- రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అసహనం
- పట్టించుకోని అధికారులు
భూమి అమ్మకం కోసం దరఖాస్తు చేసుకోగా తహశీల్దార్ తిరస్కరించిందని మనస్తాపానికి గురయి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పరిగి నియోజక వర్గ పరిధిలోని దోమ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…దోమ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన హరిజన సత్తయ్యకు గ్రామంలో సర్వే నెంబర్ 43బి/2 లో 1.20 ఎకరాల భూమి ఉంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తనకున్న భూమిని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తికి అమ్మడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా దాన్ని మండల తహసిల్దార్ పలుమార్లు తిరస్కరించడంతో ఆవేదన చెంది గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. అదే సమయంలో పక్కన ఉన్న పలువురు అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ..తహసిల్దార్ ఎటువంటి విచారణ చేపట్టకుండా తన రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ఇప్పటికైనా స్పందించి తన ఆరోగ్య పరిస్థితి గమనించి న్యాయం చేయాలని కోరారు.
తహసిల్దార్ స్పందించకపోతే ఆందోళన చేపడతాం… భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అంజి రావణ్
కార్యాలయానికి పలు పనుల నిమిత్తమై వొచ్చే మండల ప్రజలతో తహశీల్దార్ చిరాకు పడుతూ మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన తీరు మార్చుకోవాలని అన్నారు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితునికి న్యాయం జరిగే వరకు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.