Take a fresh look at your lifestyle.

‌ప్రైవేటీకరణపై గళమెత్తిన బ్యాంకుల సేన

నష్టాలొస్తున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పోతుంటే  ప్రభుత్వ రంగ సంస్థలు అసలు ఇక మిగలవు.ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య బాగా తగ్గింది. నష్టాలకు కారణాలపై  లోతైన విశ్లేషణ జరగకపోవడంవల్లనే ప్రైవేటీకరణ పట్ల ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.అసలు ఆ శ్రద్ధ, ఆసక్తి వాటికి లేదు.   లాభాలొస్తే నడుపుదాం, లేకపోతే మూసివేద్దాం అనే ధోరణిలో ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల పట్ల అనుసరిస్తున్న విధానం. స్వాతంత్య్రానంతరం ఇదే వైఖరిని పూర్వపు పాలకులు అనుసరించి ఉంటే  దేశంలో ప్రభుత్వ సంస్థలనేవి మిగిలి ఉండేవి కావు.  బ్యాంకుల సంగతే తీసుకుంటే   ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను  జాతీయకరణ చేయడంతో ఆమెను అభివృద్ధి కారకురాలిగా,  పేదల పాలిట పెన్నిధిగా కొలిచారు.ఇప్పుడు అవే బ్యాంకులను  ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ  ప్రైవేటీకరిస్తున్నారు.

ప్రైవేటు మంత్రం అనేది ప్రభుత్వం చేపట్టే ఆఖరి అస్త్రం కావాలని గతంలో బ్యాంకింగ్‌ ‌నిపుణులు  ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.అయితే, నిపుణుల సలహాలు ప్రభుత్వానికి అవసరం లేదు. చుట్టూ చేరిన వందిమాగధుల సలహాలపైనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. వెయ్యి, ఐదొందల రూపాయిల నోట్లను రద్దు చేసినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం అందరిలో ఆశలు రేకొల్పింది.అయితే,అది అమలు చేసిన విధానం చూసిన తర్వాత ఆయన    కొన్ని వర్గాల కోసమే ఈ చర్య తీసుకున్నారన్న విమర్శలు నిరాధారం కాదనే భావన చాలా మందిలో కలిగింది. గుజరాత్‌ ‌కి చెందిన వజ్రాల వ్యాపారుల కోసమే ఆయన ఈ చర్య తీసుకున్నారని అప్పట్లో విమర్సలు వొచ్చాయి.

నీరవ్‌ ‌మోడీ,  మెహుల్‌  ‌చోక్సీ వంటి వ్యాపారులంతా గుజరాత్‌ ‌కి చెందిన వారే. వారిని రక్షించడం కోసమే ప్రధాని ఈ చర్య తీసుకున్నట్టు జనం ఇప్పుడు నమ్ముతున్నారు.  ఈ వ్యాపారులు  లండన్‌ ‌తదితర దేశాలకు పరారై రెండేళ్ళు దాటింది.వీరిని తీసుకుని వొచ్చేందుకు చర్యలంటూ రోజులు గడిపేస్తునారు కానీ, ఫలితం కనిపించడం లేదు. అంతకుముందే సురక్షితంగా లండన్‌ ‌లో స్థానం సంపాదించుకున్న విజయ్‌ ‌మాల్యాకి  బీజేపీ పెద్దలే కాదు.కాంగ్రెస్‌ ‌పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో  బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారు అంతా ఇప్పుడు బీజేపీలో చేరి మోడీని  ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలనూ, ముఖ్యమంత్రులను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తున్నారు. వారి బ్యాంకు  బకాయిల గురించి ప్రభుత్వం సీరియస్‌ ‌గా పట్టించుకోవడం లేదు. గతంలో ఇవన్నీ ప్రతిపక్షాల నోటంట వినిపించేవి.ఇప్పుడు బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘాల నాయకుల నోటంట వినిపిస్తున్నాయి. బ్యాంకులకు నష్టాలొస్తున్నాయని  ఒక పథకం ప్రకారం  ప్రభుత్వం ప్రచారం చేస్తోందనీ, దేశీయ పెట్టుబడుదారులు,  పారిశ్రామిక వేత్తలు చెల్లించాల్సిన బకాయిల గురించి  వసూలు ప్రక్రియ ప్రారంభించే సరికి ప్రభుత్వంలోని పెద్దల నుంచి ఒత్తిడులు వొస్తుంటాయని బ్యాంకు అధికారుల సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వానికి ఈ బకాయిదారులెవరో వేరే చెప్పనవసరం లేదు.వారంతా ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలోని పెద్దలను అంటిపెట్టుకుని తిరుగుతుంటారు.   బ్యాంకుల విలీనం తో ప్రారంభించి చివరికి ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేయడానికి నిరసనగా    మార్చి 15,16  తేదీల్లో  దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది సమ్మె చేస్తున్నారు. వీరికి వామపక్షాల అనుబంధ ట్రేడ్‌ ‌యూనియన్లు మద్దతును ప్రకటించాయి. ప్రభుత్వం  గతంలో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారనేసరికి ఖంగారు పడేది ఇప్పుడు అలాంటవేమీ లేవు. రెండు రోజులు బ్యాంకులు మూత పడుతున్నాయనేసరికి లావాదేవీలు ఏమేరకు నష్టపోతున్నాయో బ్యాంకులకు తెలియంది కాదు.కానీ, ముందే యాజమాన్యాలు తమ ఇష్టులైన సమాచారాన్ని ఇచ్చి వారి పనులు చక్కపెట్టేస్తున్నాయి.ఆ తర్వాత ఎన్నిరోజులు బ్యాంకులు మూసుకున్నా  అస్మదీయులకు నష్టం ఉండదు.

రోజువారీ లావాదేవీలు జరుపుకున్న చిన్న, మధ్యతరగతి వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.  గతంలో  బ్యాంకుల ఉద్యోగుల సంఘాలకు తారకేశ్వర చక్రవర్తి వంటి ఉద్దండులైన నాయకులు ఉండేవారు. వారు  ముంబాయిలో  గర్జిస్తే  ఢిల్లీలో  పీఠం కదిలేది.అలాంటి నాయకులు ఇప్పుడు లేరు.అందుకే వారిని ప్రభుత్వం లెక్క  చేయడం లేదేమోననిపిస్తోంది.అలాగే, కమ్యూనిస్టు నాయకులైన ఇంద్రజిత్‌ ‌గుప్తా, భూపేష్‌ ‌గుప్తా, హిరేన్‌ ‌ముఖర్జీ వంటి వారు బ్యాంకు ఉద్యోగుల తరఫున  పార్లమెంటులో ఇరుకున పెట్టేవారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నగర్‌ ‌వాలా బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నష్టం 70 కోట్లు అయినప్పటికీ రోజుల తరబడి పార్లమెంటును  స్తంభింపజేశారు.ఇప్పుడు అంతకు వెయ్యిరెట్లు ప్రజల సొమ్మును బకాయిదారులు దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వం చీమకుట్టనట్టు వ్యవహరిస్తోంది.

ఇందిరాగాంధీని పదే పదే విమర్శించిన ఆనాటి భారతీయ జనసంఘ్‌ ‌వారసులైన భాజాపా నాయకులు ఇప్పుడు వేల కోట్ల బ్యాంకింగ్‌ ‌కుంభకోణాలకు బాసటగా నిలుస్తున్నారు.  అలాగే,  ఆర్థిక పరమైన అక్రమాల్లో ఆనాటి కాంగ్రెస్‌ ‌నాయకులను తలదన్నే రీతిలో నేటి బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కాలమహిమ అనుకోవాలా లేక   మనుషుల్లో వచ్చిన మార్పు అనుకోవాలా..!.

Leave a Reply