Take a fresh look at your lifestyle.

‘‘‌కర్షక రౌద్ర కవాతు!’’

మనందరికి అన్నం పెట్టే
అన్నదాత చేతుల్లో
అవస్థల అగ్నికీలలు
చెలరేగుతున్నాయ్‌!
‌పచ్చని చేలకు ప్రాణం పోసే
ప్రాణదాత పర్ణ కుటీరం
అశాంతి నిలయమై
బోరున విలపిస్తోంది!

నేల తల్లికి వందనం చేసి
అరకపట్టి దుక్కి దున్ని
ఆరుగాలం కష్టం చేసే
రైతన్న కాయకష్ట గుండెల్లో
నేడు పెను సవాళ్ల కత్తులు
కస్సుమని దిగబడుతున్నాయ్‌!

‌తొలకరి జల్లుల కోసం
ఆశగా ఆకాశం వైపు చూసే
కర్షకన్న కళ్లల్లో
రుధిర ప్రవాహాలు గట్లు తెగి
ఆశా జీవితాన్ని ముంచేస్తున్నాయ్‌!

‌పదుగురి ఆకలి తీర్చడానికి
రేయింబగళ్లు చెమటోడ్చే
అమాయక రైతు సోదరుని
పంచ ప్రాణాలు
అప్పుల నిప్పుల్లో
దగ్ధమవుతున్నాయి!

కల్తీ ఎరువుల, విత్తనాల
దందా దౌర్జన్య దోపిడీ
విష వ్యాపర సరళిలో
అనుక్షణం  మోసపోతూ
ఆత్మాహుతికి పాల్పడుతూ
చెట్టు కొమ్మకు శవమై
వేలాడుతున్నాడు!

అకాల వర్షాల దాడికి
అతలాకుతలమవుతూ
చేతికొచ్చిన పంట
కళ్ల ముందే  గంగపాలవుతుంటే
కన్నీరుమున్నీరవుతున్నాడు!

తనపై కత్తి కట్టిన
ప్రకృతి విలయానికి
భీతావహ హృదయుడై
విలవిల్లాడుతున్నాడు!

పండిన పంట కొనే నాథుడు లేక
వ్యవసాయ మార్కెట్లు బోర్డు తిప్పేస్తే
దిక్కు తోచని రైతుల గుండెలు చెదిరి
మనసు వికలమై మోసు కొచ్చిన ధాన్యంపై
కుప్ప కూలిన రైతుల వెతల కథనాలు
ఆత్మార్పణ వేదిక సాక్ష్యంగా
బలిదానాల చిట్టా పద్దులు లిఖిస్తూ
బలవన్మరణ ఉసురుపోసుకుంటూ…
పాలకుల ఉదాసీనతను ఎండగడుతున్నాయి!

అక్కరకు రాని చట్టాలు
వెలుగు చూపని
వాగ్ధానాల భరోసాలు
కంటి తుడుపు
రాజకీయ క్రీడలు!

గుండెలు మండి
కడుపు రగిలి
బిరబిరా కదంతొక్కుతూ
జరజరా పిడికిలి బిగించి
రోడెక్కుతున్న రైతన్నలు!

నాగలి పట్టిన చేతులు
శ్రేయ శంఖారావాన్ని పూరిస్తూ
సమిధికోత్సాహంతో
ఉక్కు పిడికిళ్లై బిగిస్తున్నాయి!
దిక్కులు పిక్కటిల్లే
నినాదాల హోరుతూ
గళమెత్తిన కంఠాలు
గిట్టుబాటు ధరలకై
గర్జిస్తున్నాయ్‌!
‌నేల నాలుగు చెరగులా
దూసుకొస్తున్న రైతాగ్రహ వెల్లువలు
ఏలికలకు ముచ్చెమటలు పోయిస్తూ
రేపటి రైతు భవితవ్యం కోసం
సంక్షేమ సంస్కరణల
సుప్రభాత ఉషస్సు వైపు
ప్రతిన పూనిన పాదద్వయ
నిరసనల ప్రవాహంతో
అడుగులు ముందుకేస్తున్నాయి!

–  వంగర. పరమేశ్వర రావు
హైదరాబాద్‌-38
9491400534

Leave a Reply