Take a fresh look at your lifestyle.

14 ‌నుంచి బండి సంజయ్‌ ‌రెండో విడత పాదయాత్ర

  • ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభం మహేశ్వరం బహిరంగ సభతో ముగింపు
  • పాదయాత్ర మధ్యలో పాల్గొననున్న జాతీయ నాయకులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 14న ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 31 రోజులు సాగి మే 31న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్‌ అవమానించారంటూ అందుకు నిరసనగా అంబేద్కర్‌ ‌జయంతి రోజైన ఏప్రిల్‌ 14 ‌నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించాలని బండి సంజయ్‌ ‌నిర్ణయించారు.

ఈ మేరకు ఇప్పటికే సంజయ్‌ ‌పాదయాత్ర సాగనున్న నియోజకవర్గాల పార్టీ ముఖ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్‌ ‌నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాలలో సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని బండి సంజయ్‌ ‌భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ పాలన, అవినీతి, అరాచక పాలన అంతమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంజయ్‌ ‌విద్యుత్‌ ‌చార్జీల పెంపు, యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిని కూడా ఎండగట్టనున్నట్లు ప్రకటించారు.

విద్యుత్‌ ‌సంస్థలకు బకాయి పడిన మొత్తాన్ని చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపి వారి జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నదని ఆరోపించారు. కాగా, బండి సంజయ్‌ ‌పాదయాత్రలో బీజేపీ జాతీయ నాయకులు కూడా పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తదితర ముఖ్య నేతలు పాదయాత్ర మధ్యలో జాయిన్‌ అవుతారనీ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Leave a Reply