Take a fresh look at your lifestyle.

అవినీతికి నిలయం..ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయం…!

  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు ఒక్కోరేటు..
  • చేయితడపనిదే ఫైలు కదలదు…

తాజాగా లంచం డిమాండ్‌ ‌చేస్తూ అవినీతి నిరోదక శాఖకు చిక్కిన తహసీల్దార్‌ ‌బల్దూరి చందర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొవచ్చి ప్రజలకు, లబ్దిదారులకు నీతివంతమైన పాలన అందించేందుకు కృషిచేస్తున్న క్రమంలోనే మరో పక్క అవినీతిలో ఆరితేరిన కార్యాలయ సిబ్బంది యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చేయి తడపనిదే పనులు జరగడం లేదని, డబ్బులిచ్చినా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొందని పలువురు బాధితులు వాపోతున్నారు. తహసీల్దార్‌ ‌కార్యాలయంలో అవినీతి రూపుమాపేందుకు ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా అవినీతి అధికారులు, సిబ్భంది భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అవినీతిపరుల్ని ప్రత్యక్షంగా పట్టుకొని జైలుకు పంపుతున్నా వారిలో మార్పు రాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జులై నెలలో ఆమనగల్లు తహసీల్దార్‌ ‌చందర్‌రావు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ‌ఖాజ నుంచి రూ.25వేల లంచం డిమాండ్‌ ‌చేశారు. ఆయనను ఏసీబీ అధికారులు బధవారం అరెస్టు చేశారు.

అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎండీ ఖాజ రక్షిత కౌలుదారు పత్రంకోసం దరఖాస్తు చేసుకున్నారు. పత్రం ఇవ్వటానికి తహసీల్దార్‌ ‌బల్దూరి చందర్‌ ‌రావు రూ. 25వేలు డిమాండ్‌ ‌చేయగా ఖాజ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు రెడఖ హ్యాండెడ్‌గా పట్టుకుని ఈ మేరకు విచారణ చేసి చందర్‌రావుపై కేసు నమేదు చేసి గండిపేట లోని ఆయన నివాసంలో అరేస్టు చేసి ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి ఉప తహసీల్దార్‌ ‌మనోహర్‌ ‌నుంచి కంప్యూటర్‌ ‌దస్త్రాలు స్వాథీనంచేసుకున్నారు. జులై 26నుంచి తహసీల్దార్‌ ‌చందర్‌రావు సెలవులో ఉన్నారు. ఆమనగల్లు తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్‌ ‌సర్టిఫికేట్‌, ‌బర్త్ ‌సర్టిఫికేట్‌, ‌భూ సమస్యలపై పంచనామాల నిర్వాహణ, గతంలో రిజిస్టేషన్‌ ‌పాసుబుక్కులు ఇవ్వడం విరాసత్‌లు అమలులో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ధరణీలో భూ రికార్డులు భద్రం చేసిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో పాత పద్దతే కొనసాగుతుందని భావించిన రైతులు మధ్య దలారులను ఆశ్రయిస్తున్నారు.

తహసీల్దార్‌ ‌కార్యాలయ సమీపంలో ఉన్న ఓ మీ సేవా కేంద్రానికి తహసీల్దార్‌ ‌కార్యాలయ సిబ్భందికి అధికారులకు బినామిగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. నిర్ణీత సమయంలో అందించాల్సిన వివిధ పత్రాలు, సర్టిఫికేట్‌లు సిబ్బంది అందించకుండా వివిధ కారణాల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తు అవస్థల పాలు చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు సమయంలో అన్నిరకాల పత్రాలు సమర్పించినా నేరుగా డబ్బులు డిమాండ్‌ ‌చేస్తున్నారని పలువురు ప్రజాతంత్ర విలేఖరికి తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే తాము వివిధ పనుల్లో బిజీగా ఉన్నామని పని ఒత్తిడి అధికంగా ఉందని కొంత సమయం తరువాత పనిచేసి పెడతామని సతాయిస్తున్నారని రాంనుంతల తాండాకు చేందిన ఓ రైతు వాపోయాడు.

రాంనుంతల గ్రామ శివారులో సర్వే నంబరులో 64 ఆ3లో 1-18 ఎకరాల విస్తిర్ణంలో 1ఎకర అమ్మగా 18 గుంటలకు సంబంధించి దరఖాస్తు చేసుకొని తన పేర పాసు బుక్కు ఇవ్వకుండా సర్వే చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతు కమ్లి అరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌మంజూరు కావాలంటే చేయి తడపనిదే పని జరగడం లేదని ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పత్రాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న సిబ్బంది భరతం పట్టి ప్రజలకు న్యాయమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

Leave a Reply