Take a fresh look at your lifestyle.

బతుకమ్మ పాట

శ్రీ గౌరిలననొప్పు ఉయ్యాలో
సీమంతునీలారా ఉయ్యాలో

చెప్పెదను వినరమ్మ ఉయ్యాలో
బతుకమ్మా కథను ఉయ్యాలో

ధర్మాంగుడనురాజు ఉయ్యాలో
ధరణిలో వెలిగెను ఉయ్యాలో

ఆరాజు భార్యయే సత్యవతి దేవి ఉయ్యాలో
నూరు నోములునోచి ఉయ్యాలో
నూరుగురు కొడుకులను కనిరి ఉయ్యాలో

నూరుగురు కొడుకులు ఉయ్యాలో
యుద్ధంలో హతమైరి ఉయ్యాలో

రాజ దంపతుల తపస్సు ఉయ్యాలో
మెచ్చె మహాలక్ష్మి ఉయ్యాలో

సిరుల శ్రీలక్ష్మీ దేవి ఉయ్యాలో
బిడ్డగా జన్మించే ఉయ్యాలో

బతుకు మాయమ్మని ఉయ్యాలో
బతుకమ్మ పేరుతో ఉయ్యాలో

ఆశీర్వదించిరి ఉయ్యాలో ఉయ్యాలో
పువ్వులత పూజించె ఉయ్యాలో

బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లలకు ఆనందాల పండగ ఉయ్యాలో

తంగేడు పూలతో ఉయ్యాలో
తల్లి నిను పూజింతు ఉయ్యాలో

గన్నేరు పూలతో ఉయ్యాలో
గౌరీ నిను పూజింతు ఉయ్యాలో

గోరింట పూలతో ఉయ్యాలో
గోముగా పూజింతుఉయ్యాలో

తామరపూలతో ఉయ్యాలో
తనివితీర పూజింతు ఉయ్యాలో

మల్లెపూలతో ఉయ్యాలో
మాత నినుపూజింతు ఉయ్యాలో

అల్లిపూలతోఉయ్యాలో
ఆనందంతో పూజింతు

పూలరాసులతో ఉయ్యాలో
పుత్రినిను పూజింతు ఉయ్యాలో

పసుపు కుంకము లిచ్చి ఉయ్యాలో
పడతి నిను పూజింతు ఉయ్యాలో

పరమేశుపాదాలఉయ్యాలో
ప్రతిదినము పూజింతు ఉయ్యాలో

అమ్మలగన్న తల్లి ఉయ్యాలో
ఆడబిడ్డవుమాకు ఉయ్యాలో

బతుకునిచ్చు తల్లి ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో

గౌరి నిను పూజించి ఉయ్యాలో
గంగకు చేర్చెదము ఉయ్యాలో

జనమును దీవించి ఉయ్యాలో
జయమునీయవె తల్లి ఉయ్యాలో

ఏటేటి నిను కొలుతుము ఉయ్యాలో
పోయిరావే తల్లి ఉయ్యాలో

పోయి రాబతుకమ్మ ఉయ్యాలో
పోయిరావే తల్లి ఉయ్యాలో

– డా।। బండారి సుజాత, హన్మకొండ
చరవాణి: 9959771228

Leave a Reply