Take a fresh look at your lifestyle.

చత్తీస్‌ఘడ్‌ ఆదివాసీ గ్రామాలపై యుద్ధ హెలికాఫ్టర్ల దాడులు నిలిపివేయాలి

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాల్లో జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ ఉద్యమాలు బలంగా కొనసాగి ‘వెట్టి’కి ఘోరి కట్టి రైతాంగ హక్కులకు ఊపిరిలు పోసింది. ఆ ఉద్యమాలు 1978 నుండి 1980 వరకు కొనసాగి కల్లోలిత ప్రాంతాల చట్ట నిర్బంధాలను ఎదుర్కొన్నాయి, 1980, 1990లలో సాగిన సింగరేణి కార్మిక ఉద్యమ పోరాటాలు దేశ కార్మికోద్యను చరిత్రలోనే కీలక ఘట్టాలు, ప్రపంచ కార్మికోద్యమాన్ని అధ్యయనం చేసిన కార్మిక వర్గం అన్ని సామాజిక ఘటనల్లోనూ కార్మిక వర్గ చైతన్యంతో స్పందిస్తూ, ఉద్యమాలను కొనసాగించాయి. సింగరేణి కార్మికుడు ఒక విప్లవ చైతన్య కార్మికుడిగా జీవించడానికి అనేక త్యాగాలతో కూడిన బలమైన కార్మిక పోరాట చరిత్రను నెలకొల్పారు. దీనికి స్థానిక జగిత్యాల జైత్రయాత్ర రైతాంగం పోరాట చైతన్యం ఆదివాసీల హక్కులకై నిలబడడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. ఆ చైతన్యమే దక్షిణ భారతంలోని  దక్షిణ బస్తరు చెందిన ఆదివాసీలపై జరుగుతున్న ప్రభుత్వ యుద్ధ హెలికాప్టర్ల దాడిని ప్రశ్నిస్తున్నవి. ప్రజల ప్రాథమిక హక్కులైన ఆదివాసీల జీవించే హక్కును అమలుపరచమని ప్రభుత్వాలను డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 2005 నుండి ఆదివాసీలను సాల్వాజుడుం పేరుతో హత్యాకాండ, 2009 నుంచి ఆపరేషన్‌ ‌గ్రీన్‌ ‌హంట్‌, 2017 ‌నుంచి ఆపరేషన్‌ ‌సమాధాన్లతో అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, ‌జంగిల్‌, ‌జమీన్‌ ‌పై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ ‌భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. అడవిలోని కోట్లాది విలువైన సహజ సంపదను కొల్లగొట్టడానికి, ఆడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు మద్దత్తుగా నిలబడి ఆదివాసీలపై యుద్ధం ప్రకటించాయి. చత్తీస్గడ్‌ ‌రాష్ట్రం కోర్బా జిల్లాలోని హల్దేవ్‌ ‌దట్టమైన అడవుల ప్రాంతాన్ని 23 బొగ్గు బ్లాకులను ఆదానికి కేటాయించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దీర్ఘకాలంగా ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రభుత్వం పెట్టుబడి దారుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆదివాసులపై వేటను గ్రీన్‌ ‌హంట్‌ ‌రూపంలో 2009లో ప్రకటించింది. గ్రీన్‌ ‌హంట్‌ ఆపరేషన్‌ ఒకటవ దశ, రెండవ దశలలో వేలల్లో సాయుధ బలగాలను దించి ఊర్లను దిగ్బంధనం చేసి వందల్లో హత్యలు చేసి లక్షల్లో ఆదివాసులను విస్తాపనకు గురి చేశారు.

అయినప్పటికి అడవిపై హక్కు ఆదివాసీలదే అంటూ ఆదివాసీ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతున్నది. దాదాపు 2 దశాబ్దాలుగా జరగని అమానవీయ దాడి లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీలు మాయం కాబడ్డారు. ముక్కముక్కలుగా నరకబడ్డారు, లెక్కకందని వాకపల్లి లాంటి సామూహిక అత్యాచారం, హత్యాకాండలు ఎన్నో జరిగాయి. సుమారు 650 గ్రామాలు దగ్ధం కాబడ్డాయి. కుంట, మరాయిగూడెం, డోర్నపాల్‌, ‌వింజరం లాంటి చోట్ల సాల్వాజుడుం బేస్‌ ‌క్యాంపుల్లో 50 వేలకు పైగా ఆదివాసీలు బంధీలుగా, బానిసలుగా మార్చబడ్డారు. అవకాశం తీసుకొని అడవిలోకి వెళ్ళి కొత్త పోరాట రూపంలో నూతన మానవుని ఆవిష్కరించే రాజకీయాలతో మమేకం అవుతున్నారు. సామ్రాజ్యవాదుల వైపు భారత సైన్యం ఒక వైపు సమస్త ఆదివాసీలు మరొకవైపుగా ప్రభుత్వమే ఒక యుద్ధ పరిస్థితిని సృష్టిస్తున్నది. ప్రభుత్వం ఆదివాసీలను హత్య చేసైనా సరే, సామ్రాజ్య వాదులకు దేశ సహజ సంపదలను అందించాలనే ప్రజా వ్యతిరేక విధానమే మన సైన్యం మన దేశ ఆదివాసీలను వెంటాడి చంపుతున్నది. అందులో భాగమే చత్తీస్గడ్లో ఆదివాసీలపై యద్ధ హెలికాఫ్టర్ల దాడి.

2023 జవవరి 11న ఉదయం 11 గం?లకు ప్రారంభమైన వైమానిక, డ్రోన్‌ ‌హెలికాప్టర్‌ ‌దాడిలో గ్రేహండ్స్ ‌బలగాలు, సిఆర్పిఎఫ్‌ ‌బలగాలు పాల్గొని చత్తీస్గడ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం, పామేడు ప్రాంతాలలోని మల్కన్‌ ‌గూడ, మిట్టగూడ, బొట్టెతొంగ్‌, ‌సకిలేర్‌, ‌మాద్రాడులాడె, కన్నె మార్క, పొట్టిమాగం, బొత్తలంక, రాసపల్లి, ఎర్రపాడు గ్రామాలపై దాడి చేసి కొట్టం హంగి అనే ఆదివాసీ మహిళను హత్య చేశారు. 2023 ఏప్రిల్‌ 7‌న మరొకసారి ఉదయం 6 గం?టకు యుద్ధ హెలికాఫ్టర్లతో దాడి చేశారు. ఈ దాడిలో జబ్బగట్ట, మీనగట్ట, కవరుగట్ట, భట్టిగూడ పై యుద్ధ హెలికాప్టర్ల దాడిలో ఒక ఆదివాసి యువకుడు గాయపడ్డాడు. గతంలో కూడా 2021 ఏప్రిల్‌ 29‌న డ్రోన్లతో బాంబుదాడులు బొట్టులంక, పాలెగూడెం గ్రామాలపై చేసారు. ఎవరూ గాయపడలేదు. మరొకసారి 2022 ఏప్రిల్‌ 14, 15 అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో 50 డ్రోన్లతో అనేక బాంబులను జారవిడిచారు. అందులో కొట్టాం, రాసం, ఎర్రం, సాకిలేర్‌, ‌మడస, దూలేడ్‌, ‌కన్నెమార్క, పాటినగం, బొట్టెం గ్రామాలపై బాంబు దాడులు నిర్వహించింది. ఎవరూ మరణించలేదు. దీనిపై ఏప్రిల్‌ 19‌న 30 ప్రజా సంఘాలు, మేధావులు, హక్కుల సంఘాలు కలిసి ఒక నివేదికను బహిర్గతం  చేశారు. ప్రజలపై యుద్ధం ఆపివేయాలని, శాంతి చర్చలు కొనసాగించి శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలని డిమాండ్‌ ‌చేశారు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా హిండెస్బర్గ్ ‌నివేదిక ఆదాని అక్రమాలను ఎలాగైతే బయటికి తీసిందో, ఆదానికి ఖనిజాల కోసమే భారత ప్రభుత్వం కుట్రతో ఆదివాసీలను హత్యచేయడానికి పూనుకున్నది. ఆ ఆదానితో మిలాఖత్‌ అయిన ప్రధాని మోడి కూడా దేశ వనరులను కొల్లగొట్టుతున్నాడు. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసల్లోకి ఎదిగిన పెట్టుబడిదారులను చూసి గర్వపడుతున్న మోడీ ప్రభుత్వం వారి ఎదుగుదల కోసమే ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి ఉపా కేసులతో జైళ్ళలో నిర్బంధించి 84 ఏళ్ళ వృద్ధులను సైతం హత్య చేస్తున్న స్థితిని చూసి మనందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒరిస్సాలో పోస్కో కంపెనీపై పోరాడి విజయం సాధించిన ఒరిస్సా ప్రజలకు వెంటనే విజయ ఫలితాలు అందకుండా అంతకన్నా ఎక్కువ భూములను జిందాల్‌ ‌కంపెనీకి ఇవ్వడంతో ఏడాది కాలంగా ధింకియా ప్రాంతంలో ప్రజలు పోరాటం చేస్తున్నప్పటికీ అరెస్టులు, అణచివేతలే సాగుతున్నాయే తప్ప ప్రజల పక్షాన మాట్లాడటానికి ఆలోచించడానికి ప్రభుత్వం నిలబడడం లేదు. ఆదాని పెట్టుబడులకు అవకాశం ఇచ్చిన బస్తర్‌ ‌ప్రాంతంలో 18 చోట్ల వేలాది మందితో ప్రజలు శాంతియుతంగా దీర్ఘకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉద్యమాలను అణచడానికి మోడీ ప్రభుత్వం కాల్పులు జరుపుతూ, ఎన్‌ ‌కౌంటర్‌ ‌పేరుతో హత్యలు చేస్తున్నారు.

17 మే 2021 నుండి సిలిగేర్‌ ‌ప్రాంతంలో మిలటరీ క్యాంపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే, ముగ్గురు ఆదివాసీలను కాల్పులు జరిపి హత్య చేసి ఎన్‌ ‌కౌంటర్‌ ‌గా కథలల్లారు. ఆ క్రమంలోనే ఒక గర్భిణీ మహిళ తొక్కిసలాటలో చనిపోతే ఇప్పటి వరకు ఈ మరణాలన్నిటిపై ఒక ఎఫ్‌ఐఆర్ను కూడా నమోదు చేయలేని పరిస్థితి ప్రబుత్వంపై ఉంది. దీనిపై కలెక్టర్ను అడిగినా కూడా కేస్‌ ‌నమోదు చేసామని బుకాయింపే తప్ప ఇంత వరకు కేసు నమోదు కాలేదు. ఇప్పటికి ఆదాని గుప్పెట్లో నాలుగో స్తంభమైన మీడియా బంధించబడే ఉంది. బస్తర్‌ ‌వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామిక శాంతి ఆందోళనను ప్రపంచానికి తెలియజేయడానికి ఏ మీడియా కూడా ముందుకు రావడం లేదు. అదే హింసా రూపం తీసుకున్న ఉద్యమమైతే దానిపై అనేక రకాల అబాండాలు వేస్తూ వారు ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేస్తున్నారో దాన్ని పక్కకు దాచేస్తూ, ఆ పోరాటాన్ని ఒక ఉగ్రవాద చర్యలతో పోల్చేసి అణచివేతకు ప్రాధాన్యతనిస్తారు. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ అన్నట్టు అడవుల్లో ఉద్యమాలను ఎలా ప్రపంచం చూస్తుంది. మీడియా ఎందుకు చూపిస్తుంది. అది హింసా రూపం తీసుకుంటే తప్ప, ఆ పోరాటాలను ప్రజల ముందుకు తీసుకురారు. కావాలనే ప్రభుత్వం ప్రజా ఆందోళనా పోరాటాలను హింసారూపం వైపు నెడుతుంది. ఉద్యమం హింసా రూపం తీసుకుంటే హింస అణచివేతను ప్రయోగించడానికి ఉపయోగించుకుంటుంది.
1996 పెసా చట్టాన్ని అమలు పర్చకుండా భారీ మైనింగ్‌ ‌ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తూ (అందులో ఆదాని, అంబాని, జిందాల్‌, ఎస్‌ఆర్‌, ‌టాటా) వైమానిక దాడులను ప్రభుత్వం చేస్తున్నది. మావోయిష్ట ఉద్యమాన్ని ఒక సాకుగా మాత్రమే వాడుతున్నది. అడవుల్లోని వనుల రక్షణకు సంబంధించి పేసా చట్టం గ్రామ సభ 1/70 ఇన్ని చట్టాలున్నా వాటిని అమలు పర్చకుండా కేవలం సాయుధ పోరాటాన్ని సాకుగా చూపి ఆదివాసుల హననానికి వైమానిక దాడులను కొనసాగిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమం ఆర్థిక, సాంఘిక సమస్యగా ముందుకు వచ్చిందని 2004లో పౌరస్పందన వేదిక తరఫున సినియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ ‌శంకరన్‌ ‌శాంతి చర్చలకు అంకురార్పణ చేశారు. చిత్తశుద్ధి లేని వైఎస్‌ఆర్‌ ‌ప్రభుత్వం చర్చలు భూమి దగ్గరికి వచ్చే సరికి ముందుకు కొనసాగించలేక మళ్లీ ఎన్‌ ‌కౌంటర్లు, హత్యాకాండను కొనసాగించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తాన్ని ఏరులై పారించి చర్చలను ఆపేసారు. నక్సల్స్ ‌సమస్య వామపక్ష ఉగ్రవాదంగా చూడటమే సరియైనది కాదు. సామాజిక, ఆర్థిక, అసమానతల సమస్యగా గుర్తించకుండా, పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అనేక అర్ధ సైనిక, సైనిక, వాయుసేనా బలగాలను ఉపయోగించి ఆదివాసిల ఉ ద్యమాలను అణచివేయాలని అనుకోవడం పూర్తి అప్రజాస్వామిక పరిపాలనగా మనం చూడాలి. ఉద్యమాల అణచివేతలే పరిష్కారంగా ఎప్పుడూ ఉండవు. అది న్యాయం కూడా కాదు.

1949 అంతర్‌ ‌యుద్ధాల నేపథ్యంలో జెనివా ఒప్పందం ఉనికిలోకి వచ్చింది. దీనితో సాయుధ సంఘర్షణ ఉన్న దేశంలో సాధారణ ప్రజల నష్టాన్ని నివారించే విధంగా చర్యలు ఉండాలని ఇరువైపుగా దాన్ని పాటించాలని జెనివా ఒప్పందం పేర్కొంది. అందులో భాగంగానే మన దేశంలో నిజంగా అంతర్‌ ‌యుద్ధంగా ఆదివాసీలపై దాడులను మార్చినట్లయితే దానికి స్పష్టంగా పర్యవేక్షణ కమిటి అనేది ఒకటి ఉండాలి. లేదు అంతర్‌ ‌యుద్ధం కానట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న డెబ్బై క్యాంపుల్లో ఉన్న లక్షలాది సైనిక అర్థ సైనిక బలగాలను వెంటనే వెనక్కు రప్పించాలి. ఆదివాసీలకు అడవిపై హక్కు ఉందని, 1997లో సమతా జడ్జిమెంట్‌ ‌ప్రభుత్వం కూడా ఆదివాసీ యేతరుడుగానే గుర్తించినందున ప్రభుత్వానికి కూడా అడవిపై హక్కులేదని స్పష్టం. ఇలా ఆదివాసీల కోసం ఏర్పాటు కాబడ్డ పేసా చట్టం, గ్రామ సభ తీర్మాణం ఐదవ షెడ్యూలు అన్ని అమలు కావాల్సిన అవసరం ఉంది. ఆదివాసులపై జరుగుతున్న యుద్ధాన్ని భారత పౌరులుగా మనందరం ఎదురించాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలపై మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల మే 20న పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.
మానవ హక్కుల సంఘం నాయకులు అందించిన యధాతథ సమాచారం మేరకు..
– కాలగిరి శ్రీనివాస్‌ ‌రెడ్డి,
 రిపోర్టర్‌, ‌జగిత్యాల

Leave a Reply