Take a fresh look at your lifestyle.

బతుకమ్మ ఒక అవతరణ

“బతుకమ్మ రాష్ట్ర పండుగ మాత్రమే కాదు, అది రాష్ట్ర అవతరణకు నిండు ప్రతీక. స్వరాష్ట్రపు పునరుజ్జీవనానికి మహత్తర సంకేతం. దశాబ్దాల అనంతరం తెలంగాణా స్వీయ అస్తిత్వం తిరిగి పౌరుషంగా ఆడి పాడిన దశకు ఆధార మార్గం ఈ పండుగ మహాత్యమే. కరువు కాటకాలు, అపసవ్య పాలన, అన్నీ కలిసి తెలంగాణను కాగితం బతుకమ్మలు ఆడుకునే స్థితికి నెట్టగా మలిదశ ఉద్యమం తిరిగి ఇక్కడి బతుకులను ఒక పోరాట భూమికగా మార్చింది. అందులో బతుకమ్మ పండుగ  స్వరాష్ట్ర సాధనలో కీలక భూమికగా మారింది. అందరి గొంతులను సవరించింది. ఇదంతా ఒక మహత్తర బతుకమ్మ ఒరవడే. ఒక్క మాటలో స్వరాష్ట్రం అన్నది బతుకమ్మ పండుగే. అది  మనలో మనం కలబోసుకునే సమస్యలను సవరించుకునే పండుగే. అది మరింత అందంగా మరింత విస్తృతంగా సకల జనులతో పెనవేసుకుని, ఒకరు పాడుతుంటే మరొకరు అందుకునే పాటగా రాణించేందుకు, కాళోజీ వంటి పెద్దలు దీవించినట్లు ‘‘‘బతుకమ్మా బతుకు’ అన్న దీవనార్తికి మూలంగా భాసించేందుకు వీలైందీ అంటే మనందరి ఆటా పాటా ఒకటి కావడం వల్లే. అన్నీ కూడితేనే పండుగ సాకారమైంది. అందువల్లే పండుగ సందర్భంగా మన ప్రత్యేక రాష్ట్రాన్ని యాది చేసుకోవాలి.”

తెలంగాణ అంటే ఏమిటో చెప్పే ఏకైక ప్రతీక బతుకమ్మ. అది ఆటగా ఉన్నది. పాటగా ఉన్నది. అది తీరుబాటుతో కూడినది. సకల జనులను సామూహికంగా కూడగట్టేడిది. ఇంటి నుంచి వాకిట్లోకి, అక్కడి నుంచి కూడలిలోకిబీ ఆడ నుంచి చెరువుకు చేరేటిది. చెరువులను శుభ్ర పరిచినట్టే అది మన హృదయ నాళాలను పరిశుభ్రం చేసేడిది. అది మొత్తం తెలంగాణ జీవావరణం గురించి, ఇక్కడి జానపద చిత్తాన్ని, ప్రకృతిని గురించి చాటుతది. ముడుచుకుని విప్పే పువ్వులా అడబిడ్డ లందరిని ప్రకృతిలో లీనం చేస్తది. మగవాళ్ళను అందులో సమయోచిత భాగస్వాములుగా మారుస్తది. ఇవన్నీటితో పాటు పోరాట భూమికగా కూడా బతుకమ్మ ఎటువంటి పాత్ర పోషించినదో స్వరాష్ట్ర ఏర్పాటే మనకు మంచి ఉదాహరణ. ఇంతటి ప్రశస్తి మరే పండుగకూ లేదు. జీవితాన్ని బతుకమ్మగా కొలిచే ప్రకృతి బిడ్డలా వరం ఇది. మలిదశ ఉద్యమంలో అది ఆధిపత్య పాలనను సుతారంగా పక్కకు నెట్టి, అవశ్యమైన చరమగీతం మనకు అందించడమూ మరచిపోరాదు.

మారుతున్న కాలానికి బతుకమ్మ ఒక శరణు. స్థిరమైన వేడుక. అది తల్లిగారిల్లు, కన్న ఊరితో మమకారానికి చేర్పు. మల్లెసార నుంచి చేను చెనుకా…చెరువు దాకా బతుకమ్మ రెండు చేతుల్లో విరిసే నిండు సౌభాగ్యం. అదే దసరా నాడు కనిపించే పాలపిట్ట వలే జీవితానికి శుభప్రద స్వాంతన. ఇది పరంపరా గతం.తల్లులు బిడ్డలకు తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందిస్తున్న ఆశీర్వాదం. అందరూ ఒక్క ఒక చెంతకూడి పూలు పెర్చిడం, ఆడటం, పాడటం, నిమజ్జనం, అన్నీ కూడా ఒక పెద్ద బాలశిక్ష. జానపదుల అవధానం. ఇదే మన అచ్చమైన సంగీత సాహిత్య అకాడమీ. నాటికీ, నేటికీ అది పదిలం. తెలియంది ఎవరికి. తెలంగాణలో ఆడబిడ్డలు తమ కష్ట సుఖాలను కలబోసుకునేందుకు బతుకమ్మ నవరాత్రులూ గొప్ప బలిమి. ఒకనాడు మనుషుల మధ్య దూరం, రాకపోకలకు ఎన్నోఅడ్డంకులు. దాంతో బతుకమ్మ పండుగే ఆసరా అయ్యేడిది. ఆడబిడ్డకు తమ తల్లిగారింటితో వారధిగా ఈ పండుగే నిలిచేది. ఉన్నన్ని రోజులు ఒక శోభ. ఈ తొమ్మిది దినాల్లో తమ బిడ్డ ఎట్లున్నదో తల్లిదండ్రులకు తెలిసేది. అన్నదమ్ములకు సోదరి మంచి చెడ్డా విశదం అయ్యేది. అన్నొద్దులు తల్లిగారింట ఉండే తీరికా వీలూ కారణాన అందరిలో ఆత్మీయతలు విరిసేవి. అనురాగం ఒలికేది. మనసులో గూడు కట్టుకున్న రందులన్నీ తొలగిపోయేటివి.

అది ఒక్క కుటుంబం విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి, స్వరాష్ట్రంలో మన బతుకు – పరిపాలన కూడా తల్లిగారింట బతుకమ్మ పండుగ వంటిదే. పరాయి నుంచి మనింట్ల మనం నిచ్చింతగా బతుకే తీరుకు భరోసాయే ఈ పండుగ. దశాబ్దాల అనంతరం మన స్వీయ అస్తిత్వం తిరిగి పౌరుషంగా ఆడి పాడిన దశకు ఆధార మార్గం ఈ పండుగ మహాత్యమే. కరువు కాటకాలు, అపసవ్య పాలన, అన్నీ కలిసి తెలంగాణను కాగితం బతుకమ్మలు ఆడుకునే స్థితికి నెట్టగా మలిదశ ఉద్యమం తిరిగి ఇక్కడి బతుకులను ఒక పోరాట భూమికగా మార్చింది. అందులో బతుకమ్మ పండుగ స్వరాష్ట్ర సాధనలో కీలక భూమికగా మారింది. అందరి గొంతులను సవరించింది. ఇదంతా ఒక మహత్తర బతుకమ్మ ఒరవడే. ఒక్క మాటలో స్వరాష్ట్రం అన్నది బతుకమ్మ పండుగే. అది మనలో మనం కలబోసుకునే సమస్యలను సవరించుకునే పండుగే. అది మరింత అందంగా మరింత విస్తృతంగా సకల జనులతో పెనవేసుకుని, ఒకరు పాడుతుంటే మరొకరు అందుకునే పాటగా రాణించేందుకు, కాళోజీ వంటి పెద్దలు దీవించినట్లు ‘‘‘బతుకమ్మా బతుకు’ అన్న దీవనార్తికి మూలంగా భాసించేందుకు వీలైందీ అంటే మనందరి ఆటా పాటా ఒకటి కావడం వల్లే. అన్నీ కూడితేనే పండుగ సాకారమైంది. అందువల్లే పండుగ సందర్భంగా మన ప్రత్యేక రాష్ట్రాన్ని యాది చేసుకోవాలి. మన రాష్ట్రంలో మన పండుగ జీవనానికి కారణమైన సారథులను, త్యాగాధనులను, సకల జనుల పోరాట శీలతను పేరుపేరునా స్మరించుకోవాలి. ఇదొక అందమైన గురుతర భాద్యత.

ఒక్కలా ఇద్దరా….మితవాదులు, అతివాదులు. నక్సలైట్లు, పోలీసులు. కవులు, గాయకులు. విద్యార్థులు, పాత్రికేయులు, అడ్వకేట్లు, ఉద్యోగులు. అందరిదీ ఒక బాట. ఒకే మాట. పేర్చిన బతుకమ్మ నిమజ్జనం చేయక తప్పనట్లు, అమరుల త్యాగాలూ వేనవేలు. తల్లుల గర్భశోకమూ ఒక గొడగొడ దుఖపు పాట. అన్నీ కలిస్తేనే బతుకమ్మ. తెలంగాణ సాధన. అన్నీ నేడు యాది చేసుకోవాలె. సత్యభామ వలే కవితమ్మను సాంస్కృతికంగా సాయుధం చేసి పోరుసల్పేలా చేసిన బతుకమ్మను నేడు యాది చేసుకోవాలె. రాష్ట్ర అధినాయకులు కేసీఆర్‌ ‌తెలంగాణ సాధనలో అన్ని పార్టీలను, భిన్న భావజాలాలను పక్కనబెట్టి ఒకే లక్ష్యం కేసి సాగించిన పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవాలె. ఇదంతా బతుకమ్మ మెలుకువ అని గుర్తించాలె. కలిసి మెలిసి సాగించిన పండుగ పోకడగానే భావించాలే.

అంతెందుకు, కేసీఆర్‌ ‌రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ‘బంగారు తెలంగాణ’ అనడంలో కూడా బతుకమ్మే స్ఫూర్తి అని మరవకూడదు. అందుకే బతుకమ్మ పండుగ రాష్ట్ర అవతరణకు ప్రతీక అనడం. స్వరాష్ట్రపు పునరుజ్జీవనానికి మహత్తర సంకేతం అనడం. బతుకమ్మ మన అమ్మ. మన తెలంగాణ తల్లి. నేడు- రేపు- బతుకమ్మే మన ఆదర్శం. తీరిక్క పూవోలె ఒక పళ్ళెంలో కలిసి ఉందాం. కలిసి మెలిసి ఆడుదాం. పాడుదాం. ఎన్ని విపత్తులు, మహామ్మారులు ఎదురైనా సమిష్టి తత్వం, సామూహిక లాక్షాణికత వీగిపోకుండా చూసుకుందాం. ‘‘నీ ఆటలే ఆడుతాం. నీ పాటలే పాడుతాం’’ అని ఆ తల్లిని కొలుస్తూ నిండు ఆశీర్వాదం తీసుకుందాం. చల్లగా బతుకుదాం.

– కందుకూరి రమేష్‌ ‌బాబు
ఇండిపెండెంట్‌ ‌జర్నలిస్టు, 99480 77893

Leave a Reply