Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంపై దాడి

  • 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు
  • ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపికి మంత్రి కేటీఆర్‌ ‌విజ్ఞప్తి

జీహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో 32 మంది బీజపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎం‌సి జనరల్‌ ‌బాడీ సమావేశం నిర్వహించాలన్న డిమాండ్‌తో మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించడంతో పాటు ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ ‌ఛాంబర్‌లో ఉన్న ఫర్నీచర్‌, ‌పూల కుండీలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై జీహెచ్‌ఎం‌సి అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ ‌పోలీసులు ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారన్న కారణంగా 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేశారు.

సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి కార్పొరేటర్లతో పాటు వొచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు సైఫాబాద్‌ ‌సిఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా, జీహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు, నేతల దాడి ఘటనపై మంత్రి కేటీఆర్‌ ‌కూడా స్పందించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ‌ద్వారా హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ను కోరారు. బీజేపీ పార్టీగా చెప్పుకునే కొందరు దుండగులు జీహెచ్‌ఎం‌సి కార్యాలయంపై దాడికి తెగబడ్డారనీ, ఇలాంటి ఘటనలు సరికావన్నారు. బీజేపీ కార్పొరేటర్లను శాంతి మార్గంలో నడవాలని కోరడం గాడ్సే అనుచరులను గాంధీ మార్గంలో నడవాలన్నట్లు కోరినట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ ‌నగర సిపిని కోరారు. దీంతో పోలీసులు జీహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బాధ్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply