Take a fresh look at your lifestyle.

తలసరి జిడిపిలో మనల్ని దాటి పోయిన బంగ్లాదేశ్‌

కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ‌నివేదిక స్పష్టం చేస్తోంది. కొరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసమే లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలనుద్దేశించి  చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.  నాలుగైదు విడతలు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించే ముందు ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడారు. వారి  అభిప్రాయాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియదు. కానీ, లాక్‌ ‌డౌన్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారన్నది అందరికీ అనుభవమే. ఈ లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు వేతనాలు కరవయ్యాయి.  మరో వంక దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది.  ప్రస్తుత  సంవత్సరంలో   మన కన్నా చిన్న దేశమైన బంగ్లాదేశ్‌ ‌మన దేశాన్ని  తలసరి  జిడిపి (స్థూల జాతీయోత్పత్తి)లో అధిగమించనుంది. ఐఎంఎఫ్‌ ‌వరల్డ్ ఎకనమిక్‌ అవుట్‌ ‌లుక్‌ ‌నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌ ‌తలసరి జిడిపి 1888 డాలర్లతో 4 శాతం వృద్దిని సాధించనుంది. అదే సందర్భంలో భారత్‌ ‌తలసరి జిడిపి నాలుగేళ్ళ కనిష్ఠ స్థాయిలో  10.5 శాతం తగ్గి  1877 డాలర్లకు పడిపోతుందని అంచనా వేసింది. బంగ్లాదేశ్‌కు ఆవిర్భావ సమయంలో మన దేశ ప్రజలు సినిమా టికెట్లపై    అదనపు చార్జీలు చెల్లించి విరాళంగా ఇచ్చారు. అత్యంత దయనీయంగా ఉండే  బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితి మన దేశాన్ని అధిగమించడమంటే భారతీయులందరికీ సిగ్గుచేటే. భారత్‌ ‌తర్వాత పాకిస్తాన్‌, ‌నేపాల్‌ ‌తక్కువ తలసరి జిడిపి కలిగి ఉన్నాయి. బంగ్లాదేశ్‌, ‌భూటాన్‌,  ‌శ్రీలంక, మాల్దీవులు మన దేశం కన్నా ముందున్నాయి. శ్రీలంక తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని వరల్డ్ ఎకనమిక్‌ అవుట్‌ ‌లుక్‌ ‌పేర్కొంది. భవిష్యత్‌లో భారత్‌ ఆర్థిక రంగంలో వృద్ధిని సాధించవచ్చనీ, 2021లో తలసరి  జిడిపిలో బంగ్లాదేశ్‌ను భారత్‌ అధిగమించవచ్చని పేర్కొంది.

కొరోనా వల్ల అగ్రరాజ్యమైన అమెరికా, కొరోనా పుట్టినిల్లయిన చైనా సహా అన్ని దేశాలూ ఆర్థికంగా కుంగినా, అతి స్వల్ప కాలంలో తిరిగి పుంజుకున్నాయి. వ్యవస్థీకృతమైన బలహీనతల వల్లే భారత్‌లో తలసరి జిడిపి పతనం అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవినీతిని నిర్మూలించడం కోసం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ విషయమై మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు ఇంతకుముందే హెచ్చరించారు. అసలు పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రఘురామ్‌ ‌రాజన్‌ ‌రాజీనామా చేశారు. ఆయన రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా మరో పర్యాయం కొనసాగుదామనుకున్నారు. కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక ఆయన ముందే వైదొలగారు. అలాగే, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్నప్పటికీ, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన సంగతి మరిచిపోరాదు. అలాగే, ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో  మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవా పన్ను(జిఎస్‌టి) వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పన్నుల రాబడి లక్ష్యాలను చేరుకోలేకపోవడం వల్ల ఆదాయం బాగా తగ్గింది. దానికి తోడు కొరోనా ప్రభావం వల్ల జిఎస్‌టి రాబడి బాగా పడిపోయింది. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రభుత్వం మొదట్లో హామీ ఇచ్చింది. కొరోనా కారణంగా పడిపోయిన జీఎస్‌టి రాబడితో  రాష్ట్రాలకు  ఇవ్వాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవాలని సూచన చేస్తోంది. ఈ సూచనను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

కొరోనా కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించింది. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు ఆదాయం పడిపోయింది. దాంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ విషయాన్ని కూడా ఐఎంఎఫ్‌ ‌తన నివేదికలో పేర్కొంది. భారత ప్రజలు కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో   నిత్యావసరాలను సమకూర్చుకోవడానికే ఇబ్బందులకు గురి అయ్యారనీ, అందువల్ల వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయిందని కూడా పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం బాగా దెబ్బతింది. వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటళ్లలో సక్రమంగా లేకపోవడం వల్ల ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు తమ ఆదాయంలో   వైద్యానికి ఖర్చు చేశారనీ, ఇలా ఖర్చు చేసిన వారు 70 శాతం అని నివేదిక పేర్కొంది. లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తిగా విఫలమైందన్న వాస్తవాన్ని ఆర్థిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రధానమంత్రి మోడీ ఆర్థికశాస్త్రవేత్తలను సంప్రదించలేదనీ, తన మాటకు తలలూపే వారినే సంప్రదించారని కూడా  ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఎగవేతలు తగ్గిపోతాయనీ, అవినీతి తగ్గుతుందని ప్రధాని దేశ ప్రజలతో చెప్పారు.

కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత అవినీతి, ఎగవేతలు మరింతగా పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, గతంలో వాణిజ్య పన్నుల ఎగవేత ఎక్కువగా ఉండేదనీ, జిఎస్టీ వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని మోడీ తొలివిడత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన అరుణ్‌ ‌జైట్లీ తరచూ చెప్పేవారు. కానీ, జిఎస్‌టి ఆదాయం తగ్గడం వల్లనే రాష్ట్రాలకు  కేంద్రం పరిహారాన్ని చెల్లించలేకపోతోంది.  ఆర్థిక రంగంలో ప్రయోగాలు చేయడం, ఆ ప్రయోగాలు చేసే ముందు నిపుణులు, శాస్త్రవేత్తలను సంప్రదించకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. జిడిపికి సంబంధించిన  లెక్కలు సామాన్యులకు అర్థం కావు. కానీ, వాస్తవ పరిస్థితి కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. లాక్‌ ‌డౌన్‌ ‌తర్వాత ప్రజల కొనుగోలు శ క్తి తగ్గిందనేది నిర్వివాదం. అలాగే ఇతర రంగాల్లో కూడా లాక్‌ ‌డౌన్‌ ‌తదుపరి పరిణామాల వల్ల ఆదాయం కోల్పోయి  తిరిగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. కొరోనా  ప్రభావం అన్ని దేశాల్లో ఉన్నా,  ఆర్థిక రంగంలో భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యలు స్వయకృతమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక రంగం నిర్వహణలో లోపాలు ఇప్పుడు బహిర్గతం కావడమే ఇందుకు కారణం.

Leave a Reply