వరంగల్ క్రై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట గురువారం బాబు కుటుంబ సభ్యులతో పాటు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన పెసరు శ్రీలత, సాంబరాజు దంపతుల కుమారుడు బాబు(6 నెలలు)కు అనారోగ్యానికి గురికావడంతో హన్మకొండలోని ప్రైవేట్ పిల్లల ఆసుపత్రికి తీసుకవచ్చినట్లు బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం ఆసుపత్రి వైద్యులు బాబును చూసి సీరియస్‌గా ఉన్నదని, ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు.
హుటాహుటిన ఎంజిఎం ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగిందని, ఆసుపత్రిలో వైద్యులు బాబు అప్పటికే చనిపోయాడని చెప్పడం జరిగిందన్నారు. తమ బాబు చనిపోయిన తర్వాతనే ఎంజిఎంకు పంపారని వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడంటూ నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుకొని వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే తమ బాబు చనిపోయాడని సరైన చికిత్స అందిస్తే ఇంతటి ఘోరం జరిగేది కాదని బోరున విలపించారు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని నచ్చజెప్పి వైద్యులతో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది.
Tags: Baby death, neglect of doctors, hanmakonda, private hospital, thatikayala palli