- గుర్రంపోడు తండా వెల్లిన వారిపై అక్రమ కేసులు,బెదరింపులు
- మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల అరాచకాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గుర్రంపోడు వెళ్ళి వచ్చిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, మప్టీలో అర్థరాత్రి ఇండ్లలోకి వచ్చి గుండాల్లా, రౌడీల్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు ఐజీ ప్రభాకర్ రావు డైరెక్షన్ లో పోలీస్ అధికారులు బీజేపీ కార్యకర్తలు, నాయకులను హింసిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన భరోసా యాత్రలో భాగంగా గుర్రంపోడు వెళ్లిన తమకు పోలీసులు రక్షణగా వచ్చారనుకున్నాం.. కానీ స్థానిక నేతల అక్రమ నిర్మాణాలకు కాపాడేందుకు వచ్చారని తర్వాత తెలిసిందన్నారు.
ఆ ఘటనలో తమపై లాఠీ చార్జి చేశారని, భూముల కోసం పోరాడుతున్న గిరిజనులపై ప్రైవేటు గూండాలతో కుక్కలతో దాడి చేయించారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను పోలీసులే కాపాడారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2023 వరకు మాత్రమే ఉంటుందని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కొంత మంది పోలీసులకు హెచ్చరిస్తున్నట్టు సంజయ్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇంటిలిజెన్స్ ప్రభాకర్ సంగతేందో తేలుస్తామని , ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. ఐజీ ప్రభాకర్ రావు ఆస్తుల వివరాలు.. మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టా మొత్తం తీస్తున్నామన్నారు. కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గుర్రంపోడు తండా భూములు గిరిజనులవేనని హైకోర్టు చెప్పిందన్నారు. భూములు కబ్జా చేసిన నేతలు గిరిజనులను కొట్టించారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల గుండాలను తెప్పించి గిరిజనులను కొట్టించారని వ్యాఖ్యానించారు. అక్రమ షెడ్లను కూలిస్తే పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. కొందరు పోలీసులు బడా భూస్వాములకు సహకరిస్తున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో గెలిచి తీరతామని చెప్పారు.సాగర్ ఎన్నికల ఫలితాల తర్వాత తల ఏడ పెట్టుకుంటాడో సీఎం కేసీఆర్ ఆలోచించుకోవాలని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.