Take a fresh look at your lifestyle.

‘‌రాజు(తనం)’ చావాలి

హమ్మయ్య ఎలాగైతేనేం
‘రాజు ‘ చచ్చాడు ….
చచ్చాడో… చంపబడ్డాడో
అంతు దొరకని ఆత్మహత్యో
హత్యలాంటి ఆత్మహత్యో
ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోయే
జనాలు మాత్రం సరైన
శిక్షే పడిందని చల్లబడ్డారు

అభం శుభం ఎరుగని ఆరేళ్ల చైత్ర
మత్తుకు బానిసై దారితప్పిన
మానవ మృగమైన వాడి
పైశాచికతకు అన్యాయంగా
బలైన ఘోర సంఘటనకు
ఉవ్వెత్తున చలించింది సభ్యలోకం

పేదరికం కోరల్లో చిక్కి
ఎదిగే మనసుల్నిమలిన పరుస్తూ
చదువుకు దూరమై విచక్షణ
మృగ్యమై సమాజానికి పనికిరాని
పోకిరి యువతకు అడుగడుగునా
అందుబాటులో దొరికే
గుట్కాలు, డ్రగ్స్, ‌మద్యం మత్తు
పానీయాలు వికృతుల్ని చేస్తుంటే
తోడుగా చేతిలోని సెల్‌ ‌మీట
నొక్కగానే కుప్పలుగా కురుస్తూ
కనిపించే బూతు చిత్రాలకు
ఉక్కిరిబిక్కిరైన మెదళ్ళకు మంచి,
మానవత్వం గుర్తుంటుందా ?

పసికందైనా పండు ముసలైనా
ఆడతనాన్ని దర్శించే
కామ కామెర్ల రోగులు చేసే
పైశాచికత్వానికి హద్దులుంటాయా?

ఒక ‘ రాజు ‘ చనిపోతే
‘రాజు పైశాచికత‘ మరో రాజుగా
అవతరిస్తుందనేది వాస్తవం
అంతంకావాల్సింది ‘రాజులు’ కాదు
‘రాజులను’ పుట్టిస్తున్న రాజరికపు
భ్రష్టు పట్టిన అమానుష పరిస్థితి

నిర్భయ చట్టాలెన్నున్నా
ఆగని ఈ కామ వికారాలకు
బలవుతున్న అభాగ్యులెందరో?
మొన్న ఓరుగల్లులో ఆమ్ల దాడులు
నిన్న ‘దిశ’ సంఘటనలనంతర
ఎన్‌కౌంటర్లు కూడా ఈ మారణ కాండను
ఆర్పలేని కార్చిచ్చే…
చంపాల్సింది దారి తప్పిన
రాజుల్ని కాదని రాజులాంటి
ఉన్మాదుల్ని సృష్టిస్తున్న పరిస్థితుల్ని
వాటిని పెంచి కాపుకాస్తున్న
విష సంసృతిని తెగనరి కేయాలి

రేపటి పసితనానికి
నేటి యువతరానికి
విషవాయ్నుల వాసనలు
సోకకుండా కాపుకాయాలి
జాతి మనుగడకు విలువల
దారుల్నిపరుస్తూ పహారా కాయాలి

– డా. కె. దివాకరా చారి
9391018972

Leave a Reply