Take a fresh look at your lifestyle.

నిర్వహణ సామర్ధ్యం లేకనే ప్రైవేటీకరణ మంత్రం

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య వొచ్చే నెల మూడు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చింది. విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు విశాఖలోనూ,విజయవాడ,రాజమహేంద్రవరం వంటి నగరాలలో ఆందోళనలు సాగిస్తున్నాయి. పెట్టుబడుల సేకరణలో విఫలమవుతున్న ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన ఆలోచనా ధోరణిగా ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఆర్థిక సంస్కరణలు అమలులోకి వొచ్చిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి రావడంతో ప్రైవేటు రంగం ప్రాధాన్యం పెరిగింది.అయితే, నష్టాల్లో నడిచే పరిశ్రమలను మాత్రమే ప్రైవేటీకరించాలనేది పూర్వపు ప్రభుత్వాలు అనుసరించిన విధానం.

ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్న సంస్థలను కూడా వదిలించుకోవాలని కేంద్రం ఆలోచించడం శోచనీయం. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ విషయమే తీసుకుంటే ఈ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలని దానిని స్థాపించిన నాటి నుంచి నగర పౌరులు, ప్రజాప్రతినిధులు,ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు డిమాండ్‌ ‌చేస్తూనే ఉన్నారు. ఆంధ్రా హక్కుల ఛాంపియన్‌ ‌గా ఐదు దశాబ్దాల క్రితం పేరొందిన పార్లమెంటు సభ్యుడు తెన్నేటి విశ్వనాథం నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో నిరవధికంగా పోరాడిన ఫలితంగానే ఆ ఫ్యాక్టరీ వొచ్చింది.దాని తర్వాత ఆంధప్రదేశ్‌ ‌కి కేందప్రభుత్వానికి చెందిన చెప్పుకోదగిన పరిశ్రమలు ఏవీ రాలేదు. ఉక్కుఫ్యాక్టరీకి బైలదిల్లా గనులను కేటాయించాలని తెన్నేటి హయాం నుంచి ఆంధ్రులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీకి తాజా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌రాసిన లేఖలో కూడా బైలదిల్లా గనుల నుంచి ముడి ఇనుమును సరఫరా చేయాలని కోరారు.

కొత్త పరిశ్రమల స్థాపన విషయంలో కేంద్రం మొదటి నుంచి ఆంధప్రదేశ్‌ ‌పట్ల ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల పట్ల శీతకన్ను వేస్తోంది.ఈ విషయమై ఎంపీలు పార్లమెంటులో చేసే అభ్యర్ధనలు అరణ్య రోదనలు అవుతున్నాయి. యూపీఏ హయాంలో పదేళ్ళ పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆంధ్రా ఎంపీలే.అలాగే,ఇప్పుడు కూడా ఆంధప్రదేశ్‌ ఎం‌పీల మద్దతు ప్రభుత్వానికి కొనసాగుతోంది.అయినా కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌కింద విడుదల చేసిన నిధుల్లో కూడా ఉత్తరాది ప్రాంతానికి చెందిన పరిశ్రమలు, కార్పొరేట్‌ ‌సంస్థలకే కేటాయించింది. ఈ విషయంలో ఎంపీల గోడు వినేవారు ఎవరూ లేరు. కేంద్రం ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్కరి మాటా వినేట్టుగా కనిపించడం లేదు. దాదాపు 70 రోజుల నుంచి నిరవధిక ఆందోళన జరుపుతున్న రైతుల సమస్యలపై ఎట్టకేలకు చర్చిస్తామని ప్రధానమంత్రి మోడీ సోమవారం పార్లమెంటులో ప్రకటించారు.ఇవి ఎక్కడ,ఎప్పుడు జరుగుతుతాయో తెలియదు.

సమస్యలను నానబెట్టడం వల్ల అవి మరింత జటిలం అవుతాయనడానికి రైతుల ఆందోళనే ఉదాహరణ. అలాగే, బ్యాంకుల విలీనం, బ్యాంకుల ప్రైవేటు పరం చేసే అంశాలపై కూడా ప్రధాని కానీ, ఆర్థిక మంత్రి కానీ ఇంతవరకూ సంబంధిత వర్గాలతో చర్చలు జరపలేదు. బ్యాంకుల నిర్వహణ భారం పెరిగినందునే విలీనం ప్రతిపాదన తెచ్చామని నిర్మలా సీతారామన్‌ ‌తరచూ పేర్కొంటున్నారు. తెలుగువారి భావోద్వేగాలకు సంబంధించిన ఆంధ్రా బ్యాంకును యూనియన్‌ ‌బ్యాంకులో విలీనం చేయడం ఎంతవరకు సమంజం. ఆంధ్రబ్యాంకుకు ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్య్ర యోధుడు,హొ గాంధీజీకి సన్నిహితుడు అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు నష్టాలు లేకుండ నడుస్తోంది.

తెలుగువారంతా ఆ బ్యాంకులోనే డిపాజిట్లు దాచుకుంటారు.అటువంటి బ్యాంకును యూనియన్‌ ‌బ్యాంకులో విలీనం చేసి దాని నామరూపాలను లేకుండా చేసిన ప్రభుత్వంపై ఖాతాదారులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.అంతకు ముందు తెలంగాణా అస్తిత్వానికి ప్రతిరూపాల్లో ఒకటయిన నిజామ్‌ ‌కాలంలో స్థాపించబడ్డ స్టేట్‌ ‌బ్యాంకు అఫ్‌హొహైదరాబాద్‌ ‌ను కూడా ఎస్‌ ‌బీ ఐ లో విలీనం చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. బ్యాంకుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.దీని కన్నా నష్టాలు వొస్తున్న బ్యాంకులను పెద్దబ్యాంకులలో విలీనం చేయడం మంచిదని బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య సూచిస్తోంది. గతంలో రాకేష్‌ ‌కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం పెడచెవిన పెట్టింది. ప్రభుత్వం లాభదాయకమైన సంస్థలను ప్రైవేటు సంస్థల పరం చేయడమో, లేక పెద్ద సంస్థల్లో విలీనం చేయడమో చేస్తున్న కారణంగా స్థానికంగా ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, జీవిత భీమా సంస్థలో విక్రయించే వాటా పరిమితిని పెంచడం వల్ల కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

వివాహాలకు,ఇళ్ళ నిర్మాణాలకు ఎల్‌ఐసీ రుణాలు మధ్యతరగతి వారికి కామధేనువుగా పని చేస్తున్నాయి. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తీసివేయడం వల్ల మధ్యతరగతి ప్రజలు రుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వొస్తుంది.అంతేకాకుండా ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలతో నడుస్తున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపకుండా, కార్పొరేట్‌, ‌పారిశ్రామిక దిగ్గజాలను సంప్రదించి నిర్ణయాలను తీసుకుంటోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయ. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చివరికి ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ ఆస్థులను ధారపోయడానికే ఉపయోగ పడుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్‌ ‌దిగ్గజాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతోందన్న అపప్రథ ఇప్పటికే వొచ్చింది.

Leave a Reply