Take a fresh look at your lifestyle.

రైతు సంఘాల్లో చీలికకు కేంద్రం యత్నం… యునైటెడ్‌ ‌ఫ్రంట్‌

ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత ను వదిలించుకోవాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి ఆలోచిస్తోంది. కాంగ్రెస్‌ ‌హయాం నాటి వ్యవస్థలను క్రమంగా రద్దు చేయడమో, లేక వాటి రూపురేఖలు లేకుండా చేయడమో అజెండాగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులకు మద్ధతు ధర కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను క్రమంగా నీరుగార్చడం వల్లనే పంజాబ్‌ ‌రైతులు నిరవధికంగా ఆందోళన సాగిస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్లో క్లాజుల వారీగా చర్చలకు సిద్ధమేనంటూనే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమార్‌ ఆం‌దోళన జరుపుతున్న రైతు సంఘాల్లో చీలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు కేంద్ర మంత్రిని కలుసుకుని కొత్త వ్యవసాయ చట్టాలకు మద్ధతు ప్రకటించారు. దీనిపై ఆగ్రహం వహించిన రైతు సంఘాల యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ఆ ‌సంఘాల నాయకులను తమ ఫ్రంట్‌ ‌నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదనీ, ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఉంటే ఈ సమస్య కొంతైనా కొలిక్కి వచ్చేదని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు ఆనంద్‌ ‌శర్మ పేర్కొన్నారు.

కేంద్రానికి తమ మద్ధతు ప్రకటించిన రైతు సంఘాల నాయకుల్లో ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానా తదితర రాష్ట్రాల నాయకులు ఉన్నారు. పార్టీల పరంగా ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే కేంద్రం దేశంలో చీలికలు తెచ్చినట్టేనని యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ఆరోపించింది. 19 రోజుల నుంచి తాము రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడుపుతున్నామనీ, ఈ ఉద్యమానికి రైతుల సమస్యల పట్ల అవగాహన, సానుభూతి ఉన్నవారంతా మద్ధతు ఇస్తున్నారని వారు పేర్కొంటున్నారు. జైపూర్‌ ‌రహదారిని నిన్న దిగ్బంధం చేశారు. ఆగ్రా రహదారిపై దిగ్బంధానికి రైతులు ఉపక్రమించగా, ప్రభుత్వ దళాలు అడ్డుకున్నాయి. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా డిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ ‌సారథి కేజ్రీవాల్‌ ‌సోమవారం దీక్ష చేశారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా పంజాబ్‌లో ఒక డిఐజి రాజీనామా సమర్పించారు. జిల్లా కేంద్రాల్లో కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చుని ప్రకటనలు చేయడం తప్ప రైతు నాయకులను కలుసుకునే ప్రయత్నం చేయడం లేదనీ, దీక్షా శిబిరాలకు వొస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోతోందనీ, తాము జీవన్మరణ పోరాటం సాగిస్తున్నామని వారంటున్నారు. ప్రొక్యూర్‌ ‌మెంట్‌ ‌నుంచి ప్రభుత్వం తప్పుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయనీ, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధర ప్రైవేటు వ్యక్తులు, కొనుగోలుదారులు చెల్లించరని రైతులు అంటున్నారు. అంతేకాకుండా, రైతులను గుప్పిట్లో పెట్టుకునేందుకు కార్పొరేట్‌ ‌శక్తులు ప్రయత్నిస్తాయని వారు ఆరోపిస్తున్నారు.

తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు కార్పొరేట్‌, ‌పారిశ్రామిక వేత్తల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వ్యవసాయం సాగించాల్సి వొస్తుందని వారు అంటున్నారు. ఇది రాజకీయ సమస్య కాదనీ, కేవలం రైతుల బతుకు పోరాటమని స్పష్టం చేస్తున్నారు. మరో వంక కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టడం వల్లనే రైతులు ప్రభుత్వం ఎంత దిగివచ్చినా, ఈ సమస్య పరిష్కారానికి సహకరించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వ చేసిన ప్రతిపాదనల్లో చిత్తశుద్ధి లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఉద్యమాన్ని విరమిస్తే పూర్తిగా ప్రభుత్వం రైతులను తన గుప్పిట్లో పెట్టుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైతుల్లో ఎన్నడూ లేని సంఘీభావం వెల్లివిరుస్తోందని వారు పేర్కొంటున్నారు. కేంద్రం చేసిన ప్రతిపాదనలు కార్పొరేట్‌ ‌శక్తులకు అనుకూలంగా ఉన్నాయనీ, అసలు ఆ శక్తులను వ్యవసాయ రంగంలోకి దించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని అంటూనే జోక్యానికి ప్రయత్నిస్తోందనీ, ఇకపైన కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తలను తమపైకి ఉసిగొల్పి అయినకాడికి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌, ‌కేరళ, తమిళనాడు, తెలంగాణ, హర్యానాలకు చెందిన ఆలిండియా కిసాన్‌ ‌సంఘ్‌ ‌కోఆర్డినేషన్‌ ‌కమిటీ ప్రతినిధులు తనను కలుసుకుని కేంద్రం తెచ్చిన చట్టాలను సమర్థిస్తున్నట్టు పేర్కొన్నారని కేంద్ర మంత్రి తోమర్‌ ‌చెప్పారు. చర్చలకు ఎవరు ముందుకు వొస్తే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే, ఇది కేంద్ర మంత్రి రైతు సంఘాలలో చీలికకు చేస్తున్న ప్రయత్నంగా యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌నాయకులు కొట్టివేసారు. కేంద్రమంత్రిని కలుసుకున్న వారిలో రైతు సంఘాల ప్రతినిధులు లేరనీ, బీజేపీ అనుకూల పార్టీల నాయకులే ఉన్నారని యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌నాయకులు పేర్కొంటున్నారు. రైతు సంఘాల్లో చీలికకు ఎంత ప్రయత్నించినా తమ వజ్ర సంకల్పం ముందు కేంద్రం ఓటమి తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply