Take a fresh look at your lifestyle.

ఉస్మానియా దవాఖానలో రోగుల ఇక్కట్లు

ఉస్మానియా దవాఖానలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి దవాఖానలోకి నీరు చేరింది. డ్రైనేజీ నీటితో వాన నీళ్లు కలిసిపోయాయి. అనూహ్యంగా నీళ్లు చేరడంతో వార్డులన్నీ నీటిలో తేలుతున్నట్లుగా ఉంది. ఈ పరిస్థితినిచూసిన రోగులు బెంబేలెత్తిపోతున్నారు. దవాఖానలో మురుగు నీటి వ్యవస్థ దారుణంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిలో నీటిలో నుంచి వచ్చి వైద్యం చేయడానికి వైద్యులు, సిబ్బంది నిరాకరించారు. ఉస్మానియా దవాఖాన ప్రాంగణంలో నిజాం కాలం నాటి డ్రైనేజీ ఉంది. శిథిలావస్తకు చేరిన ఈ దవాఖానను కూల్చి వేసి కొత్తది నిర్మిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు. దీంతో దవాఖాన సురక్షిత ప్రాంతంలో లేదనే వాదన వినిపిస్తోంది. వర్షాలు వస్తే చాలు గేటు లోపలికి నీళ్లు వచ్చేస్తున్నాయి. గత రెండు రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దవాఖానలోని ప్రధాన భవనంలోనికి వర్షపు నీరు రోగుల బెడ్ల కింది వరకు చేరింది. దవాఖానలోని డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో పాటు వర్షపు నీరు కూడా చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. బుధవారం న్యూ బ్లాక్‌, ఓల్డ్ ‌బ్లాక్‌ ‌మధ్య ఉన్న దారిలో డ్రైనేజి లీక్‌ ‌కావడంతో ఆ నీరు హాస్పిటల్‌లోకి ప్రవహించి అక్కడే నిల్వ ఉండటంతో రోగులు, వైద్యులు కదలలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోగులు, వైద్యులు నడిచే మార్గం పూర్తిగా మురికి నీటితో నిండిపోయింది. మురికి నీరు, వర్షపు నీరు కలసి పొవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఓల్డ్ ‌బ్లాక్‌ ‌నుంచి న్యూ బ్లాక్‌కు ఎవరూ వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. కాగా, ఉస్మానియా దవాఖానలో ఈ పరిస్థితి నెలకొనడానికి ఇటీవల చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణమే కారణమని తెలుస్తోంది. రెండు నెలల క్రితం దవాఖాన ఓల్డ్ ‌బిల్డింగ్‌ ‌ప్రధాన ద్వారం వద్ద సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారు. దవాఖాన భవనం కన్నా ఎక్కువ ఎత్తులో రోడ్లు ఉండటంతో వర్షపు నీరు ఉస్మానియా దవాఖానలోకి చేరింది. రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ ‌వాటిని కూడా అసంపూర్తిగా వదిలేయడంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజి నీరు పొంగిపొర్లడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు డ్రైనేజీని గత కొద్ది రోజులుగా శుభ్రం చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది.

ఉస్మానియా దుస్థితిపై రాజాసింగ్‌ ఆ‌గ్రహం
ఉస్మానియా దవాఖాన గురించి ఎవరికి చెప్పాలో? ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గతంలో తాను ఉస్మానియా దవాఖానను సందర్శించిన సందర్భంలో డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకొని ట్రీట్‌ ‌మెంట్‌ ‌చేయడాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. ఉస్మానియా దవాఖాన ఎప్పుడు కూలిపోతుందో తెలియడంలేదని, చిన్నపాటి వర్షానికే వరదలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్‌ ‌కు ప్రజల ప్రాణాల గురించి కనీస ఆలోచనలేదని విమర్శించారు. దవాఖానలో రోగులు, డాక్టర్లు ఇబ్బందిపడుతుంటే కేసీఆర్‌ ‌చూసేందుకు రాకపోవడం ఏంటని రాజాసింగ్‌ ‌ప్రశ్నించారు. హెల్త్ ‌మినిస్టర్‌ ‌తో సహా రాష్ట్రంలో ఉన్న మంత్రులు రబ్బర్‌ ‌స్టాంప్‌ ‌లే..వాళ్ళ వల్ల ఏమి కాదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం వీడి..ఉస్మానియా దవాఖానకు ఇచ్చిన హాల్ని నెరవేర్చాలని, రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల కోసం ఉస్మానియా దవాఖానలో రోగులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉస్మానియా దవాఖాన కూలిపోతే ప్రజలు కేసీఆర్‌ ‌పై మర్డర్‌ ‌కేసు పెడతారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఇదిలావుంటే గురువారం బిజెపి నేతలు ఉస్మానియాను సందర్శించాలని నిర్ణయించారు. బండి సంజయ్‌,‌లక్ష్మణ్‌, ‌రామచంద్రారవు తదితరులు ఆసుపత్రిని సందర్శిస్తారు.

హైదరాబాద్‌కు నాలుగు వైపులా దవాఖానాలు ఏమయ్యాయి : డా.లాలూ ప్రసాద్‌
‌హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మిస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్‌) ‌రాష్ట్ర అధ్యక్షుడు డా.లాలూ ప్రసాద్‌ ‌కోరారు. ఈ దవాఖానాల నిర్మాణం హామీలో ముందు వరుసలో ఉస్మానియానే ఉందన్నారు. దవాఖాన నిర్మాణానికి సంబంధించి ప్రక్రియలన్నీ గతంలోనే పూర్తయినప్పటికీ ఇంకా మొదలు పెట్టకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలున్న ఈ దవాఖాన ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల భద్రత దృష్ట్యా వెంటనే శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖాన ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Leave a Reply