Take a fresh look at your lifestyle.

‌ప్రొ. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగింపు

  • తొలగిస్తూ మెమో జారీ చేసిన ఢిల్లీ రామ్‌ ‌లాల్‌ ఆనంద్‌ ‌కళాశాల
  • న్యాయస్థానంలో సవాలు చేస్తామన్న భార్య వసంత

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ : అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌జి ఎన్‌ ‌సాయిబాబాను ఢిల్లీ రామ్‌ ‌లాల్‌ ఆనంద్‌ ‌కళాశాల ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయనకు మావోయిస్ట్‌లతో సంబంధాలు ఉనాయని భావించి 2017లో కేంద్రం దోషిగా నిర్ధారించి నాగ్‌పూర్‌ ‌జైలులో ఖైదు చేస్తే సాయిబాబా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 2003లో ఢిల్లీ రామ్‌ ‌లాల్‌ ఆనంద్‌ ‌కళాశాలలో చేరిన సాయిబాబా ఇంగ్లీష్‌ అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. మహారాష్ట్ర పోలీసుల అరెస్ట్ ‌తరవాత 2014 లో సస్పెండ్‌ అయినప్పటి నుండి, అతని భార్య మరియు కుమార్తెకు కళాశాల సాయిబాబాకి ఇచ్చే జీతంలో సగం ఇస్తూ వొచ్చింది. ఇకపై ఈ ఆదాయం సాయిబాబా కుటుంబానికి ఉండదు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటుందని సాయిబాబా భార్య వసంత అన్నారు.

‘మేము కోర్టులో సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఖచ్చితంగా సవాలు చేస్తాము. అతనికి పడిన శిక్ష గురించి సవాలు చేస్తూ బొంబాయి హైకోర్టులో వేసిన మా అప్పీల్‌ ‌పెండింగ్‌లో ఉంది. విషయం సబ్‌ ‌జ్యుడిస్‌. ఇం‌కా కోర్టు నిర్ణయం తీసుకోవలసి వుంది. ఇంతలోనే కళాశాల నిర్ణయం ఇలా వచ్చింది’ అని వసంత చెప్పారు. మార్చి 31 న ఒక ‘‘మెమోరాండం’’లో ‘‘రామ్‌ ‌లాల్‌ ఆనంద్‌ ‌కాలేజీ అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌జిఎన్‌ ‌సాయిబాబా యొక్క సేవలు 2021 మార్చి 31 మధ్యాహ్నం నుండి వెంటనే తొలగించటం అయినది. మూడు నెలల జీతం అతని సేవింగ్స్ ‌బ్యాంక్‌ ‌ఖాతాలో చెల్లించబడింది.’’ అని ప్రిన్సిపాల్‌ ‌రాకేశ్‌ ‌కుమార్‌ ‌గుప్తా రాశారు. గురువారం పోస్ట్ ‌ద్వారా ఈ ఉత్తర్వులు స్వీకరించినట్లు వసంత తెలిపారు.

‘‘మేము 2019 లో షో కాజ్‌ ‌నోటీసును అందుకున్నాము. ఈ విషయంలో స్పందించే ముందు మేము సాయిబాబాను సంప్రదించవలసిన అవసరం ఉన్నందున కళాశాలను సమయం ఇవ్వాలని అర్ధించాం. గత సంవత్సరం సాయిబాబా కలవడానికి మాకు ప్రభుత్వం అవకాశం కూడా ఇవ్వలేదు’’ అని వసంత చెప్పారు. కోర్టు ఖర్చులు వాటికోసం చేసిన రుణాలు తీర్చడానికి సాయిబాబా జీతం ఉపయోగిస్తున్నట్లు వసంత చెప్పారు. సాయిబాబా భార్య వసంత గృహిణి, ఆమె కుమార్తె జామియా మిలియా ఇస్లామియా నుండి ఎంఫిల్‌ ‌చేస్తున్నారు.

సాయిబాబా డిఫెన్సె అండ్‌ ‌రిలీజ్‌ ‌కమిటీ సభ్యురాలు, ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయురాలు నందితా నరేన్‌ ‌మాట్లాడుతూ ‘‘సార్‌ ‌గీలాని (పార్లమెంట్‌ ‌దాడి కేసులో దోషిగా పరిగణించిన వ్యక్తి) విషయంలో, అతని సేవలు నిలిపివేయబడ్డాయి..కానీ రద్దు చేయబడలేదు. అతను తన కేసుల తరవాత మళ్ళీ పనిలో చేరగలిగారు… ‘‘ అని తెలిపారు. సాయిబాబా శిక్ష రద్దయితే, కళాశాల కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని కళాశాల అధికారి ఒకరు చెప్పారు.

Leave a Reply