Take a fresh look at your lifestyle.

అనాగరిక చర్య ..!

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య పీఎల్‌జీఏ పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ ‌జరిపిన భీకర దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 24కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నక్సలైట్లలో కూడా 10-12 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. నాగరిక ప్రపంచంలో హింసకు ఎవరు పాల్పడ్డా సమర్థనీయం కాదు. అన్యాయాన్ని న్యాయంతోనే కాదు, అన్యాయంతో కూడా ఎదుర్కోవొచ్చెనే సూత్రాన్ని మావోయిస్టులు నమ్ముతారనీ..ఈ వైఖరి అనాగరికమయినది..ఏ నాగరిక రాజకీయ ప్రక్రియలోనూ భాగం కాకూడదని మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్‌ అభిప్రాయం.

దాడిలో మృతి చెందిన అమరజవాన్లకు కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా నివాళులర్పిస్తూ అమరులయిన జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం..మావోయిస్టులపై పోరు ఉధృతం చేస్తామనడం ఏ నాగరిక రాజకీయ ప్రక్రియలో భాగమో ఆలోచించాలి. కన్నుకు కన్ను..పన్నుకు పన్ను వైఖరి సభ్య సమాజంలో వాంఛనీయం కాదు. మావోయిస్టుల అంశం శాంతి భద్రతల సమస్యగా కాకుండా..రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడే సమస్యకు పరిష్క్రారం దొరికే అవకాశమున్నది. గత 4 దశాబ్దాలుగా ఈ సమస్యకు ముగింపు పలుకుతామని ప్రస్తుత కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాకు ముందు ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ హింస జరిగిన ప్రతి సందర్భంలోనూ అన్న మాటలివే..! మావోయిస్టులు తమ ఆధీనంలో ఉన్న రాకేష్‌ ‌సింగ్‌ అనే జవాన్‌ను మానవీయ కోణంలో వెంటనే విడుదల చేయాలి.

జవాన్‌ ‌రాకేష్‌ ‌సింగ్‌ను ఎత్తుకుపోవడం..మావోయిస్టుల్లో కూడా కొందరు చనిపోయారని వొస్తున్న వార్తలతో ఇది పరస్పరం జరిగిన కాల్పులుగా భావించాలి. ఒక వైపు కాల్పులు కాదు అన్నది స్పష్టం. ఈ ఎదురెదురు కాల్పుల్లో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది భద్రతా దళాలకే ..! మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ దాడిలో వారు అధునాతన ఆయుధాలు ఉపయోగించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దండకారణ్యం లాంటి ప్రాంతంలోకి నిగాహ్‌ ‌వర్గాలకు చిక్కకుండా ఈ ఆయుధాలు ఎట్లా వొచ్చాయి..అన్నది ప్రశ్న..! ఈ ఆయుధాలు సమకూర్చుకోవడానికి మావోయిస్టులకు నిధులు ఎక్కడివన్నది రెండవ ప్రశ్న..! ఈ ప్రశ్నలు ఎందుకు ముందుకొస్తున్నాయంటే…పెద్ద నోట్ల రద్దు సందర్బంగా..ఆ తరువాత కూడా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో తన చర్యను సమర్థించుకుంటూ పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్ర వాద కార్యకలాపాలకు అడ్డుకట్టవేయగలిగామని అన్నారు.

2016 నవంబర్‌ 8‌న చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రవాద కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టమవుతుంది. మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా భావించే ఒక్క ఛత్తీస్‌ ‌గడ్‌ ‌రాష్ట్రంలోనే ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకర దాడులు జరిగాయి. ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. భారత పాకిస్తాన్‌ ‌సరిహద్దు ప్రాంతం పుల్వామా తీవ్రవాదుల దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడి పాకిస్తాన్‌ ‌ప్రేరిపిత తీవ్ర వాదులు చేసినా..మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయిన మన దేశ పౌరసత్వం కలిగిన కొందరు చేసిన దాడుల్లోనయినా బలవుతున్నది మన దేశ పౌరులే. భద్రతా దళాలు కావొచ్చు..లేదా మావోయిస్టులు కావొచ్చు ..! కుటుంబ పోషణ కోసం, దేశం కోసం విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది ఒక వైపు…కుటుంబాలను వొదిలేసి అడవుల్లో నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం మావోయిస్టులు మరోవైపు..గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం దొరకని పోరాటాల్లో బలవుతూనే ఉన్నారు.

ఒక వైపు ఈ మధ్య కాలంలో పాలకులతో ఏకీభవించని వారిని దేశ ద్రోహులుగా..మరి కొందరిని తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ వారి నివాసస్థలాల్లో సోదాలు నిర్వహిస్తుంటే ..మరో వైపు 2వేల మంది భద్రతా సిబ్బందిపై అందులో పావు మంది కూడా లేని మావోయిస్టులు దాడి జరిపారంటే నిగాహ్‌ ‌వర్గాలు ఎంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారో గమనార్హం.

Leave a Reply