Take a fresh look at your lifestyle.

కరోనాపై నదిలా పారిన పాట

“ఇక్కడ పాట పనితోమమేకమై మౌఖికంగా ఒకరినుండి మరొకరికి అశువుగా పాడుకున్న పాటలెన్నో వేలయేండ్ల పాటు మనుగడలో ఉన్నాయి. ఈ నేలమీద పుట్టినా పాటనే, సచ్చినా పాటనే, కార్యం ఏదైనా పాటనే ఇక్కడి నాగరికతకు నీడనిచ్చే పట్టుకొమ్మ. పాటకున్న నేపథ్యం అలాంటిది. పాటకున్న బలం బలగం కూడా అలా పెనవేసుకున్న అల్లికల  వారసత్వం నుండి వచ్చిందనవచ్చు. కరోనా వ్యాధి ప్రపంచమంతటిని వణికిస్తున్న విపత్కర సమయంలో ప్రజలను కంటికిరెప్పల కాపాడుకోవాలనే ఉద్దేశ్యంలో నుండే వందల పాటల ప్రవాహం ముంగారిన యేరుపారినట్లు వచ్చాయి.”

ఈ తెలంగాణ మట్టిమీద ఎక్కడ కాలుమోపినా పాట ఊటసెలిమెలా జలజల పారుతుంది. సందర్భం ఏదైనా పాట ప్రజల భుజాలమీద ఊరేగడం ఇక్కడి నేల వారసత్వం. తూటా శరీరాన్ని మాత్రం ఛిద్రం చేయగలదు. పాట దేహమంత ఆవహించగలదనేది నగ్నసత్య వాక్యం. ఇక్కడ పాట పనితోమమేకమై మౌఖికంగా ఒకరినుండి మరొకరికి అశువుగా పాడుకున్న పాటలెన్నో వేలయేండ్ల పాటు మనుగడలో ఉన్నాయి. ఈ నేలమీద పుట్టినా పాటనే, సచ్చినా పాటనే, కార్యం ఏదైనా పాటనే ఇక్కడి నాగరికతకు నీడనిచ్చే పట్టుకొమ్మ. పాటకున్న నేపథ్యం అలాంటిది. పాటకున్న బలం బలగం కూడా అలా పెనవేసుకున్న అల్లికల వారసత్వం నుండి వచ్చిందనవచ్చు. కరోనా వ్యాధి ప్రపంచమంతటిని వణికిస్తున్న విపత్కర సమయంలో ప్రజలను కంటికిరెప్పల కాపాడుకోవాలనే ఉద్దేశ్యంలో నుండే వందల పాటల ప్రవాహం ముంగారిన యేరుపారినట్లు వచ్చాయి.

gorati venkanna

కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రాసిన పాటలన్ని ఇంకే ప్రాంతంలో రాయలేదనేది ఒక వాస్తవిక దృశ్యం. ఇక్కడ చరిత్రలోనే పెనవేసుకున్న బంధం ఒకటుంది. అదేమిటంటే ఎలుగెత్తి చాటడం, ప్రశ్నించడం, చైతన్య బాటలో నడవడం, నడిపించడం మనకు చరిత్రపు పుటలను తిరగేస్తే ఇట్టే అవగతమవుతుంది.
పాతకవులు, కొత్త కవులు ఎందరో కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో నిమగ్నమైన కవులు ఉధృతంగా పాట, కవిత్వం, వ్యాసం ఇంకా వివిధ పక్రియల ద్వారా చైతన్య సాహిత్యం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు సిగమూగే సాహిత్యం రాసిన కవులు ప్రతీ సందర్భంలో అదేతీరైనా కవిత్వం, అదే కవులు రాస్తారనీ భ్రమపడటం అవిజ్ఞానమే అవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తొట్టతొలిగా సింధురం రమేష్‌ ఎక్కడిది పాడురోగం/మనుష్యుల్ని వణికిస్తుందిరా అంటూ కరోనా పాట అందించి అందరి కవిగాయకుల్ని తట్టిలేపాడు, ఆ తర్వాత ఎందరో వరుసకట్టారు పాటలబాటవైపు.

కరోనా పాటల్లో అత్యధికంగా జనాల్ని ఆకట్టుకున్న పాటల్లో మాట్లా తిరుపతి రాసిన మందులేని రోగమో/ఇది మంది ఎంట పడ్డదో అనే పాటలో కరోనా విజృంభణను కూలీల బాధల్ని గోసల్ని వివరించాడు. ఆ తర్వాత ప్రజల నాల్కలపై పాటైమోగిన పాట ఆదేశ్‌ ‌రవి రాసిన ‘ఇడిసిపెడితే నడిసి మేము పోతాము..’ అంటూ వలస కార్మికుల గాథల్ని ప్రజలు మాట్లాడుకునే మాండలీకంలో రాసి అత్యధికంగా ప్రజాదరణ పొందిన కరోనా వలస కార్మికుల స్థానాన్ని సొంతం చేసుకుంది/అరుణోదయ మిత్ర రాసి విమలక్క గొంతులో జాలువారిన ‘వద్దు కరోనా జల్ది మరోనా..’ అంటూ సాగిన పాట మారుమోగింది/కాసర్ల శ్యామ్‌ ‌మంగ్లీ ‘పైసబోతే..’ పాట ఎంతో ఆకట్టుకుంది/రామ్‌ ‌గోపాల్‌ ‌వర్మ పురుగు పాట కొత్తబాణీలో వచ్చిన కొత్తరకంపాట/చౌరస్తా బ్యాండ్‌ ‌నుండి వచ్చిన ‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా..’ పాట యువతకు చేరువై వైరల్‌గా మారిన పాటగా అతితక్కువ కాలంలోనే గుర్తింపు పొందింది.

గోరటి వెంకన్న ‘వినకపోతివి కదరా..’ అంటూ సమాజానికి తత్వం బోధపడే విధంగా రాసుకొచ్చాడు/జయరాజు ‘ప్రకృతికి ప్రణమిల్లే తరుణం..’అంటూ చెట్టుపుట్టలను గుర్తుచేశారు/మిట్టపల్లి సురేందర్‌ ‘‌కరోనా నుండి బయటపడితే బతికిబట్టకడితే..’ అంటూ చైనాకు మరోపేరు కరోనా చైనా వస్తువులను కొనవద్దని కొంచం గట్టిగానే హెచ్చరించాడు/చరణ్‌ అర్జున్‌ ‘ఉం‌డలేవా నువ్వు ఇంట్ల..’/అభినయ శ్రీనివాస్‌ ‘‌చేయి చేయి కలిపి నడవని వినూత్న పోరాటం..’/పసునూరి ‘అమాస ఎల్లిపోయి పున్నమొచ్చినట్టు..’/గోరటి రమేష్‌ ‌జర్నలిస్టుల గోస/అవనిశ్రీ ‘సూదిమందులేని ఓ మాయరోగమా..’/అమ్మపాట తిరుపతి ‘కనివిని ఎరుగని కల్లోలం..’, నాగమల్లు ఒగ్గు కథ ద్వారా చైతన్యం/రెంజర్ల రాజేష్‌ ‘అబ్బో కరోనా..’/మేడికొండ ప్రసాద్‌ ‘‌భయపడుతున్నాడురా ..’ పాటలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి.

జనాలను చైతన్యం చేయాలనే విజ్ఞతతో రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చినా ప్రజల వైపు నిలబడే మరెందరో కవులు కూడా ఉన్నారు. వారిలో కాకం అంజన్న ముందువరసలో ఉంటాడనీ చెప్పవచ్చు. ‘ఎక్కడ అల్లా ఎక్కడ ఏసు..’ పాటతో నాస్తికవాదనను బలంగా వినిపించాడు. యోచన కొత్తవరవడిలో ‘కత్తిపట్టకుండనే నెత్తురంటకుండనే కుత్తుకలు కోసే యుద్దమొచ్చెరా..’ అంటాడు/కందికొండ ‘తెలంగాణ నేలమీద వేసేయ్‌ ఒట్టు..’/నిసార్‌ ‘‌కరోనా కరోనా నీతో యుద్ధం..’/మచ్చ దేవేందర్‌ ‘ఇం‌టిల్లిపాదితోటి ఇంట్లోనే ఉండరా..’/రాచకొండ రంగన్న ‘అమ్మా మన్నించమ్మా..’/సుక్క రాం నర్సయ్య ‘కూలీనాలి పేదోల్లం..’/దరువు అంజన్న వందనం పాట.. ఇలా ఒక్కొక్కరి పాట ఎనక ముందు అనే తేడా లేకుండా కరోనాను తరిమికొట్టడంలో జనాలను జాగృత పరుస్తున్నాయి. ఇలా పాటల ఊటల ప్రవాహం తెలంగాణగడ్డ మీద ఏ సందర్భమైన కొనసాగాలి. కానీ కొన్నిసార్లు అంటే ఆర్‌టిసీ ఉద్యమం, నల్లమల యురేనియం ఉద్యమాలకు ఇంత పెద్ద ఎత్తున పాటలు ఎందుకు కవులు రాయలేదో మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగానే మిగిలివుంది.

jayaraju

ఈ కరోనా భూతాన్ని తరిమి కొట్టడంలో ఇంకా చాలామంది వన్నెతగ్గని పాటలు రాసే కవులు లేకపోలేదు, బోడ చందప్రకాష్‌, ‌నెల్లుట్లసుమన్‌, ‌సునీల్‌, ‌సారాంగపాణి, సైదులు, స్ఫూర్తి, బైరాగి, దరువు ఎల్లన్న, నాగిళ్ల కొండల్‌, ‌శేఖర్‌ ‌పగిళ్ల, పయిలం సంతోష్‌, ‌సదానందం, రమణ, తులసి, రాజేష్‌, ‌సుభాషిణి, మనసుపాట మహేష్‌, ‌చీర్ల శ్రీనివాస్‌, ‌కల్వకోల్‌ ‌మద్దిలేటి, పాము నాగులు, మహ్మద్‌ ‌రాహుల్‌ ‌లాంటి అనేక మంది కవులు రచయితలు గాయకులు నిర్విరామ కృషి చేస్తున్నారు. పైన ప్రస్థావించిన కవులతోపాటు ఇంకా బలమైన సాహిత్యం రాసే కవులు కూడా ఉండొచ్చు. వారిపేర్లు నా దృష్టికి రాలేనందుకు రాయలేదు అన్యధా భావించకండి. ఇందులో ప్రజాదరణ పొందిన రచనలు మాత్రమే తీసుకోవడం జరిగింది. స్థలాభావం కారణంగా కొందరిని ప్రస్తావించలేకపోతున్నాను. అర్థంచేసుకోగలరు. ఈ ఆపతికాలంలో కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఎన్నో పాటలు రాసిపాడిన కవిగాయకులకు నా పాదాభివందనం. ప్రతీ సందర్భంలో కూడా పాటలు రాయాలనీ రాస్తారనీ ఆశిస్తూ….

Leave a Reply