Take a fresh look at your lifestyle.

కరోనా కట్టడిలో అవగాహన ముఖ్యం, భయం కాదు…

“కరోనా వైరస్‌ ‌పట్ల అవగాహన కన్నా ప్రజల్లో అనవసర భయాందోళనలు, అపోహలు, మూర్ఖత్వం చోటుచేసుకోవటంలో ప్రభుత్వం దగ్గరనుంచీ, సమాజంలోని పలు సమూహాలు దోహదపడ్డాయనటానికి  ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ప్రజలందరి విషయమైనప్పుడు అందులో మత పరమైన బేదాభిప్రాయాలను చొప్పించడమే కాకుండా అవి వైరస్‌ ‌కన్నా వేగంగా పాకిపోయేలా కథనాలు వెలువడ్డాయి. మీడియా కూడా దీనిలో దుర్మార్గమైన పాత్ర పోషించింది. ప్రపంచమంతా ఈ కరోనా జబ్బుతో బాధ పడుతుంటే మనదేశానికి వచ్చేసరికి దానికి కులం, మతం కూడా అంటుకున్నాయి. అంటరానితనాన్ని ప్రేరేపించే బ్రాహ్మణత్వాన్ని ఇప్పుడు ప్రపంచం గొప్పగా కీర్తిస్తోందంటూ కాలం చెల్లిన నేరపూరిత వాఖ్యానాలు  మొదలెట్టారు కొంతమంది.”

k sajayaకరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో భాగంగా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రారంభమయ్యి ఇప్పటికీ నెలన్నర. భద్రమైన సంపాదన, ఇళ్లున్న వారందరూ ముక్కుతూ మూలుగూతూ ఇళ్లల్లోనే వుంటూ దేశానికి చాలా సేవ చేసేస్తున్నామనే భ్రమలో ప్రభుత్వాల నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తూ, బయట కనిపిస్తున్న వారి మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే, నెలన్నర తర్వాత కూడా పేద ప్రజలు పిల్లాపా పలను సంకనేసుకుని, వున్న కొద్దిపాటి సామాన్ని నెత్తిమీద పెట్టుకుని పగిలి పుళ్లు పడి రక్తాలు కారుతున్న కాళ్ళతో వందల మైళ్ల దూరంలో వున్న స్వంత ఊర్లకు వెళుతున్నారంటే అర్థం ఈ ఘనత వహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయనే! కానీ, దీని గురించి ఈ భద్రజీవులెవరూ మాట్లాడరు! ‘పన్నెండు కిలోల బియ్యం ఇచ్చాం, ఐదు వందల రూపాయలు ఇచ్చాం ఇంకేం కావాలి! ఇన్ని వేలమందికి రవాణా ఏర్పాటు చేయటం అంటే ఎంత కష్టం, వేరే దేశాల్లో చిక్కుకున్నవాళ్ళు తక్కువమంది కాబట్టి తీసుకురావటం సాధ్యం అయింది, దానికి దీనికి పోల్చకూడదు’ అనే ప్రభుత్వ ‘జ్ఞానులు’ చాలామంది ఎదురవుతున్నారు. పోనీ, వెళ్ళకుండా ఇక్కడే వున్నవాళ్ళకు తిండీ తిప్పలు సరిగ్గా అందేట్టు ఏర్పాటు చేశారా అంటే, అర్థం పర్థం లేని నిబంధనలు రోజుకొకటి మారుస్తూ సకల ఇబ్బందులకూ గురిచేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం మొదటి విడత పదిహేను రోజుల బంద్‌ ‌ప్రకటించిన వెంటనే హైదరాబాద్లో ఖలీదా పర్వీన్‌, ‌షహనాజ్‌, ‌బిలాల్‌, ‌ఖాజిం హాష్మి, రిషివర్ధన్‌, అలీ భాయి, కీత్‌, ‌రాజేష్‌ అసావా వంటి ఎంతోమంది వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు కొన్నిచోట్ల ఆహారం తయారు చేసి, మరికొన్ని చోట్ల సరుకులు నిరాశ్రయులకు అందించడం మొదలుపెట్టారు. నిజానికి, ఈ స్వచ్చంద సంస్థలు తమంతట తాము ఇంత పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోకుంటే పరిస్థితి మరింత ఘోరంగా వుండేదనటంలో సందేహం లేదు. వాస్తవానికి, ఆహార పంపిణీలో కొన్నిసార్లు ప్రజలు తిండి దొరకదేమో అనే అభద్రతతో భౌతిక దూరం పాటించక పోవచ్చు. కొన్ని గందరగోళాలు జరిగి వుండొచ్చు. దానికి తప్పు పట్టవలసింది ప్రజలని కాదు. పరిస్థితులను సరిగా అంచనా వేయని ప్రభుత్వాలనే.

కానీ, అవేవీ కూడా స్వచ్ఛంద సంస్థల వల్ల జరిగినవి కాదు. రాజకీయ నాయకులు పాల్గొన్న వాటితోనే ఈ సమస్యలన్నీ. అయితే, ఇప్పుడేమి జరిగింది. ఆహార పంపిణీని ఒక క్రమ పద్ధతిలో పెడుతున్నాం అనే పేరు మీద వండిన ఆహారమైనా, రేషన్‌ అయినా గానీ హైదరాబాద్‌లో జిహెచ్‌ఎం‌సి వారికే అందజేయాలన్న రూల్‌ ‌పెట్టడంతో స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేయాలనుకున్న ఎంతోమంది మానవతావాదులు ఆగిపోయారు. పైగా, అధికారులు వచ్చి ఈ ఆహారాన్ని తీసుకెళ్ళరు, ఈ బృందాలే తీసుకెళ్లి ఎంతో దూరంలో వున్న ఆఫీసుల్లో అందజేయాలి. అధికారులూ, ప్రజా ప్రతినిధులూ అర్థమవుతోందా, ఎంత అసంబద్ధమైన నిబంధనను మీరు ముందుకు తీసుకు వచ్చారో! ఆహార పంపిణీ చేసేవారికి పాస్‌ ‌తప్పనిసరిగా వుండటం అనేది అందరూ అంగీకరిస్తున్నదే! కానీ, దీనిని ఎవరు జారీ చేయాలి? ఈ విషయంలో పోలీస్‌ ‌డిపార్టుమెంటుకి, జిహెచ్‌ఎం‌సికి మధ్య ఏకీకృత అభిప్రాయం లేదనేది వాస్తవంలో నిరూపణ అయింది. ఆహార పంపిణీలో ప్రజల సహకారాన్ని ఆగిపోయేటట్లు చేసిన ఘనతను మూటగట్టుకున్నారు. ఫలితం, ఆకలితో వున్న అనేకమందికి తిండి అందటం లేదు. మరి, ‘తెలంగాణాలో ఎవరూ ఆకలితో ఉండొద్దు’ అని ముఖ్యమంత్రి గారి ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా వుంది కదా! ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు, ‘ససేమిరా మా ఊళ్లకు పంపించేయండి’ అని అడుగుతున్న వలస కూలీల పరిస్థితుల దగ్గరకు వద్దాం. ఇతర రాష్ట్రాల నుంచీ పనుల కోసం వచ్చి చిక్కుకు పోయిన కూలీలందరూ అడుగుతున్నది ఒక్కటే! తమ స్వంత రాష్ట్రాలకు పంపించివేయమనే! ఈ కోరిక అంత అసాధ్యమైనదా? ప్రభుత్వాలు తలచుకుంటే అసాధ్యమా? ఇంక లాక్‌ ‌డౌన్‌ ‌ప్రయోజనమేముంది అని వాదన ముందుకు వస్తోంది! మనుషులు సంఘజీవులు. మరీముఖ్యంగా కష్టకాలంలో కలో గంజైనా తాగి తన అనుకున్న వాళ్ళతోనే వుండాలనుకుంటారు! ఉపాధి కోసం పరాయి వూరు, అర్థం కాని భాష, సరైన గూడు లేకపోయినా కానీ, రెక్కల కష్టంతో తమ కుటుంబం కోసం, పిల్లల కోసం అన్ని రకాల పరిస్థితులను భరించుకుంటారు. తమకు వీలైనప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతాము అనే ఒకే ఒక్క భరోసా అన్ని కష్టాలను వోర్చుకునేలా చేస్తుంది. కానీ, ఇప్పుడు ఆ భరోసా లేదు. మనస్థిమితంగా ఉండలేక పోతున్నారు. ఏ పనీ లేకుండా రోజుల తరబడి గడపటం ఒక సమస్య అయితే, ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబాలు ఏం సమస్యలను ఎదుర్కొంటున్నాయో తెలియని భయం. ఒక్కొక్క మనిషిది ఒక్కో కథ. అన్నిటికీ విలువుంటుందనే ఆలోచన వుంటే, ‘ఇది ప్రభుత్వాలకి సాధ్యం కాదు’ అని చెప్పే వాదనలో ఎంత డొల్లతనముందో అర్థమవుతుంది.

- Advertisement -

వలస కార్మికులను పంపించే విషయంలో కేంద్రం చొరవ, బాధ్యత తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు అనటం, కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అని కేంద్ర ప్రభుత్వం..మొత్తానికి అందరూ కలిపి మాకు వలస కార్మికులు ముఖ్యమైన వ్యక్తులు కాదు అని తేల్చేశారు. ‘ఇన్ని రోజులున్నారు, ఇంకొద్ది రోజులుండలేరా, బాధ్యత లేకపోతే ఎట్లా అండీ అని ప్రకటనలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలకేం కొదవ లేదు. ఒక పారిశ్రామిక వాడలో చిక్కుకుపోయిన కొన్ని వందలమంది వలస కార్మికుల గురించి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి(ఆయన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతం) ఫోన్‌ ‌చేసి, వారికేమైనా సహాయం చేయండి అంటే, ‘అది నా నియోజకవర్గం కాదు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు చేయండి’ అని మరోమాట కూడా లేకుండా ఫోన్‌ ‌కట్‌ ‌చేశారు. ఇలా వుంటాయి కొంతమంది ప్రతిస్పందనలు. ఇది చదివిన వెంటనే ఏమన్నా గుర్తుకు వచ్చిందా?(బాధితులు పోలీసు స్టేషన్‌కి వెళితే ఈ ఏరియా మా పరిధిలోకి రాదు, వేరే స్టేషన్‌కి వెళ్ళండి అని అన్నారు కదా!) ఒక అత్యవసర పరిస్థితి నడుస్తున్నప్పుడు, కనీసంగా సమాచారం తీసుకోవడం, తన పరిధిలోకి రాని ప్రాంతమైనప్పటికీ సాయపడటానికి చొరవ చూపించడం అంత కష్టమైన పనా? పైగా, ఆ ప్రాంత ఎమ్మెల్యే కూడా వాళ్ల పార్టీ ప్రతినిధే! కానీ, ఎవరిమధ్య సమన్వయం వుండదు. కానీ, అసలు విషయమేమంటే, లాక్‌ ‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూలీలు అందుబాటులో లేకపోతే నిర్మాణ పనులెలా సాగుతాయి, అందుకే వారిని పోనీయకుండా కట్టడి చేయడం. దానికి, కరోనా జబ్బు పేరుతో గంభీరమైన ప్రవచనాలను వల్లించడం. ఇది అత్యంత దుర్మార్గమైన స్వభావం. ఈ కరోనా ప్రమాదంలో స్వంత వూరికి వెళ్ళిపోవాలని కోరుకున్న వలస కార్మికుల ఆకాంక్షలను పట్టించుకోకపోగా, వారిని ఆకలి దప్పులకు గురిచేసి, బిచ్చగాళ్ళుగా మార్చిన ఫలితం ఒక అశాంతి రూపంలో రాజుకుంటోంది. ఆగిపోయిన పనులు చేయండి అని ముందుకు వస్తున్న నిర్మాణ సంస్థలకు తెగేసి చెబుతున్నారు, ‘పనిచెయ్యం, వూర్లు వెళ్లి పోతాము’ అని. భద్రజీవులు ఎంత భద్రంగా తమ కుటుంబ సభ్యులతో మనశ్శాంతిగా బతుకుతున్నారో ఈ దేశంలో పౌరులందరికీ అదేవిధమైన హక్కు వుంటుంది. ఆ హక్కుని అమలు చేయాల్సిన బాధ్యత నిర్ద్వందంగా ప్రభుత్వాలదే. మరో ముచ్చటే లేదు.

ఇంకో ముఖ్యమైన అంశమేమంటే, ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీలో తీసుకోవాల్సిన అంశాలు, జాగ్రతలు. కరోనా వైరస్‌ ‌పట్ల అవగాహన కన్నా ప్రజల్లో అనవసర భయాందోళనలు, అపోహలు, మూర్ఖత్వం చోటుచేసుకోవటంలో ప్రభుత్వం దగ్గర నుంచీ, సమాజంలోని పలు సమూహాలు దోహదపడ్డాయనటానికి ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ప్రజలందరి విషయమైనప్పుడు అందులో మత పరమైన బేదాభిప్రాయాలను చొప్పించడమే కాకుండా అవి వైరస్‌ ‌కన్నా వేగంగా పాకిపోయేలా కథనాలు వెలువడ్డాయి. మీడియా కూడా దీనిలో దుర్మార్గమైన పాత్ర పోషించింది. ప్రపంచమంతా ఈ కరోనా జబ్బుతో బాధ పడుతుంటే మనదేశానికి వచ్చేసరికి దానికి కులం, మతం కూడా అంటుకున్నాయి. అంటరానితనాన్ని ప్రేరేపించే బ్రాహ్మణత్వాన్ని ఇప్పుడు ప్రపంచం గొప్పగా కీర్తిస్తోందంటూ కాలం చెల్లిన నేరపూరిత వాఖ్యానాలు మొదలెట్టారు కొంతమంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘పాండమిక్‌’ (‌ప్రతి ఒక్కరికీ వొచ్చే అవకాశం వున్న జబ్బు)అనటంతో దీనికి ‘మహమ్మారి’ అని నామకరణం చేసేశారు. ఇంకేముంది, అలవోకగా మన కవులు కళాకారులూ మరింత ముందుకువెళ్ళి దానికి జెండర్ని కూడా అంటగట్టి అవమానకరంగా రాసేశారు. ఇందంతా భావజాల పరమైన అంశమైతే, కరోనా వైరస్‌ ‌సోకి పాజిటివ్‌గా వున్న వ్యక్తులను ప్రభుత్వమే నేరస్తులుగా చూడటం అత్యంత అభ్యంతరకరమైన విషయం. యథారాజ తథా ప్రజ అన్నట్లు, వైద్య సిబ్బందిని కూడా కొంతమంది అవమానిస్తున్నారు. చనిపోయినవారి అంత్యక్రియలను కూడా అడ్డుకోవటం బాధాకరం. తమిళనాడులో డాక్టర్‌ ‌సైమన్‌ ‌హేర్కులస్‌ ‌కరోనా బాధితులకు చికిత్స చేస్తూ తానూ ఆ వైరస్‌ ‌బారినపడి చనిపోతే ఆయన అంత్యక్రియలను కూడా అడ్డుకునేలా చేసిన మూర్ఖత్వాన్ని క్షమించగలమా? అనారోగ్య విషయాలలో ఇది మంచి జబ్బు , ఇది చెడు జబ్బు అని ప్రత్యేకంగా వుండవు. అవి వ్యాప్తి చెందే విధానాలే వేరుగా వుంటాయి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటమే మార్గం. జబ్బు బారినపడిన అందరికీ సరైన వైద్యం అందించడం, మానసికంగా కుంగుబాటులోకి వెళ్ళకుండా సత్వరం కోలుకునేలా వ్యవస్థలను బలోపేతం చేయాలి. అవును, ఈ పరిస్థితి ప్రభుత్వాలకే కాదు, ప్రజలకు కూడా పూర్తిగా కొత్త అంశమే. అపోహలను పోగొట్టేలా ప్రభుత్వాల విధివిధానాలు వుండాలి. అది వారి బాధ్యత కూడా. ప్రజల్లో ఇంకా నెలకొనివున్న అపోహలను తొలగించటానికి అనేక ప్రయత్నాలను చేయాలి. కరోనా వైరస్‌ ‌సోకితే అవమానపడే పరిస్థితులను సృష్టించి, ఇప్పుడు ప్రజలకు బాధ్యత లేదా అని ప్రశ్నించడం వల్ల ప్రయోజనం ఏమాత్రం వుండదు. జబ్బు నుంచీ కోలుకుంటున్న వ్యక్తుల అనుభవాలను మీడియా ద్వారా ప్రజలకు అందించడం ద్వారా, అపోహలు తొలగి ప్రజలే స్వచ్ఛందంగా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి ముందుకు వస్తారు. నిర్బంధం ద్వారా కొద్దికాలం కట్టడి చేయగలుగుతారేమో గానీ, అవగాహన మాత్రం రాదు. భయం మాత్రమే వుంటుంది. ఈ విషయం అర్థమయితే, కరోనా మీద యుద్ధం ప్రజల భాగస్వామ్యంతో స్ఫూర్తిదాయకంగా వుంటుంది.

Leave a Reply