Take a fresh look at your lifestyle.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

టెలీకాన్ఫురెన్స్‌లో అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ అనుదీప్‌

‌భద్రాచలం,జూలై 24  (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి శనివారం ఉదయం 7.45 గంటలకు 43 అడుగులు దాటినందున మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 5.40 గంటలకు 48 అడుగులు దాటినందున రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, లోతట్టు గ్రామాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌తెలిపారు. శనివారం భద్రాచలం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా, మండల అధికారులతో వరద సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు, వైద్య సేవలు తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణిలను గుర్తించి తక్షణమే ఆసుపత్రులకు తరలించాలని, వరదలు వల్ల తరలించడానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ముంద స్తుగానే ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య సేవలు అందించాలని చెప్పారు.

చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో 27 మంది గర్బిణిలను గుర్తించి ముందస్తు చికిత్సలు నిమిత్తం ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. వాగులు పొంగి రహదారి సౌకర్యం నిలిచిపోయే గ్రామాల్లో పునరావాస కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కోవిడ్‌, ‌మలేరియా పరీక్ష కిట్లుతో పాటు అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు ఆర్‌ఎస్కే, 108 వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొత్తగూడెం తెలంగాణ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది శుక్రవారం రాత్రి విధులకు హాజరుకానట్లు గమనించిన కలెక్టర్‌ అత్యవసర సమయాల్లో విధులకు హాజరు కాకపోతే ఎలా అని సిబ్బందికి షోకాజ్‌ ‌నోటీసు జారీ చేయాలని, విధులు నిర్వహణలో అలసత్వం వహిస్తే విధుల నుండి తొలగించు విధంగా కఠిన చర్యలు తీసుకో వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశిం చారు. వరదల వల్ల ఏర్పడిన సమ స్యలు, ఇబ్బందులను పరిష్కరిం చేందుకు కలెక్టరేట్‌ ‌నందు ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్‌ ‌రూమును డిఆర్డీ అశోక్‌ ‌చక్రవర్తి, భద్రాచలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ ‌రూము 08743-232444ను అదనపు కలెక్టర్‌ ‌పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 9392919743 వాట్సాప్‌ ‌నెంబరుకు వచ్చిన ఫోటోలు ఆధారంగా తక్షణం పరిష్కరించు విధంగా చర్యలు తీసుకుని తనకు నివేదిక అందచేయాలని చెప్పారు.  అత్యవసర సేవలకు నాటు, మర పడవులను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply