 100శాతం పూర్తైన గ్రామాల్లో పూర్తయినట్లు తెలిపే బోర్డులు పెట్టాలనీ ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచించారు.

Leave a Reply