Take a fresh look at your lifestyle.

‌బతుకమ్మ సంబురాలు

నేటి నుండి బతుకమ్మ సంబురాలు మొద)వుతున్నాయి. ప్రతీ ఆశ్వీయుజశుద్ధ అమావాస్య మొదలు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో అడుకోవటం ఆనవాయితీ.. కాకతీయుల కాలానికి పూర్వంనుండే ఈ వేడుకలు ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ఆరంభలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ప్రకృతినే పరవశింపజేసేవిగా ఉంటాయి. వర్షపునీటితో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు జల కళలాడుతుండగా, పంటభూములన్నీ పచ్చగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్న వేళ ఈ సంబురాలు అంబరాన్ని తాకేవిధంగా ఊరు, వాడల్లో కొనసాగుతాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ఈ ప్రాంత ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్దలతో ఆడుకునే ఈ పండుగ తెలంగాణ పండుగలన్నిటిలో విశిష్టమైనది, విశేషమైనది. ఇతర ఏ పండుగ రోజు అయినా ఆయా వేడుకలనుబట్టి ప్రత్యేక దేవీదేవతలను ప్రకృతి మనకు ప్రసాదించిన పూలతో పూజించడమన్నది సంప్రదాయం… కాని, పూలనే పూజించడమన్నది ఈ పండుగ విశిష్టత. అంటే ప్రకృతినే పూజించడం. సర్వ మానవులు ప్రకృతిని ఆరాధించాలన్న భావన ఈ వేడుకలో అంతర్లీనంగా సమాజానికి తెలియజేస్తున్నది. కేవలం ప్రకృతిని పరిరక్షించుకోవాలన్న సూచనేకాకుండా ఈ బతుకమ్మను పేర్చడంలో వినియోగించే పూలల్లో ఎలాంటి ఔషధ గుణాలున్నాయన్న విషయాన్నికూడా తెలియజెప్పుతుంది. తంగేడు పూలు లేకుండా బతుకమ్మ పరిపుష్టంకాదు. ఆకుపచ్చని ఆకుల మధ్య, పసుపుపచ్చని తంగేడుపూలను క్రింది వరుసలో పేర్చిన తర్వాత ఇతర పూలతో శంఖు ఆకారంలో బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మ ను పేర్చడంలో అంతే ప్రాధాన్యత గునుగుపూలకుంటుంది.

తెల్లని గునుగుకు రంగులద్ది మహిళలు బతుకమ్మను తీర్చిదిద్దడంలో పోటీ పడతారు. ఆ తర్వాత చేమంతి, కట్ల, సంపెంగ, సీత జడలు, రుద్రాక్ష, మందార, గోరింట, గులాబి, బంతి, పారిజాతం, గన్నెర, తామర లాంటి లభ్యమయ్యే పలురకాల పూలతో ఆకర్షణీయంగా పేర్చడంలో మహిళలు ఎంతో నేర్పరితనం చూపిస్తారు. చివరలో గుమ్మడి పూల మధ్య పసుపుతోచేసిన గౌరమ్మను చేసి పూజించడం ఆనవాయితీ. గౌరీదేవిని నెలకొల్పడంతో బతుకమ్మకు సంపూర్ణత చేకూరుతుంది. దాన్ని అప్పుడు పవిత్రంగా చూస్తారు. తొమ్మిది రోజులపాటు గౌరీదేవిని పురస్కరించుకుని పాటలన్నీ పల్లెపదాలతో ఎంతో లయబద్దంగా వీనుల విందుచేస్తాయి. ఈ పాటల్లో కుటుంబం, కట్టుబాట్లు, సంప్రదాయం, ఆప్యాయత, అనురాగం, పెద్దల పట్ల వినయ విధేయత•, కుటుంబ పెద్ద ఆజ్ఞలను పాటించే విధానం, కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిలు అత్తగారి ఇంట్లో మసలుకోవాల్సిన తీరు, సమాజం పట్ల ఎలాంటి అవగాహనతో ఉండాలన్న తదితర విషయాలు బోధించే• రీతిలో ఉండటం గమనార్హం.

తొమ్మిదిరోజులుకూడా ఏ రోజుకు ఆరోజు తాజా పూలతో బతుకమ్మను పేరుస్తారు. మొదటి రోజున ఎంగిలి బతుకమ్మగా పిలువగా మిగాతా రోజుల్లో పేర్చే బతుకమ్మలకు ఒక్కో రోజుకు ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులుకూడా తొమ్మిది విధాల పదార్థాలను అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తారు. చివరి రోజున ఆత్యంత వైభవంగా నిర్వహించే వేడుకను చద్దుల లేదా సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజు తొమ్మిది రకాల చద్దులు (పులిహోరలు) చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతారు. ప్రతీ ఇంట్లో ఈ వేడుకను ఎంతో భక్తి శ్రద్దలతో, నిష్టగా నిర్వహించడమన్నది చిరకాలంగా వొస్తున్నది. ఎనిమిది రోజుపాటు బంధువులు, స్నేహితుల మధ్య ఆడుకునే మహిళలు, చివరి రోజున ఆయా గ్రామం లేదా పట్టణాల్లోని మహిళంతా సామూహికంగా వేలు, లక్షల సంఖ్యలో చేరి ఈ సంబురాలను నిర్వహించుకుంటారు. ఈ పండుగకు మహిళలు తమ అత్తవారింటినుండి తల్లిదండ్రుల దగ్గరకు రావడం, వీరంతా ఆడుకోవడానికి సామూహికంగా చేరినప్పుడు సంవత్సరాల తరబడి కలువని చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం , ప్రేమను పంచుకోవడంద్వారా వారు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది.

చివరన గౌరమ్మను వోలలాడించి అత్తవారింటికి సాగనంపుతారు. అక్కడే ప్రసాద• వితరణ చేసుకోవడంతో తొమ్మిది రోజుల పండుగ పూర్తి అవుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేవారికి వయస్సుతో సంబంధంలేకుండా చిన్న పిల్లలు మొదలు మూడుకాళ్ళ ముదుసలి ముత్తైదువుల వరకు తొమ్మిదిరోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ విశేషం గురించిన కథలు అనేకం ప్రచారంలో ఉన్నప్పటికీ, మంచి బతుకును ప్రసాదించేదే బతుకమ్మ అన్న నమ్మకంగా ఈ పండుగను నిరుపేదలు మొదలు ధనవంతులవరకు ప్రతి ఒక్కరూ ఆచరించడమన్నది తరతరాలుగా వొస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయ సూచికగా ప్రాధాన్యతను సంతరించుకున్న బతుకమ్మ కేవలం తెలంగాణాల్లోనే కాదు, భారతదేశ ఎల్లలు దాటి విదేశాల్లోని భారతీయులతో సంబరాలు జరిపించుకుంటున్నది.

Leave a Reply