Take a fresh look at your lifestyle.

దిశ చట్టంతో మహిళలకు భరోసా

  • నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలి
  • తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్న ప్రచారం చేయాలి

అమరావతి, జూలై 3 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలు చూస్తుంటే మృగాళ్లు ఎంతగా బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.విచ్చలవిడిగా వ్యవహరిస్తూ మహిళలపై దాష్టీకానికి తెగబడుతున్నారు. పట్టపగలే అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. చట్టాలంటే భయం లేకుండ పోయింది. తమను ఏం చేస్తారులే అన్న అహంకారంలో ఉన్నారు. ఇలాంటి వారిని పట్టుకుని కఠినంగా శింక్షించాలి. వారు ఊచలు లెక్కబెట్టేలా చేయాలి. ఇందుకోసం ఎపిలో గట్టి ప్రయత్నమే జరుగుతోంది. ఈ క్రమంలో దిశ చట్టం తీసుకుని రవాడం ముదావహం. దీనికోసం సిఎం తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. చట్టాన్ని రూపొందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ చట్టం వచ్చేలోగా పోక్సో తదితర చట్టాలతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎలాంటి నేరం చేసినా శిక్షించేందుకు మనుకున్న చట్టాలు సరిపోతాయి. అత్యాచారం కేసుల్లో కూడా అనేక చట్టాలు ఉన్నాయి. అయితే సిఎం జగన్‌ ‌చిత్తశుద్దిని కూడా శంకించడానికి లేదు.

ఆయనకూడా దోషులను కఠినంగా శిక్షించాలని చూస్తున్నారు. మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు సమర్థంగా పనిచేయాలని సీఎం జగన్‌ అన్నారు. మహిళల రక్షణ విషయంలో రాజీపడొద్దని, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవడంలో ఎక్కడా జాప్యం ఉండకూడదన్న హెచ్చరికలు చేశారు. మహిళలపై నేరాల విచారణకు 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రతి రెండు వారాలకోసారి కలెక్టర్లు, ఎస్పీలు సమావేశమై సక్షించాలని సూచించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలను అరికట్టే చర్యలపై ఉన్నతస్థాయి సక్ష నిర్వహించారు.గ్రామాల్లో మహిళలకు ఏ సమస్య వచ్చినా సచివాలయాల్లోని మహిళా పోలీసుల దృష్టికి తీసుకొచ్చేలా చైతన్యం తేనున్నారు. ఇకపోతే మహిళల కేసులకు సంబంధించి ఏరియాతో సంబంధం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, పీఎస్లో రిసెప్షన్‌ ‌స్నేహపూర్వకంగా ఉండాలన్నారు.

దిశ యాప్‌లోని అన్ని అంశాలపై మహిళా పోలీసులకు అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వాలని సూచించారు. ’దిశ’పై ప్రతి పీఎస్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దిశ కేసులకు సంబంధించి ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ల్లో 61 మంది ప్రత్యేక సిబ్బంది, 145 వాహనాల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రతి జిల్లా పోలీస్‌ ‌యూనిట్‌కు ఒకటి చొప్పున 18 దిశ కోర్టులు, బాలలపై నేరాలకు సంబంధించి 19 కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 దిశ పోలీసు స్టేషన్లు నిర్మాణానికి అనుమతించిన సీఎం… ఉమెన్‌ ‌హెల్ప్‌లైన్‌ 181‌ని దిశకు అనుసంధానం చేయాలన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి సత్వర విచారణ కోసం సవరించిన దిశ చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర మంత్రి స్మ•తి ఇరానీకి సీఎం జగన్‌ ‌లేఖ రాశారు. మొత్తంగా చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. అలాగే నిందితులకు సకాలంలో శిక్షలు పడితే భయం కూడా పుట్టుకుని వస్తుంది.

Leave a Reply