Take a fresh look at your lifestyle.

అతివను వీడని అసమానతలు

‌ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన లింగ సమానత్వ నివేదికలో 146 దేశాలకు గాను మన దేశ ర్యాంక్‌ 135 ‌గా ఉంది.

సృష్టిలో మనుషు లమంతా సమానమే. కాకపోతే సృష్టి అవసరాల కోసం ఆడ, మగ అని వేరు చేసి ఎవరి దేహధర్మాలను వారికి ఇచ్చాడు. ఆ ధర్మాలకు అనువుగా స్త్రీ పురుషుల పని విభజన జరిగింది తప్ప ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని కాదు. అయితే లోకంలో సమానత్వం ఎక్కడుంది? చట్టాల్లో తప్ప మరెక్కడా అది కనిపించడం లేదు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్ప మరెక్కడా అది వినిపించడం లేదు.లింగ సమానత్వం ఒక దేవతావస్త్రం.మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎప్పుడూ తక్కువ సమానులే.ఒక్క ఆయుః ప్రమానంలోనే ఆడవాళ్లు ముందంజ లో ఉన్నారని చెప్పవచ్చు. మిగిలిన విషయాల్లో వెనకబడి ఉండటం కాదు వివక్షతతో వాళ్ళను వెనక్కి నెట్టేస్తున్నారు.అయితేమహిళల పట్ల వివక్షత చూపడం అనేది ఈనాటిది కాదు. పురుషాధిక్యతను చాటుకోవడానికి తర తరాల నుండి కొనసాగుతున్న ఒక బలమైన సంకుచిత భావజాలం.ప్రపంచ వ్యాప్తంగా ఈ లింగ అసమానతలు ప్రబలంగా ఉన్నాయి.అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వివక్షతలు తక్కువేం కాదు.ప్రత్యేకించి మన దేశంలో ఈ వివక్షత ఇంకా ప్రబలంగానే ఉందని చెప్పవచ్చును. ఇదే కాదుఏ అంతర్జాతీయ సూచీల నివేదికలు చూసినా ఏమున్నది గర్వకారణం భారత్‌ ‌కు మాత్రం అట్టడుగు స్ధానం పదిలం.

ఒక్క జనాభా విషయంలో తప్ప మిగిలిన అంశాలలో మనం దాదాపు వెనుకడుగే ఉన్నాం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.భారత్‌ ‌శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెనుకబడిపోయింది.ఈ విషయమె ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన లింగ సమానత్వ నివేదికలో 146 దేశాలకు గాను మన దేశ ర్యాంక్‌ 135 ‌గా ఉంది.అయితే గతంతో పోలిస్తే ఒక అయిదు పాయింట్లు పురోగతి సాధించాం అని చెప్పు కోవచ్చు. మన కన్నా హీన స్ధితిలో 11 దేశాలు ఉన్నాయి కదా అని సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ మనకన్నా 134 దేశాలు ముందు ఉన్నాయనే విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. వేదికలపై, చట్ట సభలలో మాత్రం అతివలు అవనిలో సగం ఆకాశంలో సగం అని ఆవేశంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నాం.

కానీ ఆచరణలో అవకాశాలలో మాత్రం మృగ్యం అనే విషయాన్ని గోప్యంగా ఉంచేస్తున్నాం.2016లో చూస్తే లింగ సమానత్వసూచీలో భారత్‌ ‌స్ధానం 87 కాగా మహిళా సాధికారతకు రాజీ లేని విధంగా కృషి జరుపుతున్నాం అనే నేతలకు నేడు వచ్చిన 135 వ ర్యాంక్‌ ‌కు ఏమని సమాధానం చెబుతారు.ఆనాటి నుండి నేటి వరకు ప్రమాణాలు దారుణంగా క్షీణించాయి అని అంగీకరిస్తారా?దీనికి సమాధానం మాత్రం లభించదు.రాజకీయ అవకాశాలు విషయంలో కూడా ఇదే పరిస్ధితి 2016లో రాజకీయ సాధికారతలో 9 వ స్ధానంలో నిలచిన దేశం ఈనాడు 48 వ స్ధానానికి చేరడం అనేది చాలా దయనీయ పరిస్ధితిని తెలియ చేస్తుంది.అయితే లింగ సమానతలో అగ్ర భాగాన ఉన్న దేశాల ప్రగతికి కారణం ఏమిటి అంటే ఆ దేశాలు మహిళల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాయి ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలో కూడా ప్రాధమిక హక్కులు విధులు ఆదేశిక సూత్రాలలో సైతం స్త్రీ పురుష సమానత గురించి స్పష్టంగా నిర్వచించారు.అయితే దానిని సిద్దాంతంగా మాత్రమే ప్రవచిస్తున్నాం కానీ అమలులో తీసుకురావడానికి మనకు ఏ మాత్రం సంసిద్ధత లేదు అనేది సుస్పష్టం.ఎందుకంటే ఆధునిక ప్రజాస్వామ్య పాలనలో కొనసాగుతున్న మన ఏలుబడిలో గతం కన్నా లింగ అసమనత్వం అధికం కావడం అనేది ఎంతైనా విచారించదగ్గ విషయం.

స్త్రీల పట్ల చూపే అన్నిరకాల వివక్షతలను అంతమొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం అంటూ అంతర్జాతీయ ఒడంబడికలలో అట్టహాసంగా సంతకాలు మాత్రం చేస్తున్నాం.మహిళా సాధికారత కల్పించడంలో రాజీ లేని పోరు కల్పిస్తాం అని జాతీయ విధానాన్ని ఘనంగా ప్రకటించాం.ఇన్ని చేసినా మహిళా సాధికారతకు సంబంధించి విభిన్న సూచీలలో ఏ ఏటికి ఆ ఏడు దిగజారుతూనే ఉన్నాం.స్ధానిక సంస్ధలో మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా స్ధానిక ప్రభుత్వాలలో గణనీయంగా మహిళల భాగస్వామ్యం అనేది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది.దీనిని స్వాగతించాల్సిందే.అయితే ఈ అధికారాన్ని చేపట్టిన మహిళల్లో వాస్తవ అధికారాలను వారి భర్తలు మరియు కుటుంబ సభ్యులు చేపడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం.సాధికారత అంటే ఇదా?ఇక పోతే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు తామందరం మద్దతు తెలువుతాం అంటూ ఘనంగా ప్రకటనలు ఇస్తున్న రాజకీయ పక్షాలు వాస్తవంలో మాత్రం దీనికి అడ్డు చెబుతున్న సంగతి మన అందరికి విదితమే.బాల్య వివాహాలు తగ్గలేదు.

పోషకాహార లోపంతో మరణించే స్త్రీల సంఖ్య అదుపులోకి రాలేదు.అంతకన్నా ముఖ్యంగా రోజు రోజుకు మహిళలపై దాడులు అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయాయి.గృహ హింస గురించి చెప్పనవసరమే లేదు.తాజా నివేదికలోఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల రంగాల్లో మెరుగైన పని తీరుతో గత ఏడాది కంటే ఐదు స్థానాలు మెరుగుపడినప్పటికీ, లింగ వివక్ష, ఆరోగ్యం, మనుగడ విషయంలో అట్టడుగున ఉంది. మగువల ఆర్థిక భాగస్వామ్యం ప్రాతిపదికనా మన దేశం ఇంకా అడుగు వరసలోనే ఉన్నాం. మహిళాభ్యున్నతిని కోసం నిరంతరం తపిస్తున్నామంటూ ఆరంభించిన అనేక సంక్షేమ పథకాలు,  ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల ఘోర వైఫల్యానికి ఇది ప్రబల నిదర్శనంగా చెప్పవచ్చు. ఆరోగ్యం, మనుగడ సూచీలోనైతే మన దేశం అట్టడుగు స్థానాన్ని ఆక్రమించడం ఆందోళన కలిగించే విషయంగా పరిగణించాలి.అయితే ప్రాథమిక విద్య నమోదు, తృతీయ విద్యా నమోదులో లింగ సమానత్వం పరంగా అగ్రస్థానంలో నిలిచినట్టు ఈ నివేదిక పేర్కొంది .ఇదొక్కటే మనం ఆనందించదగ్గ పరిణామం.ఈ పరిశీలనలో ప్రపంచంలో అత్యంత లింగ సమానత్వం కలిగిన దేశంగా ఐస్‌లాండ్‌ ‌మొదటి స్థానంలో నిలిచింది.

అసమానతలకు ఆజ్యం పోసిన కోవిడ్‌..
‌ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడించిన కోవిడ్‌ ‌లింగ సమానత్వంపై కూడా తన ప్రభావాన్ని చూపింది.లింగ సమానత్వ సాధనకు కోవిడ్‌ ‌తీవ్ర విఘాతం కలిగించింది.తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం సైతం మహిళా హక్కులను హరిస్తోంది.దీని ప్రభావం వలన లింగ సమానత్వాన్ని ఏకంగా ఒక తరాన్ని వెనక్కు నెట్టింది అంటూ ప్రపంచ ఆర్ధిక నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. కొవిడ్‌ ‌తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌లు, డిజిటలీకరణల వల్ల మహిళా సిబ్బంది ఎక్కువగా కలిగిన రంగాలు దెబ్బతిని, వారి ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. మహిళా సమానత్వ సాధనకు కొవిడ్‌వల్ల కలిగిన నష్టాల్లో కొన్ని శాశ్వతంగా ఇంకా కొనసాగనూవచ్చు. ఈ పరిస్థితిని మార్చడానికి సత్వరం ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ ఆర్థిక వేదిక పిలుపు ఇచ్చింది.ప్రస్తుతం నెలకొన్న పరిస్దితులలో అంతరాన్ని అంతమొందించాలి అంటే మరో 132 సంవత్సరాలు పడుతుందని తేల్చి చెప్పింది.ఇది పరిశీలించినమొత్తం 146 దేశాల్లో ప్రతి ఐదింటిలో ఒక్క దేశం మాత్రమే లింగభేదాన్ని కనీసం 1 శాతాన్ని తగ్గించాయని పేర్కొన్నది.అదేదక్షిణాసియాలో లింగ భేదం అంతరాన్ని పూడ్చాలంటే 197 ఏండ్లు పడుతుందని స్పష్టం చేసింది.

మన దేశంలో లింగ అసమానతలకు రాజకీయ, సాంకేతిక రంగాల నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువ కావడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.లింగ సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించి అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఈ అంతరం క్షీణిస్తుంది. ఇందుకు అవసరమైన చట్టాలను పాలకులు రూపొందించాలి.లింగ సమానత్వం సాధించడం అంటే, దానికి చట్టాలు మార్చడంతోపాటూ ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. చట్టాలను అర్థవంతంగా అమలు చేయాలి. దానికి అన్ని సమాజాల పురుషులు, మహిళల నుంచి దృఢమైన రాజకీయ సంకల్పం, నాయకత్వం అవసరం. ప్రబలంగా నాటుకుపోయిన సాంస్కృతిక ప్రమాణాలు, వైఖరిలో కూడా మార్పు రావాలిమొత్తానికి, చట్టం అనేది మహిళలు తమ సామర్థ్యాన్ని అడ్డుకోకుండా వెనక్కి లాగకుండా, వారిని శక్తిమంతంగా మార్చే ఒక ఆయుధంగా మారగలగిన నాడే రానున్న రోజుల్లో అయినా లింగ సమానతను సాదించగలుగుతాము.

Leave a Reply