Take a fresh look at your lifestyle.

కెసీఆర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి: విజయశాంతి

హైదరాబాద్‌, ‌మే 14 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధప్రదేశ్‌కు చెందిన  అంబులెన్సులను తెలంగాణలోకి రాకుండా అడ్డగించడంపై  విజయశాంతి స్పందించారు. తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొందనీ,  ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం తన అధికారిక ఫేస్‌బుక్‌ ‌ద్వారా ఓ పోస్టును చేస్తూ… వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌ ‌వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నాయన్నారు.

అయినా ఈ సర్కారులో స్పందన లేదని విమర్శించారు. హాస్పిటల్‌ ‌లలో బెడ్స్ ‌కన్ఫర్మ్ ‌చేసుకుని, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ఇటీవలే  విపక్షాలతో సహా తాను ఖండించానని పేర్కొన్నారు. సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా… అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యువుకు చేరువయ్యే పరిస్థితి నెలకొందని విజయశాంతి ఆపోస్టులో వాపోయారు.

Leave a Reply