Take a fresh look at your lifestyle.

ముగిసిన బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం

  • స్థానికేతరులు వెళ్లి పోవాలని పోలీసులు ఆదేశం
  • ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • చివరి రోజు వైసిపి నేతల ప్రచార హంగామా
  • వార్‌ ‌వన్‌సైడే అన్న ఎమ్మెల్యే రోజా

కడప,అక్టోబర్‌ 27 : ఈనెల 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం ముగియడంతో స్థానికేతరులను ఖాళీచేయాలని ఆదేశించారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల కమిషన్‌ ‌సూచించింది. దీంతో ఈనెల 27న బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి తెర పడింది. ఈనెల 30న బద్వేల్‌ ‌పోలింగ్‌కు కొత్త నిబంధనలు ప్రకారం 72 గంటల ముందే ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. బద్వేల్‌ ‌నియోజకవర్గంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నియోజకవర్గంలో నలువైపులా విస్తృతంగా పోలీస్‌ ‌తనిఖీలు నిర్వహించారు. బయట వ్యక్తులు నియోజకవర్గం విడిచి వెళ్లాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న 2 లక్షల 15 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బద్వేల్‌ ‌బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. బద్వేలులో త్రిముఖ పోరు నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ తరపున డాక్టర్‌ ‌సుధ, కాంగ్రెస్‌ ‌తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్‌ ‌పోటీలో ఉన్నారు. వీరుగాక మరో 12మంది వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున ఇప్పటికే పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

వైఎస్సార్‌సీపీ తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు అంజద్‌బాషా, నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచారాన్ని వేడెక్కించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత సాధించిన వైఎస్సార్‌సీపీ ఫుల్‌ ‌జోష్‌లో ఉంది. బద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ ‌తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే నని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. నామినేషన్ల దాఖలు అనంతరం వ్యూహాలు, ఎన్నికల ఎత్తులు, ప్రచార పర్వంలో నేతలు నిమగ్నమయ్యారు. దాదాపు 20నుంచి 25 రోజులుగా ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్రులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ ‌సుధకు భారీ మెజార్టీ తీసుకొ చ్చేందుకు పలువురు నేతలు ప్రణాళికలు రూపొందిస్తూ.. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ వచ్చారు.

బీజేపీతోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం రాష్ట్ర నేతలు కూడా బద్వేలులో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్‌ ‌గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్‌ ‌వన్‌సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్‌ ‌సీపీని లక్షఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply