పంప్ హౌస్ ప్రమాదాలు చూస్తుంటే ఆందోళనగా ఉంది
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు అసెంబ్లీలో మున్సిపల్ బిల్లుపై హైదరాబాద్ గురించి మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారని, వర్షం వచ్చినప్పుడు రెస్క్యూ చేసేందుకు జిహెచ్ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయిందని విమర్శించారు.శనివారం అసెంబ్లీ లోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ .. భారీ వర్షాలతో పడుకున్న వాళ్ళు నిద్రలోనే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. 72వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో జెన్కో, గురువారం కల్వకుర్తి పంప్ హౌస్ ప్రమాదాలను చూస్తుంటే ఆందోళనగా ఉందని, పంప్ హౌస్ సంఘటన జరిగితే గత పాలకుల వల్ల జరిగిందని అనడానికి మంత్రికి సిగ్గు ఉండాలన్నారు.
అక్కడ పంప్ హౌస్ పెట్టకూడదని వారి ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. మూడు ఎక్స్పర్ట్ కమిటీలు అండర్ గ్రౌండ్లో పంప్ హౌస్ పెట్టకూడదని చెప్పినా కేవలం కాంట్రాక్టర్ల కోసం నిర్మించారని ఆరోపించారు. ఏడేళ్ల క్రితం రిటైర్ అయిన ఈఎన్సి అవసరమా అని, ఇలాంటి వాళ్ళ వల్ల ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఈఎన్సి మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఈ ఏడేళ్ల కాలంలో జరిగిన ప్రాజెక్టులన్నీ సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.