Take a fresh look at your lifestyle.

కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు

  • ఒకే విడతలో పోలింగ్‌
  • అసోం, పశ్చిమి బెంగాలలోనూ నేడు పోలింగ్‌
  • ‌కొరోనా నిబంధనల మేరకు అధికారుల ఏర్పాట్లు.. భద్రతాచర్యలు

దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు నేడు ఒకే విడతలో పోలింగ్‌ ‌జరుగనుంది. కొరోనా నిబంధనల మేరకు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.ఈ మూడు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌, అస్సాంలో మూడో దశ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. ఇక్కడ  ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. పశ్చిమబెంగాల్లో కూడా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇక అస్సాంలో మూడో, చివరి విడత.. బెంగాల్లో 8 విడతలకుగానూ మూడో విడత ఎన్నికలు కూడా నేడు జరగనున్నాయి. ఫలితాలు మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అధికారులు కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ ఇవిఎంలను తీసుకుని తమకు కేటాయింని పోలింగ్‌ ‌కేంద్రాలకు తరలారు. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక వోట్ల లెక్కల్లో మునిగిపోయారు. ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. తమిళనాట ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్‌, ‌సినీ నటుడు కమల్‌ ‌హాసన్‌ ‌తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది వోటర్లు ఉన్నారు. పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని సెక్యులర్‌ ‌డెమొక్రటిక్‌ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆదివారం సాయంత్రం నుంచే 144 సెక్షన్‌ ‌విధించారు. మద్యం దుకాణాలు, బార్లను శనివారం రాత్రి నుంచే మూసివేశారు. ఎన్నికల పోలింగ్‌ ‌ముగిసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎన్నికల కమిషన్‌ ‌తెలిపింది.

పుదుచ్చేరిలో ఎలాగైనా పాగా వేయాలని బిజెపి యత్నిస్తుంది. తమిళనాడులో ప్రవేశానికి పుదుచ్చేరిని తొలి మెట్టుగా అది భావిస్తున్నది.  కేరళలో చివరిరోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. వోటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఉత్తర కోజికోడ్‌, ‌తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్‌ ‌కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఇక అస్సాంలో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, అధికారం కోసం కాంగ్రెస్‌ ‌కూటమి ఆరాట పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ ‌జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. కేరళలో రాష్ట్రాభివృద్దే కేంద్రంగా ఎల్‌డిఎఫ్‌ ‌ప్రచారం నిర్వహించగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ‌బిజెపిలు వామపక్ష ప్రభుత్వం ఆరోపణలు చేయడంతోనే సరిపెట్టాయి. ఇక తమిళనాడులో గత పదేళ్ల అన్నాడిఎంకె పాలన తీరుపై విరుచుకుపడుతూ డిఎంకె అధినేత స్టాలిన్‌, ‌కూటమిలోని ఇతర పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) ఈసారి అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో బిజెపి, కాంగ్రెస్‌ ‌కూటమి మధ్య పోటీ నెలకొంది.

Leave a Reply