Take a fresh look at your lifestyle.

‘‘‌బహుజనులకు రాజ్యాధికారం ఫలించేనా….??’’

(ఆగష్టు 18నసర్దార్‌ ‌సర్వాయి పాపన్న జయంతి సందర్భంగ)
బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన, సమానత్వం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. భారత రాజ్యాంగం కల్పించి నటువంటి ప్రత్యేక సౌకర్యాలను, రాయితీలను మరియు రిజర్వేషన్లను సక్రమంగా అమలు పరచి, ఆ ఫలాలను అందించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సమాజంలో అత్యధిక భాగం బహు జనులు అయినప్పటికీ, పిడికెడుమంది ఆధిపత్య కులాల వారు రాజ్యాధికారం కలిగి ఉండటంతో, బహుజనుల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేస్తూ, బహుజనులకు దక్కవలసిన హక్కులు దక్కనీ యడం లేదని, భారత రాజకీయ చరిత్రలో అనేక మంది బహుజన సామాజిక ఉద్యమ కారులు, విప్లవకారులు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయ్‌ ‌పూలే, నారాయణగురు, పెరియార్‌ ‌రామస్వామి లాంటివారు ఎందరో బహుజన ఉద్ధరణ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. పదహారో శతాబ్దంలోనే రాచరికపు అన్యాయాలను సహిం చలేక, మొగలాయి సామ్రాజ్యవాద విస్తరణకు అడ్డుపడి సామాజిక న్యాయం కోసం దళిత బహుజనులను ఏకతాటిపైకి తెచ్చి 12 మంది బహుజన సైనికులతో మొదలై 12 వేల మంది సైన్యం తయారుచేసుకుని గోల్కొండ కిల్లా పై బహుజనుల జెండాను ఎగరవేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న బహుజన సామాజిక విప్లవకారుడు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ 371‌వ జయంతి నేడు. ఈ మధ్యకాలంలో రాజ్యాధికారం కోసం బహుజనులు కొత్తతరం రాజకీయాలకు తెర లేపుతున్న సందర్భం ప్రారంభమైంది. ఈ సంద ర్భంలో సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టి ఒక్కడుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేసి గోల్కొండ రాజ్యాన్ని చేజిక్కించుకున్న సర్వాయి పాపన్న నుండి పొందవలసిన స్ఫూర్తి, ఆయన రగిలించిన ఆశయాలను సాకారం చేసుకోవడానికి మరుగున పడిన, ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి బహుజనులకు అవసరం…..

ధూల్‌ ‌మిట్ట శాసనం ప్రకారం సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషపురం గ్రామంలో సాధారణ గౌడ కుటు ంబంలో ధర్మన్నగౌడ్‌, ‌సర్వమ్మ లకు ఆగస్టు 18, 1650 నాడు జన్మించాడు . చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతోతల్లి సర్వమ్మ అల్లారు ముద్దుగా గారాబంగా పాపన్నను పెంచి పెద్ద చేసింది. ఆమె కోరిక మేరకు కులవృత్తి అయిన గౌడ వృత్తిని చేపట్టి తాటి చెట్లు ఎక్కి కుటుంబ పోషణకు సహాయపడుతూ పశువుల కాపరిగా ఇతర కులాల వారితో తిరుగుతూ స్నేహితులతో ఉల్లాసంగా, సరదాగా ఆనందంగా కాలం గడిపే వాడు. ఆనాటి పాలకులు నిజాం రాజులు అనేక రకాల పన్నులు వసూలు చేస్తూ ప్రజలను బానిసలుగా చూస్తూ క్రూరంగా హింసిస్తూ కుల మతాల పేర్లతో శిస్తు వసూలు చేస్తుండేవారు. తాటి చెట్లకు కూడా పన్నులు వసూలు చేసేవారు. పన్నులు చెల్లించక పోయిన,ఎదురు మాట్లాడిన వారి ప్రాణాలను సైతం తీసేవారు.

సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ ‌కు స్నేహ భావంతో స్నేహితులు ఎక్కువగా ఆయన వెంట తిరుగుతూ ఉండేవారు. పాపన్న తో నిత్యం చాకలి సర్వన్న, మంగలి మాసన్న,కుమ్మరి గోవిందు,జక్కుల పెరుమాళ్లు, దూదేకులపీరు,కొత్వాల్‌ ‌మీరు సాహెబ్లు ప్రధాన అనుచరులుగా ఉండేవారు. వారంతా ఒక్కచోట చేరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను గురించి, నిజాం సైనికులు గ్రామాల వెంట తిరుగుతూ దౌర్జన్యాలకు, దారుణాలకు పాల్పడుతూ పన్నులు వసూలు చేసే విధానాన్ని గురించి, అమాయకపు ప్రజలను మోసం చేసే తీరుని గురించి చర్చించు కుంటూ ఉండేవారు. ఒక రోజు కల్లు మండువ దగ్గర తనస్నేహితునికి ,నిజాం సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక సైనికుడు పాపన్న స్నేహి తుల్ని కాలు ఎత్తి తన్నుట కు ప్రయత్నించడంతో కోపోద్రిక్తుడైన సర్వాయి పాపన్న తనవద్దనున్న కల్లు గీసే మారు కత్తితో సైనికుని మెడ నరికి చంపి వేస్తాడు. ఈ సంఘటనతో భయం తో మిగతా సైనికులు గుర్రాలను, వసూలు చేసిన డబ్బులను వదిలి పారిపోతారు.

వాటన్నింటినీ సర్వాయి పాపన్న అతని స్నేహితులు స్వాధీనం చేసుకొని తమ చుట్టూ ఉన్న గ్రామాలలోని పేదవారికి పంచడం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి నిజాం సైనికులపైతరచుగా దాడులు చేస్తూ పన్నుల రూపేణా వసూలు చేసిన డబ్బులు దోచి పేద ప్రజలకు అందిస్తూ, ఆ డబ్బుతోనే ఆయుధాలు ,గుర్రాలు సమకూర్చుకుంటారు. యుద్ధవిద్యలు కూడా నేర్చుకుంటాడు. గ్రామాల్లోని యువకులను చేరదీసి మూడు వేల మంది తో సొంత సైన్యాన్ని తయారు చేసు కోవడం జరిగింది. అప్పటి తెలం గాణలో నిజాం రాజు, సైనికులు,తాబేదార్లు, జమీందార్లు, జాగీర్దార్లు,దొరలు ,భూస్వాములు చేస్తున్న ఆగడాలను దురాగతాలను చూసిన పాపన్న వీటిని అడ్డుకోవాలంటే రాజ్యాధికారం తోనే సాధ్యమని మొఘల్‌ ‌సామ్రాజ్య వాదాన్ని ఎదిరించేందుకు బహుజనులు అందర్నీ ఏకతా టిపైకి తెచ్చి గెరిల్లా సైన్యాన్ని తయారుచేసుకుని క్రీస్తుశకం 1675లోసర్వాయిపేట లో రాజ్యస్థాపన చేసాడు.

ఆకాలంలో మరాఠాప్రాంతంలో ఔరంగజేబు ను చత్రపతి శివాజీ ఎదురుకుంటున్న సందర్భం…. పాపన్న కూడా ఔరంగజేబ్‌ ‌సైన్యంతో తలపడి తాటికొండ, వేములకొండ దుర్గాలను నిర్మించి, 12000సైన్యాన్ని కూడగట్టుకొని గోల్కొండ కోటను వశపరచుకొని ఏడు నెలలపాటు అధికారం చెలాయించి,పరిపాలన లో తనదైన ముద్ర వేశాడు. కార్మిక వర్గ సామాన్య కుటుంబం నుండి రాజ్యాధికారాన్ని చేపట్టిన పాపన్న ప్రజల కష్ట నష్టాలని అనుభవించిన వ్యక్తిగా ప్రజామోద యోగ్యమైన పనులను చేపట్టారు. ఆయన పరిపాలనలో పన్నులు లేవు. నీటి వసతి కి చెక్‌ ‌డ్యామ్‌లను నిర్మింపజేశాడు. ప్రజారం జకంగా పాలిస్తున్న క్రమంలో ఆధిపత్య అగ్ర కులాల వారు చేసిన కుట్రలకు బలైపోవడం జరిగింది. ఒక సామాన్య వ్యక్తి మొఘల్‌ ‌సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి బహుజనుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రజారంజకంగా పాలన అందించి చివరికి తన ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. సర్వాయి పాపన్న జీవితం నుండి అన్యాయాన్ని ఎదిరించడం,పేదప్రజలకు,తోటివారికి సాయప డటం, బహుజన కులాలను ఏకతాటిపై నిలిపి సామ్రాజ్యవాదానికివ్యతిరేకంగా పోరాటం, పాలకునిగా పేద ప్రజల సంక్షేమంకోసం సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయంను అందించడం, భూస్వామ్య వ్యతిరేక పోరాట దారులుగా ప్రజలను అణగారిన కులాల వారికి తన సైన్యంలో నాయకత్వ బాధ్యతలు అప్పగించి దళిత బహుజనులకు దానధర్మాలు చేయడం లాంటి సుగుణాలను గ్రహించవచ్చు.


– తండ సదానందం,మహబూబాబాద్‌

Leave a Reply