Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గర్లోనే

  • కాషాయపు దండు కదిలింది
  • గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగరేస్తాం
  • త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
  • 317జీవో సవరణపై పాలమూరులో నిరసన సభలో ప్రభుత్వ తీరుపై గర్జించిన బండి సంజయ్‌

మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర ప్రతినిది, జనవరి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని, అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జైలుకు వెళ్లడం ఖాయమని, కెసిఆర్‌ ‌పాతాళంలో, స్వర్గంలో ఉన్నా బయటికి తీసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా దండు కదిలిందని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ అరాచక పాలనకు అంతం సమయం దగ్గర్లోనే ఉందని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగర వేస్తామని బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని జిఆర్‌ఆర్‌ ‌గార్డెన్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌లో ఏర్పాటుచేసిన 317 జిఓకు వ్యతిరేకంగా నిరసన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పాలిట తీసుకువచ్చిన 317 జీవో దరిద్రపు జిఓ అని, స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా భార్యాభర్తలను, దివ్యాంగులను విడదీసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగుల ఉసురు తగులుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యోగులు నిరవధిక సకల జనుల సమ్మె చేపట్టి తెలంగాణ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, అటువంటి ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనాలోచితతో 317 జీవోను ప్రవేశపెట్టి ఉద్యోగుల పాలిట శాపంగా మార్చారన్నారు. 317 జీవో సవరణపై అతి త్వరలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. కెసిఆర్‌ ‌మెడలు వంచి 317 జీవోను సవరణ చేపట్టేందుకు ఎంతకైనా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌ ‌నుండి దివ్యాంగురాలు షహనాజ్‌ ‌బేగంను వనపర్తి జిల్లాకు బదిలీ చేశారని వారి పాపం ఊరికే పోదన్నారు. ఎవరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 317 ‌జీవోను తెచ్చారో స్పష్టం చేయాలని అన్నారు. ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ పూర్తి అండగా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్యకు స్పందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని నాడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన ఫాంహౌస్‌లో విలాసాలతో ఉన్నారని పార్లమెంటుకు హాజరు కాలేదని గుర్తు చేశారు.

చరిత్రలను తిరగరాస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పాలనతో ప్రజలు విసుగు చెందారని, అవినీతిపై విచారణ తప్పకుండా జరుగుతుందని, గదిలో బందీ అయిన తెలంగాణను విముక్తి కలిగించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకలించేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, ఇటీవల తనపై జరిగిన అరెస్టుపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్‌ ‌చేశారని తెలంగాణలో పోరాటానికి తాను అండగా ఉంటానని చెప్పారని సభాముఖంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుండి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారో పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మానవత్వం లేని మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, తెలంగాణ ఏర్పడిన నాటి నుండి డిఎస్‌సి కూడా వేయలేదన్నారు. అలాగే పాలమూరు జిల్లా కేంద్రంలోనూ అవినీతి అక్రమాలు చేస్తున్న నాయకుల భరతం పడతామన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబ భవాని మాత దేవాలయం ఆస్తులను ప్రజా ప్రతినిధులు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దేవాలయాల జోలికొస్తే పుట్టగతులుండవని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో పెండింగ్‌ ‌ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నా వాటిని పూర్తి చేయలేని అసమర్థత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిలో ఉందని ప్రతి పూట చెబుతున్నటువంటి నాయకులు మాటలు ఉత్తివే అని, వాస్తవంగా అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులు కేంద్ర నిధులతోనని గుర్తు గుర్తుంచుకోవాలన్నారు. వాటిని కూడా పూర్తి దశలో చేయలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజలకు ఎర వేసిన పథకాలు కాగితాల వరకే ఉంటున్నాయన్నారు. ఇప్పటి వరకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లు, గొర్రెల యూనిట్ల పంపిణీ పూర్తి చేయలేక పోయారన్నారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల మాట్లాడుతూ ఉద్యోగులతో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పాతాళంలోకి పోతున్నానన్న సంగతి మరువకూడదన్నారు. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలని సీఎం కేసీఆర్‌ ‌తెలుసుకోవాలన్నారు. అలంపూర్‌ ‌నుండి ఆదిలాబాద్‌ ‌వరకు రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బొంద పెట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్‌ ‌రెడ్డి, మాజీమంత్రి పొడపాటి చంద్రశేఖర్‌, ‌రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌, ‌మాజీ ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాస్‌ ‌రెడ్డి, నాయకులు నాగూరావు, నామాజీ బంగారు శృతి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌, ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీ శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply