Take a fresh look at your lifestyle.

ఎయిడ్స్‌పై అవగాహనతో 90 శాతం మరణాలు తగ్గాయి

  • వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు
  • డిమాండ్లు తీర్చాలని టీ శాక్స్ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం తగదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన పెరగడం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయని చెప్పారు. బుధవారం ఎర్రగడ్డ చెస్ట్ ‌హాస్పిటల్‌లో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ ‌దినోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ ‌శాతం 0.7 శాతంగా ఉండేదనీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరోధక చర్యల కారణంగా 0.4 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ప్రభుత్వం 167 ఐసీటీసీ కేంద్రాలు నెలకొల్పడం జరిగిందనీ, 22 ప్రభుత్వ ఏఆర్‌టి చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎయిడ్స్ ‌రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తున్నదనీ, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు నెలకు ఆసరా పెన్షన్‌ అం‌దిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఎయిడ్స్, ‌షుగర్‌ ‌వ్యాధిగ్రస్తలకు  ప్రత్యేక డయాలసిస్‌ ‌కేంద్రాలు హైదరాబాద్‌, ‌వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎయిడ్స్ ‌కంట్రోల్‌, ‌చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదనీ, హై రిస్క్ ‌గ్రూప్‌ ‌వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఎయిడ్స్‌పై పోరాటంలో స్వచ్చంద సంస్థల పాత్ర కీలకమైనదనీ, ప్రభుత్వం, ఎన్జీవోలు కలసి ఎయిడ్స్‌ను పారదోలాలన్నారు. చెస్ట్ ‌హాస్పిటల్‌ ‌పరిసరాల్లో, హైదరాబాద్‌ ‌నలువైపులా నిర్మించే నాలుగు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌సేవలు అందించాలన్నది సీఎం కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. టీబీ వార్డులలో తిరిగి వైద్యులు, రోగులతో మాట్లాడిన మంత్రి హరీశ్‌ ‌రావు పేషెంట్లకు అందుతున్న వైద్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

డిమాండ్లు తీర్చాలని టీ శాక్స్ ఉద్యోగుల ధర్నా
కాగా, చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని టీ శాక్స్ ఉద్యోగుల జేఏసి ఆధ్వార్యంలో ధర్నా నిర్వహించారు. 2012 నుంచి ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు చేయడం లేదనీ, అలాగే, హెచ్‌ఐవితో పాటు కోవిడ్‌, ‌టి డయాగ్నస్టిక్స్, ‌ప్రెగ్నెస్సీ టెస్టులు చేస్తున్నామనీ, ఇందుకోసం 30 శాతం ఇంటెన్సివ్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి పంపించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వడం లేదనీ, పే రివిజన్‌ ‌కోసం కమిటీ వేయాలని కోరినప్పటికీ ఎలాంటి ప్రతిస్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply